వచ్చే నెల నుంచే రూ.1,000 ప్రోత్సాహకం

ABN , First Publish Date - 2022-06-28T13:58:48+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు రూ.1,000 ప్రోత్సాహక భత్యం అందించే పథకాన్ని జూలైలో

వచ్చే నెల నుంచే రూ.1,000 ప్రోత్సాహకం

                              - ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 27: ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు రూ.1,000 ప్రోత్సాహక భత్యం అందించే పథకాన్ని జూలైలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభిస్తారని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి ప్రకటించారు. సచివాలయంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలలు, అన్నా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలు, అన్నా విశ్వవిద్యాలయం తదితరాల్లో వొకేషనల్‌ కోర్సు చదివిన విద్యార్థులకు ఈ ఏడాది నుంచి 2 శాతం రిజర్వేషన్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదివి ఉన్నత విద్యలో చేరిన విద్యార్థినులకు నెలకు రూ.1,000 అందించనున్నట్లు సీఎం ప్రకటించారన్నారు. ప్రస్తుతం అర్హులైన విద్యార్థినుల జాబితా సేకరణతో పాటు, తొలిరోజే 15 వేల దరఖాస్తులు అందాయని తెలిపారు.  


ఎవరెవరు అర్హులు?

విద్యార్థినులు నెలకు రూ.1,000 పొందే పథకంలో విధివిధానాలను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. ఆ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదివినవారు, నిర్బంధ విద్యాహక్కు చట్టం పథకంలో ప్రైవేటు పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు చదివి, 9 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు అర్హులు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరంలో చేరనున్న విద్యార్థులు అడ్మిషన్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంపై సందేహాల నివృత్తికి ‘14417’ టోల్‌ ఫ్రీ నెంబరులో సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2022-06-28T13:58:48+05:30 IST