నిధుల నిల్‌.. దోమలు ఫుల్‌!

ABN , First Publish Date - 2022-07-27T04:58:22+05:30 IST

ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నా కరోనా విపత్తు తరువాత ప్రజారోగ్యం పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించి ఉండాలి.

నిధుల నిల్‌..   దోమలు ఫుల్‌!
నెల్లూరు : మద్రాసు బస్టాండు సెంటర్‌లో రోడ్డుపై నిల్వ ఉన్న మురుగునీటిలో దోమల దండు

పట్టణాలు, పల్లెల్లో పారిశుధ్యలేమి!

డ్రైనేజీ కాలువల్లో కదలనంటున్న మురుగు

మున్సిపల్‌, పంచాయతీల్లో నగదు కొరత

దోమల దండు నివారణలో చేతులెత్తేసిన వైనం

పిచికారీ మందు, ఇంధనం కొనలేని దయనీయం

ఇంటి పన్ను వసూలు చేయాలంటూ లింకు

జిల్లావాసుల్లో అంటువ్యాధుల భయం


పూడిపోయిన మురుగు కాలువను బాగుచేయాలంటే నిధుల్లేవ్‌. దోమల నివారణకు అవసరమైన ఆయిల్‌ బాల్స్‌ కొనడానికీ డబ్బుల్లేవు.. పోనీ మరమ్మతుకు గురైన ఫాగింగ్‌ మిషన్లు బాగు చేసుకోవడానికి, ఉన్నవాటిని వినియోగించడానికి అవసరమైన మందులు, ఇంధనం కొనుగోళ్లకు చిల్లిగవ్వ లేదు. నిధులివ్వండి మహాప్రభో అని మొత్తుకుంటే ఇంటి పన్నుతో ముడిపెడుతున్నారు. పన్ను వసూలు చేసి ఆ డబ్బుతో పారిశుధ్యం పనులు చేయండని ఉన్నతాధికారులు సెలవిస్తున్నారు. ఇంకేముంది.. ఇంటి పన్ను వసూలు అయ్యేవరకు ప్రజలపై దోమల దండు దయపెడుతాయా!? నిధులొచ్చే వరకు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌ జ్వరాలు ఉపేక్షిస్తాయా..!? 


నెల్లూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నా కరోనా విపత్తు తరువాత ప్రజారోగ్యం పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించి ఉండాలి. కానీ ప్రభుత్వాధినేత అనుకున్న కొన్ని పథకాల విషయంలో మినహా పాలనా పరంగా మరే విషయాలపైనా దృష్టి సారించడం లేదనే విమర్శలకు జిల్లాలోని పరిస్థితులు బలం చేకూర్చుతున్నాయి. వర్షాకాలం మొదలయ్యింది. ఈ సీజనలో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ. పట్టణాలు, పల్లెల్లో నిత్యం పారిశుధ్య చర్యలు చేపడితే తప్ప వ్యాధుల బారి నుంచి తప్పించుకోలేము. ముఖ్యంగా దోమల నివారణ చర్యలు అత్యంత ముఖ్యం. కానీ జిల్లాలో కేవలం కొన్ని ప్రాంతాల్లో మినహా మరెక్కడా దోమల నివారణ చర్యలు మొదలు కాలేదు. ఇదే పరిస్థితులు కొనసాగితే ఇప్పట్లో మొదలయ్యే అవకాశమే లేదు. కారణం నిధుల కొరత. మురుగు కాల్వలు శుభ్రం చేయడానికి దోమల నివారణ చర్యలు చేపట్టడానికి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత తీవ్రంగా ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో పైసా లేదు.


దోమల నివారణ చర్యలు పూజ్యం


నెల్లూరు నగరపాలక సంస్థలో రెండు పెద్ద ఫాగింగ్‌ మిషన్లు ఉన్నాయి. ఒకటి సిటీ, మరొకటి రూరల్‌ నియోజకవర్గ పరిధిలో ఫాగింగ్‌ చేస్తున్నాయి. ఒక్కొక్కటి 2 డివిజన్లు చొప్పున రోజుకు 4 డివిజన్లు ఫాగింగ్‌ చేస్తున్నట్లు మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. ఆ లెక్కన నగరవ్యాప్తంగా ప్రతి వీధిలో ప్రతి పది రోజులకు ఒకసారి ఫాగింగ్‌ జరగాలి. అది జరగడం లేదు. అసలు చాలా ప్రాంతాల్లో ఇప్పటివరకు ఒకసారి కూడా ఫాగింగ్‌ జరగలేదు. డివిజనకు ఒకటి చొప్పున హ్యాండీ ఫాగింగ్‌ మిషన్లు ఉన్నాయి. వీటిలో చాలా మరమ్మతుకు గురై ఉన్నాయి. వీటిని బాగు చేయించేందుకు పంపామని అధికారులు అంటున్నా అవి ఎప్పుడు వస్తాయో అంతుపట్టని పరిస్థితి. 

గ్రామ పంచాయతీల విషయానికి వస్తే దోమల నివారణ చర్యలు దాదాపుగా పూజ్యమనే చెప్పాలి. ఒక్కో గ్రామ పంచాయతీకి ఒక హ్యాండీ ఫాగింగ్‌ మిషన ఇచ్చారు. వీటిలో ఎన్ని ఉన్నాయో, ఎన్ని పనిచేస్తున్నాయో స్పష్టంగా చెప్పలేం కానీ అత్యధిక శాతం పంచాయతీల్లో ఫాగింగ్‌ జరగడం లేదని మాత్రం వాస్తవం. పంచాయతీల్లో నిధుల కొరతే ఇందుకు కారణం. 


ఇంటి పన్నులకు లింకు


వర్షాకాలంలో పారిశుధ్యం మెరుగు, ముఖ్యంగా దోమల నివారణకు గతంలో ప్రతి పంచాయతీకి ఎంఆర్‌హెచఎం నిధుల నుంచి 10 వేల రూపాయలు మంజూరు చేసేవారు. మూడేళ్లుగా ఈ నిధులు మంజూరు చేయడం లేదు. పంచాయతీ నిధుల నుంచే ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. నిధుల మాటెత్తితే ఇంటి పన్నులకు లింకుపెడుతున్నారు. ఇంటి పన్నులు వసూలు చేయండి... ఆ నిధులను దోమల నివారణకు ఖర్చు చేసుకోండి అని తెగేసి చెబుతుండటంతో కార్యదర్శులు ప్రజలపై పడుతున్నారు. పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి పల్లెల్లో ఇంటి పన్ను వసూలు గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు పాత బకాయిలతో సహా చెల్లించమని ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంటి ముందు మురికి కుంటలు శుభ్రం చేయమని అడిగితే ఇంటి పన్ను కట్టమని అడుగుతుండటంతో ఎందుకొచ్చిన గొడవ అని ప్రజలు మౌనం వహిస్తున్నారు. కొన్ని పెద్ద పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు చేసి, అరాకొరగా అయినా దోమల నివారణ చర్యలు చేపడుతున్నారు. 


పెరుగుతున్న మలేరియా కేసులు 


జిల్లాలో ఏ ఆసుపత్రిని పరిశీలించిన జ్వరపీడితుల సంఖ్య భారీగా కనిపిస్తోంది. రాపూరు, ఉదయగిరి, సీతారామపురం, కావలి రూరల్‌, ముత్తుకూరు, ఇందుకూరుపేట తదితర మండలాల్లో మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మలేరియా కేసులు నామమాత్రంగా ఉన్నా, ప్రైవేటు ఆసుపత్రుల సమాచారం మేరకు మలేరియా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు పారిశుధ్యంపై ముఖ్యంగా దోమల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోని పక్షంలో జిల్లావాసులు రోగాలతో పడకేసే ప్రమాదం ఉంది. 


కావలిలో చర్యలు శూన్యం


కావలిలో దోమల నివారణకు అధికారులు చేపట్టిన దాఖలాలు లేవు. ఫాగింగ్‌ మిషన్లు 6 ఉండగా అవన్నీ మరమ్మతుకు గురయ్యాయి. దోమల ఉత్పత్తికి కారణమైన లార్వాను నివారించేందుకు మురుగు కాలువల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయడంలేదు. అంతేగాక దోమల నివారణ మందు స్ర్పే చేస్తున్నామని చెబుతున్నా అదెక్కడా కనిపించడం లేదు. మరోవైపు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో మురుగు పారుదల ఏటవాలుగా సాగదు. నిత్యం కాలువల్లో చెత్తా చెదారం తొలగిస్తూ  అప్పుడప్పుడు పూడికతీస్తేనే మురుగు పారుదల జరుగుతుంది. అయితే 15 రోజులకోసారి కూడా  పూడిక తీయకపోవటంతో మురుగు నిల్వ ఉండి దోమల ఉధృతి పెరుగుతోంది.

- కావలి



కందుకూరులో నిధులు లేక..


కందుకూరు మున్సిపాలిటీలో పారిశుధ్యం పడకేసింది. ఇటీవల పారిశుధ్య కార్మికుల సమ్మె కారణంగా కాలువల్లో మురుగు పేరుకుపోగా పరిస్థితిని చక్కదిద్దే చర్యలు లేకపోవటంతో అనేక ప్రాంతాలలో కాలువలు నిండిపోయి రోడ్లపైనే మురుగు ప్రవహిస్తోంది. మరోపక్క కాలువల్లో పేరుకుపోయిన మురుగుతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమల నివారణకు మురుగుకాలువల్లో ఆయిల్‌ బాల్స్‌ వేసే కార్యక్రమాన్ని పూర్తిగా మర్చిపోయిన  అధికారులు కనీసం ఫాగింగ్‌ కూడా చేయడం లేదు. ఫాగింగ్‌ యంత్రాలు ఉన్నా ఇందనం కొనుగోలుకు నిధుల కొరత ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యవసర సేవలకు సాధారణ నిధులను వినియోగించుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నం జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు. 

- కందుకూరు



ఆత్మకూరులోనూ అంతే!

 మున్సిపాలిటీ పరిధిలో నాలుగు ఫాగింగ్‌ యంత్రాలు ఉన్నా ఇంత వరకు ఫాగింగ్‌ చేసిన దాఖలాలు లేవు. కనీసం మురుగు గుంతల్లో ఆయిల్‌బాల్స్‌ కూడా వేయకపోవడంతో దోమల ఉధృతి ఎక్కువగా ఉంది. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నా పారిశుధ్యం మెరుగుదలకు అధికారులు స్పందించడం లేదనే విమర్శలు  ఉన్నాయి. ఈ క్రమంలో అధికారులు డ్రైనేజీలు, పారిశుధ్యం మెరుగుదల, దోమల వ్యాప్తి నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

- ఆత్మకూరు





Updated Date - 2022-07-27T04:58:22+05:30 IST