సీమ స్కీంకు పచ్చజెండా

ABN , First Publish Date - 2020-07-14T08:22:07+05:30 IST

రాయలసీమలో కరువు నివారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌

సీమ స్కీంకు పచ్చజెండా

  • టెండర్లు పిలిచేందుకు ఎన్‌జీటీ అనుమతి
  • అయితే పనులు ప్రారంభించొద్దని ఆదేశం
  • పర్యావరణ అనుమతులు కావాలా.. వద్దా?
  • అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి
  • కేంద్ర ప్రభుత్వానికి ట్రైబ్యునల్‌ నిర్దేశం
  • తదుపరి విచారణ ఆగస్టు 11కి వాయిదా

న్యూఢిల్లీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలో కరువు నివారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) అనుమతించింది. అయితే నిర్మాణ పనులను మాత్రం ప్రారంభించవద్దని స్పష్టం చేసింది. ఈ పథకానికి పర్యావరణ అనుమతులు అవసరమో లేదో అధ్యయనం చేసి నివేదిక అందించాలని కేంద్ర పర్యావరణ శాఖను కూడా ఆదేశించింది. అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారంటూ తెలంగాణలో నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ఎన్‌జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సభ్య నిపుణుడు సైబల్‌దాస్‌ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. చెన్నైలోని ఎన్‌జీటీ ప్రాంతీయ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిగింది.


రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. ఈ కేసు కారణంగా తాము ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లలేకపోతున్నామని, దీనికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని పేర్కొన్నారు. టెండర్లను పిలవడానికి అనుమతించాలని అభ్యర్థించారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ‘పర్యావరణ అనుమతులను.. అవసరం వచ్చినప్పుడు తగిన సమయంలో తీసుకుంటామని అఫిడవిట్‌లో పేర్కొని ఇప్పుడు అనుమతులే అవసరం లేదంటున్నారు. అందుచేత మేం నియమించిన కమిటీ నివేదిక ఇచ్చాక ఏం చేయాలో నిర్ణయిస్తాం’ అని తెలిపింది. ఇది కొత్త ప్రాజెక్టు కాదని, శ్రీశైలం ప్రాజెక్టులో భాగమని వెంకటరమణి తెలిపారు. పర్యావరణ చట్టం, పర్యావరణ ప్రభావ మదింపు నిబంధనలు రాకముందే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, కాబట్టి అనుమతులు అవసరం లేదన్నారు. ఈ వాదనతో ధర్మాసనం విబేధించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు అనుమతులు తీసుకోలేదని, కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జడ్‌) నిబంధనలను రాష్ట్రప్రభుత్వం ఉల్లంఘించిందని, మడ అడవుల విషయంలోనూ పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తెలిపింది.


ఈ నేపథ్యంలో గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని, అవి కొనసాగుతాయని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టు చేపడతామని హామీ ఇస్తే కేసు విచారణను ముగిస్తామని ధర్మాసనం సూచించింది. దీనికి రాష్ట్రప్రభుత్వం అంగీకరించలేదు. పరిపాలనపరమైన ప్రక్రియ, టెండర్లు పిలవడం వంటి వాటికి అనుమతించాలని వెంకటరమణి అభ్యర్థించారు. దాంతో టెండర్లు పిలుచుకోవడానికి అనుమతించింది. కాగా.. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు సంబంధం లేదని వెంకటరమణి స్పష్టంచేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఆంధ్ర శ్రీశైలం నుంచి నీళ్లు తోడుకుంటే తెలంగాణ ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. తదుపరి విచారణను ధర్మాసనం ఆగస్టు 11కు వాయిదా వేసింది.


ఇది కొత్త ప్రాజెక్టు కాదు.. విస్తరణా కాదు

ప్రతిపాదిత రాయలసీమ ప్రాజెక్టు కొత్తది కాదని.. ఉన్న ప్రాజెక్టును విస్తరించడం లేదని.. ఆధునికీకరణ కూడా కాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ఎన్‌జీటీకి నివేదిక సమర్పించింది. రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ ప్రాజెక్టులో భాగంగా దీనిని చేపడుతున్నామని తెలిపింది. కేటాయించిన 114 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా పూర్తిగా తోడుకోలేకపోతున్నామని వివరించింది.

Updated Date - 2020-07-14T08:22:07+05:30 IST