Abn logo
Jun 17 2021 @ 23:33PM

ముంబై కారు బాంబు కేసులో ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’ శర్మ అరెస్ట్

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి ముందు కారు బాంబు నిలిపిన కేసు, కారు యజమాని మన్సుక్ హీరేన్ హత్య కేసుల్లో ఎన్ఐఏ అధికారులు మరో కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం శివసేనలో పనిచేస్తున్న ముంబై మాజీ పోలీస్ అధికారి, ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’ ప్రదీప్ శర్మను అరెస్ట్ చేశారు. శర్మను వైద్య పరీక్షల కోసం తొలుత జేజే ఆస్పత్రికి తరలిస్తామనీ... అనంతరం కోర్టులో ప్రవేశపెడతామని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. కాగా అంతకు ముందు ఇవాళ ఉదయం శర్మ నివాసంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవైనా ఆధారాలు లభించాయా అన్నది తెలియాల్సి ఉంది. ఈ నెల 15న ఇదే కేసుకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులను అధికారులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.