Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 27 2021 @ 18:50PM

మోదీ ర్యాలీలో పేలుళ్ల కేసు: ఎన్‌ఐఏ కోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ 2013లో పాట్నాలోని 'హుంకార్' ర్యాలీలో ప్రసంగిస్తుండగా వరుస పేలుళ్లు చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి పాట్నాలోని ఎన్ఐఏ కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. పది మంది నిందితులలో తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించింది. తగిన సాక్ష్యాలు లేనందున ఒకరిని నిర్దోషిగా ప్రకటించింది. దోషులుగా నిర్దారించిన వారికి శిక్షను నవంబర్ 1న కోర్టు ప్రకటించనుంది. గాంధీ మైదాన్‌లో జరిగిన ఈ సీరియల్ పేలుళ్ల ఘటనలో ఆరుగురుకి పైగా మృతి చెందగా, 90 మందికి పైగా గాయపడ్డారు. జనంతో కిక్కిరిసిన మైదానంలో పేలుళ్ల చోటుచేసుకున్నప్పటికీ మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించడంతో తొక్కిసలాట తప్పింది.

గాంధీ మైదాన్ సీరియల్ పేలుళ్ల కేసును 2013 నవంబర్ 6న ఎన్ఐఏ చేపట్టింది. సమగ్ర దర్యాప్తు అనంతరం 2014 ఆగస్టు 21న 11 మంది నిందితులపై చార్జిషీటు నమోదు చేసింది. మోదీ ప్రసంగించిన ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ ర్యాలీల్లో మోదీకి దగ్గరగా వెళ్లలేకపోయిన నిందితులు ఆ తర్వాత పాట్నా పేలుళ్లకు పథకం వేసినట్టు ఎన్ఐఏ పేర్కొంది. ఈ కేసులో అనుమానితులుగా ఇండియన్ ముజాహిద్దీన్‌కు చెందిన తొమ్మిది మందిని, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఎంఐ)కు చెందిన ఒక వ్యక్తిని గుర్తించి ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. నుమాన్ అన్సారీ, హైదర్ అలి అలియాస్ బ్లాక్ బ్యూటీ, మొహమ్మద్ ముజిబుల్లా అన్సారి, ఉమర్ సిద్ధిఖి, అజారుద్దీన్ ఖురేషి, అహ్మద్ హుస్సేన్, ఫఖ్రుద్దీన్, మొహమ్మద్ ఇఫ్తికర్ అలామ్‍, ఒక మైనర్‌ను నిందితులుగా గుర్తించింది. పాట్నాలోని ఓ పబ్లిక్ టాయిలెట్‌లో బాంబు ఉంచే ప్రయత్నిస్తుండగా తారఖ్ అన్సారీ అనే నిందితుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం నిందితులందరూ పాట్నా జైలులో ఉన్నారు. కాగా, పలు పేలుళ్ల ఘటనలో దోషిగా గుర్తించిన  మైనర్‌కు మాత్రం 2017 అక్టోబర్ 12న జువనైల్ జస్టిస్ బోర్డు మూడేళ్ల శిక్ష విధించింది.

Advertisement
Advertisement