ఎన్జీటీలో JAGAN సర్కార్‌కు మరోసారి చుక్కెదురు

ABN , First Publish Date - 2021-07-23T19:22:53+05:30 IST

జగన్ సర్కార్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో మరోసారి చుక్కెదురయ్యింది.

ఎన్జీటీలో JAGAN సర్కార్‌కు మరోసారి చుక్కెదురు

అమరావతి : జగన్ సర్కార్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో మరోసారి చుక్కెదురయ్యింది. శుక్రవారం నాడు రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిటిషన్లపై.. జస్టిస్‌ రామకృష్ణన్‌ నేతృత్వంలోని ఎన్జీటీ బెంచ్‌లో ఈ విచారణ జరిగింది. ప్రాజెక్టు సందర్శనకు ఏపీ సహకరించట్లేదని కృష్ణా బోర్డు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం పనులు చేస్తోందని పిటిషనర్‌ పేర్కొన్నారు. అయితే.. ప్రాజెక్టు సందర్శనకు పంపించాల్సిన అవసరం లేదని చెప్పిన ఏపీ ప్రభుత్వం.. తామే అక్కడి పరిస్థితులను వివరిస్తూ సమాధానం ఇస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు.. డీపీఆర్‌ తయారీకి అధ్యయనం మాత్రమే చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం వివరించింది.


ఎన్జీటీ వార్నింగ్..

కేంద్ర పర్యవరణ శాఖ, జలసంఘం అడిగిన అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్జీటీ బృందం ప్రాజెక్టును సందర్శించాలని తెలంగాణ కోరింది. అవసరమైతే హెలికాఫ్టర్‌, సౌకర్యాలు కల్పిస్తామని తెలంగాణ అదనపు ఏజీ.. ఎన్జీటీకి వివరించారు. ఏపీతో సంబంధం లేకుండా ప్రతిపాదిత ప్రాంతంలో ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నారా? లేక డీపీఆర్ కోసమే సన్నద్ధత పనులు జరుగుతున్నాయా? అని స్వయంగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కేఆర్‌ఎంబీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు-09 లోపు నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఎన్జీటీ ఆదేశించింది.


అయితే.. కృష్ణా బోర్డు పనులపై తనిఖీలు ఇప్పడే వద్దని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను ఎన్జీటీ తోసి పుచ్చింది. కృష్ణా బోర్డు నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని.. నిబంధనలు ఉల్లంఘించి పనులు జరుపుతారని భావించట్లేదని ఎన్జీటీ తెలిపింది. ఏపీ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్జీటీ హెచ్చరించింది. అనంతరం  రాయలసీమ ఎత్తిపోతలపై విచారణ ఆగస్టు-09కి ఎన్జీటీ వాయిదా వేసింది.

Updated Date - 2021-07-23T19:22:53+05:30 IST