నేటి నుంచి 15వరకు సాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తి పాదయాత్ర

ABN , First Publish Date - 2022-08-08T05:02:03+05:30 IST

75 ఏళ్ల స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను వివరించడంతో పాటు స్వాతంత్య్ర సంగ్రామస్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు పాలేరునుంచి పెనుబల్లి వరకు 75కి.మీ. పాదయాత్ర నిర్వ

నేటి నుంచి 15వరకు సాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తి పాదయాత్ర

పాలేరు నుంచి పెనుబల్లి వరకు 75కిలోమీటర్ల 

స్వాతంత్ర్యోమంలో బీజేపీకి ఎలాంటి చరిత్ర లేదు

అసంతృప్తులతో మాట్లాడి అందరినీ సమన్వయం చేస్తా

విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఖమ్మం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను వివరించడంతో పాటు స్వాతంత్య్ర సంగ్రామస్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు పాలేరునుంచి పెనుబల్లి  వరకు 75కి.మీ. పాదయాత్ర నిర్వహించనున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధిష్ఠానం పిలుపుమేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ పాదయాత్రను నిర్వహించనున్నామని, ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం 9గంటలకు పాలేరు నియోజకవర్గం కూసుమంచి శివాలయం వద్ద ప్రారంభించి సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి వరకు 75కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి ఆగస్టు 15న ఉదయం జెండావిష్కరణతో ముగిస్తామన్నారు. ఈ పాదయాత్రలో తాను పాల్గొంటున్నానన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ ఘట్టాన్ని పురస్కరించుకుని బీజేపీ తామే స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినట్టు ఆర్భాటం చేయడం విడ్డూరంగా ఉందని, అసలు స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ఆ పార్టీ ప్రస్థానం ఎక్కడా లేదన్నారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌పటేల్‌ పేరును వాడుకుంటూ చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్వాతంత్ర్యోద్యమంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో చరిత్ర ఉందని, బ్రిటీష్‌వారిని పారదోలిన చరిత్ర కాంగ్రెస్‌దనని, ఎందరోమహనీయులతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన జమలాపురం కేశవరావు లాంటి వారు అనేకమంది కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ హయాంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నవభారత నిర్మాణానికి బాటలు వేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలకు విఘాతం కలిగిస్తూ దేశ వినాశనానికి  ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇక మునుగోడు కాంగ్రెస్‌కు కంచుకోటని, అక్కడ మళ్లీ హస్తానిదే విజయమన్నారు. తమ పార్టీలో అసంతృప్తితో ఉన్న వారితో సంప్రదింపులు జరిపి ఏకతాటిపైకి తెస్తానన్నారు.  అయితే కొందరు పార్టీని వీడనున్నారని, అందులో తాను కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోందని, అలాంటి వార్తలను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ‘నేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్సే నేను.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టే వారి మాయలో పడొద్దు’ అని పేర్కొన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై ప్రశ్నించగా.. ఇలాంటి విషయాలు పార్టీలో అంతర్గతంగా మాట్లాడుతామని, తమకు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నా, బీజేపీని పొగుడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పార్టీపరంగా ఆయనతో అన్ని చర్చలు జరిపామని, కానీ ఆయన పార్టీని వీడారని సమాధానమిచ్చారు. విలేకరుల సమావేశంలోజిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, రాయల నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు జావీద్‌, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:02:03+05:30 IST