వదల ‘బొమ్మా’ళి!

ABN , First Publish Date - 2020-03-24T11:03:37+05:30 IST

మానవాళికి కునుకు లేకుండా చేస్తున్న కరోనా భయం... ప్రాణం లేని ఈ బొమ్మలోనూ మొదలైనట్టుంది కదూ! న్యూజిలాండ్‌ క్రైస్ట్‌చర్చ్‌లోనిదీ...

వదల ‘బొమ్మా’ళి!

మానవాళికి కునుకు లేకుండా చేస్తున్న కరోనా భయం... ప్రాణం లేని ఈ బొమ్మలోనూ మొదలైనట్టుంది కదూ! న్యూజిలాండ్‌ క్రైస్ట్‌చర్చ్‌లోనిదీ ‘చిత్రం’. విజృంభిస్తున్న కోవిడ్‌19 దెబ్బకు అత్యవసర సేవలు తప్ప అన్నింటినీ బంద్‌ చేస్తున్నట్టు ఆ దేశ ప్రధాని సోమవారం ప్రకటించిన నేపథ్యంలో... మాస్క్‌ తొడిగిన ఈ విగ్రహం అక్కడ అందరినీ ఆకర్షించింది.  


ఇల్లే... ఆఫీసు అయినప్పుడు...

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా తెలుగు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. కార్యాలయాలు, సంస్థలు మూతబడినా కొన్ని కంపెనీలలో ఉద్యోగులు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ చేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ వసతి ఇస్తున్నారు. ఇంట్లో ఆఫీసులో మాదిరి యూనిఫామ్‌, షూ, టై వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంతవరకు ఓకే. అయితే ఆఫీసులో ఉన్నన్ని సౌకర్యాలు ఇంటి వద్ద ఉండవు. అలాంటప్పుడు ఇంట్లోనే ఆఫీసు వాతావరణాన్ని కల్పించుకోవాలంటే...


సరైన స్థలం ఎంపిక: ఇంట్లో ఉండి ఆఫీసు పని చేయడంలో ఉండే వెసులుబాటు ఏమంటే మీకు నచ్చిన చోట కూర్చోవచ్చు. గాలి, వెలుతురు చక్కగా ఉండే గదిని ఎంచుకోవాలి. గెస్ట్‌రూమ్‌ లేదా లివింగ్‌ రూమ్‌ అయితే మీకు ప్రైవసీ లభిస్తుంది. సౌకర్యంగా ఉండడంతో చక్కగా పనిచేసుకోగలుగుతారు. రాత్రి వేళ ఎక్కువ సమయం పనిచేయాలనుకునే వారు డైనింగ్‌ టేబుల్‌ను డెస్క్‌గా వాడుకోవచ్చు. 


ఆఫీస్‌ ఫీల్‌ కోసం: సౌకర్యంగా ఉండే కుర్చీ, టేబుళ్లను ఎంచుకోవాలి. లేదంటే పని ముగిసే సరికి వెన్నునొప్పి, అలసట వచ్చే అవకాశం ఉంది. టేబుల్‌ మీద కాఫీ మగ్స్‌, ట్రెండీ నోట్‌ప్యాడ్స్‌, స్టికీ నోట్స్‌ వంటివి ఉంచుకోవాలి. ఇవి హోమ్‌ ఆఫీస్‌ ఫీల్‌ను పెంచుతాయి. దాంతో ఉత్సాహం తగ్గకుండా పనిచేస్తారు.


బ్రేక్‌ తీసుకోండి: ఆఫీసులో మధ్యమధ్యలో టీ, కాఫీ బ్రేక్‌ తీసుకుంటారు కదా! ఇంట్లో కూడా అలానే బ్రేక్‌ తీసుకొని పని మొదలెట్టండి. కొద్దిసేపు హాలులో అటూ ఇటూ నడవండి. 


బ్యాకప్‌ ఉండాలి: ఇంట్లో పనిచేసే వాళ్లు ఎదుక్కొనే సమస్య విద్యుత్‌ అంతరాయం. దీంతో పనిలో ఆలస్యమవడంతో కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీ కంప్యూటర్‌కి పవర్‌బ్యాకప్‌ ఏర్పాటు చేసుకోవాలి. 


స్ఫూర్తినిచ్చే సందేశాలు: ఇంటి దగ్గరనే ఉండి పనిచేయడం కాబట్టి ఒకింత బద్ధకం ఆవరిస్తుంది. దాంతో పనిలో వేగం తగ్గుతుంది. ‘టు డు లిస్ట్‌’ సిద్ధం చేసుకుంటే పనిలో వేగం పెరుగుతుంది. పిన్‌ బోర్డ్‌ మీద స్ఫూర్తినిచ్చే సందేశాలున్న ఇమేజెస్‌ ఏర్పాటుచేసుకుంటే మనసు తిరిగి పని మీదకు మళ్లుతుంది.

Updated Date - 2020-03-24T11:03:37+05:30 IST