నిర్వహణ నిధులు అందేదెప్పుడో..?

ABN , First Publish Date - 2021-10-23T04:42:27+05:30 IST

పాఠశాలల నిర్వహణకు ఏటా ప్రభుత్వం కేటాయించే నిధులు సక్రమంగా అందక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిర్వహణ నిధులు అందేదెప్పుడో..?
సంగంలోని ప్రాథమిక పాఠశాల

పాఠశాలలకు అందక ఇక్కట్లు

పెండింగ్‌లో సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు

ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు


సంగం, అక్టోబరు 22 : పాఠశాలల నిర్వహణకు ఏటా ప్రభుత్వం కేటాయించే నిధులు సక్రమంగా అందక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు నిలిచిపోవడంతో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా సొంతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని టీచర్లు వాపోతున్నారు. పాఠశాలల పీడీ ఖాతాల్లో జమ చేసిన అమ్మఒడి డబ్బుల నుంచి మరుగుదొడ్లు, వివిధ ఇతర నిర్వహణకు ఖర్చు చేసుకోవాలన్నా, వీలుపడక అవస్థ పడుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు.  

జిల్లాలో సుమారు 3742 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు ఉన్నాయి. ఇవికాకుండా మున్సిపాలిటీల్లో ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాల్లో సుమారు 3.75 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం పాఠశాలల నిర్వహణ కింద ఏటా నిధులు మంజూరు చేస్తారు. ఈ నిధులతో ఉపాధ్యాయులు ఆయా పాఠాల్లో మరుగుదొడ్లు, ఇతర అవసరమైన చిన్నచిన్న సమస్యలు పరిష్కరించుకుంటారు.


కేంద్రం నిధులు మంజూరు


కేంద్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరానికి సంబంధించి గత ఏడాదే నిధులు మంజూరు చేసింది. కానీ, చాలా పాఠశాలలకు ఇంతవరకు నిధులు జమ కాలేదు. గతంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీ ఉన్నత పాఠశాలల స్థాయిని బట్టి నిధులు కేటాయించేవారు. 2018-19 నుంచి విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన నిధులు కేటాయిస్తున్నారు. ఒక్కో పాఠశాలకు రూ. 12,500 నుంచి రూ. లక్ష వరకు కేటాయిస్తారు. పాఠశాలల వారీగా అధికారులు నిధులు జమ చేస్తారు. 2020-21కి జిల్లాలో గత ఏడాది సెప్టెంబరులో విద్యార్థుల సంఖ్యను బట్టి కేటాయించారు. ముందుగా బిల్లులు పెట్టుకున్న 20 శాతం పాఠశాలలు వీటిని వినియోగించుకున్నాయి. ఈ ఏడాది మార్చి తర్వాత పాఠశాలలకు సీఎఫ్‌ఎం ఎస్‌లో బిల్లులు నిలిచిపోయాయి. 

నిర్వహణ నిధులే కాకుండా కాంప్లెక్స్‌ గ్రాంట్‌ కింద ఒక్కో సముదాయానికి రూ. 21 వేలు అందిస్తారు. జిల్లాలో పాఠశాల సముదాయాల నిర్వహణ, టీఎల్‌ఎం తయారీ తదితర అవసరాలకు వీటిని వెచ్చించాల్సి ఉంది. కానీ, పైసా రాలేదు.

ఎమ్మార్పీ కేంద్రాల్లో ఒక్కోదానికి రూ. 60 వేల చొప్పున కేటాయిస్తున్నారు. ఇవి కూడా ఇంకా జమ కాలేదు. దీంతో ఎలాంటి అవసరం ఉన్నా ఉపాధ్యాయులే చేతికి డబ్బులు పెట్టుకోవాల్సిన పరస్థితి నెలకొంది. 


నిధులు కేటాయింపు ఇలా..


పాఠశాలల్లో 1- 15 విద్యార్థులుంటే రూ. 12,500, 16-100 మంది విద్యార్థులుంటే రూ. 25,000 లు, 101 - 250 మంది విద్యార్థులుంటే రూ. 50 వేలు, 251-1000 మంది విద్యార్థులుంటే రూ. 75 వేలు, వెయ్యిపైన ఉంటే రూ. లక్ష వరకు నిధులు విడుదల చేస్తారు. ఈ నిధులను రెండేళ్లుగా పీడీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఖర్చు చేసిన బిల్లులు పెడితే సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా నిధులు జమవుతాయి. ప్రస్తుతం పీడీ ఖాతాల నుంచి నిధులు సీఎఫ్‌ఎంఎస్‌కు రాగానే ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్ల్లీంచడం ద్వారా సమస్య ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇటీవల పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణకు నిధులు లేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపాధ్యాయులు ఖర్చు చేసి బిల్లులు పెట్టినా.. నిర్వహణ నిధులు జమ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.


Updated Date - 2021-10-23T04:42:27+05:30 IST