ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసు

ABN , First Publish Date - 2021-04-11T00:16:25+05:30 IST

శాసన సభల ఎన్నికల ప్రక్రియలో కోవిడ్-19 మార్గదర్శకాల ఉల్లంఘనలు

ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసు

న్యూఢిల్లీ : శాసన సభల ఎన్నికల ప్రక్రియలో కోవిడ్-19 మార్గదర్శకాల ఉల్లంఘనలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌‌హెచ్ఆర్‌సీ) స్పందించింది. ఈ మార్గదర్శకాల ఉల్లంఘనలపై తీసుకున్న చర్యలు వివరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదికలను సమర్పించాలని కోరింది. సుప్రీంకోర్టు న్యాయవాది రాధాకాంత త్రిపాఠీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నోటీసులు ఇచ్చింది. 


ఎన్నికల ప్రచార సభల్లో కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించడం లేదని త్రిపాఠీ తన పిటిషన్‌లో ఆరోపించారు. మరోవైపు నిరసన కార్యక్రమాలు, వేడుకలకు సంబంధించిన సమావేశాలు జరుగుతున్నాయన్నారు. వీటన్నిటిలోనూ ‘‘రెండు గజాల దూరం పాటించాలి, మాస్క్ ధారణ తప్పనిసరి’’ అనే నినాదానికి విలువ లేకుండా పోయిందని తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ కేసులు పెరగడానికి ఈ పరిణామాలే కారణమని తెలిపారు. భారత ఎన్నికల కమిషన్, భారత ప్రభుత్వం, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కోవిడ్ మార్గదర్శకాల అమలుపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పారు. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు అనుభవిస్తున్నారని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్ విఫలమవడం వల్ల ప్రజల మానవ హక్కులకు తీవ్ర ఉల్లంఘన జరుగుతోందని వివరించారు. 


త్రిపాఠీ గతంలో ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళారు. తాజాగా ఆయన ఎన్‌హెచ్ఆర్‌సీని ఆశ్రయించారు. గతంలో ఆయన ఎన్నికల ప్రక్రియలో బాలలను ఉపయోగించడంపై ఎన్‌హెచ్ఆర్‌సీని ఆశ్రయించారు. బాలలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనరాదని ఎన్‌హెచ్ఆర్‌సీ ఆదేశాలు ఇచ్చింది. 


Updated Date - 2021-04-11T00:16:25+05:30 IST