ఎన్జీవోల నిర్వహణ కష్టమే!

ABN , First Publish Date - 2020-09-23T09:30:31+05:30 IST

పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల సవరణ చట్టం(ఎ్‌ఫసీఆర్‌ఏ) బిల్లును రాష్ట్రంలోని పలు స్వచ్ఛంద సంస్థలు ..

ఎన్జీవోల నిర్వహణ కష్టమే!

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుతో మనుగడ ప్రశ్నార్థకం.. నిర్వహణ వ్యయం 50 నుంచి 20 శాతానికి తగ్గింపు

దేశంలోని 952 సంస్థలకు విదేశీ విరాళాలే ఆధారం

ఉద్దేశపూర్వకంగానే కేంద్రం ఆంక్షలు

నిబద్ధతతో పనిచేసే సంస్థలకు నష్టం

రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థల ఆందోళన

బిల్లు వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ 


హైదరాబాద్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల సవరణ చట్టం(ఎ్‌ఫసీఆర్‌ఏ) బిల్లును రాష్ట్రంలోని పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 50 శాతం ఉన్న నిర్వహణ ఖర్చులను 20 శాతానికి తగ్గించడం వల్ల సంస్థల నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు చెల్లించడం చాలా కష్టం అని, ఈ బిల్లుతో స్వచ్ఛంద సంస్థల మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విదేశీ విరాళాలు దారిమళ్లకుండా అక్రమార్కులకు కళ్లెం వేసేందుకు కేంద్రం ప్రతిపాదించిన బిల్లు బాగానే ఉన్నప్పటికీ.. ఈ చట్టం అమల్లోకి వస్తే నిబద్ధతతో పనిచేసే సంస్థలకు భారీగా నష్టం జరుగుతుందని వాపోతున్నాయి. విరాళాల వినియోగంలో జవాబుదారీతనం కనిపించాలంటే నిస్వార్థంగా పనిచేస్తున్న సంస్థలపై ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఆర్‌ఏకు 22,447 స్వచ్ఛంద సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 21,915 సంస్థలు 2018-19కి ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేశాయి.


రాష్ట్రంలో దాదాపు 4 వేలకుపైగా స్వచ్ఛంద సంస్థలుండగా.. అందులో 952 సంస్థలకు విదేశాల నుంచి విరాళాలు వస్తున్నాయి.  వాటిలో ఎక్కువగా అనాథాశ్రమాలు, పునరావాస కేంద్రాలతో పాటు విద్య, వైద్యం, ఇతర సామాజిక సమస్యల పరిష్కారానికి పనిచేసేవే ఉన్నాయి. ప్రస్తుతం 50 శాతం విరాళాల ద్వారా నిర్వహణ, ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నాయి. విద్య, మానసిక నిపుణులకు గౌరవవేతనాలు, రవాణా, వినియోగఖర్చులకు విదేశీ విరాళాలనే ఖర్చుచేస్తున్నాయి. తాజా ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లులో 20 శాతానికి నిర్వహణ ఖర్చులను తగ్గించడంతో వాటిపై భారం పడనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రతిపాదిస్తున్న బిల్లును స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే కేంద్రం ఆంక్షలు విధిస్తోందని, ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.


ఢిల్లీ ఎస్బీఐలో ఖాతా

విదేశీ విరాళాలు స్వీకరించే ప్రతి స్వచ్ఛంద సంస్థ విధిగా కేంద్ర హోంశాఖ సూచించే ఢిల్లీలోని ఒక ఎస్బీఐ బ్రాంచీలో ఖాతాలు తెరవాలని బిల్లులో ప్రతిపాదించారు. విరాళాలను అదే ఖాతాలో జమచేయాలని, ఆ ఖాతా నుంచే సంస్థలకు చెందిన ఇతర ఖాతాలకు బదిలీ చేసుకోవాలని సూచించారు. ఎఫ్‌సీఆర్‌ఏకు దరఖాస్తు చేసుకున్న 22,447 సంస్థలకు ఢిల్లీ బ్రాంచీలో ఖాతాలు తెరవాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్రం పరిధిలో ఖాతాలుంటే లావాదేవీలు జరపడం కష్టమని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆధార్‌ కార్డు తప్పనిసరికాదని  సుప్రీం కోర్టు పదే పదే  చెబుతుంటే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల ఆధార్‌ సమర్పించాలని బిల్లులో ప్రతిపాదించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.


వేధింపులకు గురిచేసేలా బిల్లు..సునీతా కృష్ణన్‌, ఫౌండర్‌, ప్రజ్వల ఫౌండేషన్‌

కేంద్రం ప్రతిపాదించిన ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు స్వచ్ఛంద సంస్థలను వేధింపులకు గురిచేసేలా ఉంది. నిబద్ధతతో పనిచేసే సంస్థలపై భారీ దెబ్బపడనుంది. మా ప్రజ్వల ఫౌండేషన్‌కు ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువగా విరాళాలు ఇస్తున్నారు. వాటితోనే ఫౌండేషన్‌ నిర్వహణ, ఉద్యోగులకు, నిపుణులకు వేతనాలు ఇస్తున్నాం. ప్రస్తుతం తక్కువ మందికే పునరావాసం కల్పిస్తున్నా ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమవుతున్నారు. విద్యకోసం, మానసిక సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా నిపుణులున్నారు. వారికి విదేశీ విరాళాల నుంచే వేతనాలు ఇవ్వాలి. 20 శాతానికి నిర్వహణ వ్యయం తగ్గించడం వల్ల ఉద్యోగులు, నిపుణుల వేతనాలను చెల్లించడం కష్టమవుతుంది. 


స్వచ్ఛంద సంస్థలను మూసేయడానికే...మజహర్‌ హుస్సేన్‌, డైరెక్టర్‌, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ వలంటరీ ఆర్గనైజేషన్స్‌(కోవా)

దేశంలోని స్వచ్ఛంద సంస్థలను మూసేయాలనే ఉద్దేశంతోనే ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లును కేంద్రం తీసుకువస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే పేదలకు సేవచేసేందుకు ఎవరూ ముందుకురారు. విదేశీ విరాళాలతో మా ‘కోవా’ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. తాజా బిల్లుతో సేవా కార్యక్రమాలు చేయడం చాలా కష్టం. స్వచ్ఛంద సంస్థల ఆర్థిక వనరులను పిండేయడానికే ఈ బిల్లును తెచ్చారు. కేంద్ర ప్రభుత్వమే విదేశాల సాయం కోరుతోంది. వ్యాపార రంగంలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులకు అనుమతిస్తోంది.. కానీ విదేశీ విరాళాలపై ఆంక్షలు విధిస్తోంది. సమాజాభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు హాని కలిగించేలా ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు ఉంది. 

Updated Date - 2020-09-23T09:30:31+05:30 IST