విదేశీ పక్షుల కనువిందు

ABN , First Publish Date - 2021-01-10T05:37:09+05:30 IST

మారుమూలన, గుండ్లకమ్మ నదికి అతి సమీపంలో ఉండటంతో ప్రతిసారి విదేశీ పక్షులు వస్తుండటంతో ఆ గ్రామం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎవరినోట విన్నా విదేశీపక్షుల మాటే. ఎంతో విశిష్టత కలిగిన నైజీరియా పక్షులు బల్లికురవ మండలం వెలమవారిపాలెం గ్రామానికి ప్రతిఏటా వచ్చి కనువిందు చేస్తున్నాయి. ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి పిల్లలను చేసి తిరిగి స్వదేశానికి తరలిపోతుంటాయి.

విదేశీ పక్షుల కనువిందు
వెలమవారిపాలెంలో తుమ్మచెట్లపై గూడు ఏర్పాటు చేసుకోంటున్న విదేశీ పక్షులు

 

5,312 కిలోమీటర్ల సుదూరంలో ఉన్న నైజీరియా నుంచి 

బల్లికురవ మండలానికి రాక 

వెలమవారిపాలెంలో ఏటేటా పండగ వాతావరణం

వాటికి భద్రత, వసతి కల్పించాలని గ్రామస్థుల విజ్ఞప్తి


బల్లికురవ, జనవరి 9 : మారుమూలన, గుండ్లకమ్మ నదికి అతి సమీపంలో ఉండటంతో ప్రతిసారి విదేశీ పక్షులు వస్తుండటంతో ఆ గ్రామం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎవరినోట విన్నా విదేశీపక్షుల మాటే. ఎంతో విశిష్టత కలిగిన నైజీరియా పక్షులు బల్లికురవ మండలం వెలమవారిపాలెం గ్రామానికి ప్రతిఏటా వచ్చి కనువిందు చేస్తున్నాయి. ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి పిల్లలను చేసి తిరిగి స్వదేశానికి తరలిపోతుంటాయి. సుమారు 500 వరకు పక్షులు వస్తుంటాయి. స్థానికులు మాత్రం వాటిని తమ పిల్లల్లానే భావిస్తారు. ఇవి నివాసముండే గూళ్లకు సరైన రక్షణ లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడపక్షులు గూళ్లల్లో ఉంటే, మగ పక్షులు మేతకు వెళ్లి వస్తుంటాయి. పిల్లలు పుట్టాక పెరిగి పెద్దవి కాగానే అన్నీ కలిసి తిరిగి స్వదేశానికి వెళ్లిపోతాయని ప్రజలు చెప్తున్నారు. సుమారు 5,312 కిలోమీటర్ల దూరం నుంచి వలస వచ్చే పక్షులు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి జనవరిలో ఇక్కడకు వచ్చాయి. తుమ్మచెట్లపై గూళ్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. గ్రామానికి పక్కనే గుండ్లకమ్మ నది ఉండటంతో నైజీరియా పక్షులు వచ్చే ప్రతిసారి పెద్దఎత్తున ప్రజలు చూసేందుకు వస్తుంటారు. ఈ పక్షులకు ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోమని స్థానికులు తెలిపారు.  


సరిపడా లేని చెట్లు

వలస వచ్చిన విదేశీ పక్షులు తలదాచుకునేందుకు గ్రామంలో చెట్ల కొరత ఉంది. దీంతో ఏటేటా పక్షుల సంఖ్య తగ్గిపోతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా వచ్చిన పక్షులు ఇక్కడి వాతావరణం, వసతులు బాగున్నాయని చూశాక తిరిగి వెళ్లి మరికొన్ని పక్షులను వెంటబెట్టుకు వస్తాయి. ప్రభుత్వం వెంటనే వెలమవారిపాలెంలో మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టి, నైజీరియా పక్షులకు వసతి, రక్షణ ఏర్పాట్లుచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.  

 

వలస పక్షుల రాకతో పండుగ వాతావరణం

మా గ్రామానికి వలస పక్షులు సంక్రాంతి పండుగ ముందే వస్తుంటాయి. దీంతో పండుగ వాతావరణం మాకు ముందే వస్తుంది. దాదాపు వందేళ్ల నుంచి విదేశీ పక్షులు ఇక్కడకు వచ్చి ఉంటాయి. పక్షుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

-మామిళ్ళపల్లి చిరంజీవిరావు వెలమవారిపాలెం




Updated Date - 2021-01-10T05:37:09+05:30 IST