ఇరిగేషన్‌కు సొంత గూడు

ABN , First Publish Date - 2020-09-25T10:14:58+05:30 IST

స్వరాజ్య మైదాన్‌లో అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మాణంతో గూడును కోల్పోతున్న ఇరిగేషన్‌కు కొంత ఊరట కలిగింది. రైతుబజార్‌ ఎదురుగా ఉన్న సీపీడీసీఎల్‌ కార్యాలయంతో పాటు, న్యాయస్థానాల ఎదురుగా ఉన్న డీజీపీ క్యాంప్‌ కార్యాలయాన్ని ఇరిగేషన్‌ శాఖకు అప్పగించడానికి మార్గం సుగమమైంది.

ఇరిగేషన్‌కు సొంత గూడు

 విజయవాడ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : స్వరాజ్య మైదాన్‌లో అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మాణంతో గూడును కోల్పోతున్న ఇరిగేషన్‌కు కొంత ఊరట కలిగింది. రైతుబజార్‌ ఎదురుగా ఉన్న సీపీడీసీఎల్‌ కార్యాలయంతో పాటు, న్యాయస్థానాల ఎదురుగా ఉన్న డీజీపీ క్యాంప్‌ కార్యాలయాన్ని ఇరిగేషన్‌ శాఖకు అప్పగించడానికి మార్గం సుగమమైంది.


స్మృతివనం నిర్మాణం కారణంగా స్వరాజ్యమైదానానికి  నాలుగు వైపులా ఉన్న నిర్మాణాలను తొలగించి, ప్రాంగణాన్ని సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించాలని కలెక్టర్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంగణంలోనే ఎస్‌ఐసీ కార్యాలయంతోపాటు ఇరిగేషన్‌ శాఖలోని వివిధ భాగాలకు చెందిన 32 కార్యాలయాలున్నాయి. ఇప్పటికిప్పుడు వాటిని వేరే భవనాల్లోకి మార్చే మార్గం కనిపించలేదు.


అద్దె భవనాల్లోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. దీనిపై అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. సొంత ఆస్తులను పరాయి శాఖలకు ఇచ్చి తాము ఎక్కడో తలదాచుకోవడం ఏంటని అఽధికారులను ప్రశ్నించారు. సీపీడీసీఎల్‌ కార్యాలయం, డీజీపీ క్యాంపు కార్యాలయం భవనాలు ఇరిగేషన్‌కు శాఖకు చెందినవే. సీపీడీసీఎల్‌ కార్యాలయానికి కొన్నాళ్లుగా అద్దెను కూడా చెల్లించడం లేదు. విభజన సమయంలో హైదరాబాద్‌ నుంచి హడావిడిగా రావడంతో ఆఫీసర్స్‌ క్లబ్‌గా ఉన్న భవనాన్ని డీజీపీ క్యాంపు కార్యాలయంగా మార్చారు.


ఈ రెండు భవనాలను వెనక్కి ఇవ్వాలని ఇరిగేషన్‌ అధికారులు అడిగినప్పటికీ ఆ శాఖల నుంచి సానుకూల నిర్ణయం వెలువడలేదు. ఈ పంచాయితీ కొద్దిరోజుల క్రితం సీఎం వద్ద జరిగింది. ఆ సమావేశంలో సీపీడీసీఎల్‌ కార్యాలయం, డీజీపీ క్యాంపు కార్యాలయ భవనాలను తిరిగి ఇరిగేషన్‌ శాఖకు అప్పగించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతలను కలెక్టర్‌ ఇంతియాజ్‌కు అప్పగించారు. ఆ భవనాలు చేతికి వచ్చేస్తే గూడు దొరికినట్టేనని సిబ్బంది చెబుతున్నారు. 

Updated Date - 2020-09-25T10:14:58+05:30 IST