HYD : ఖరీదైన బిల్డింగ్.. పేకాట ఆడుతూ పట్టుబడ్డ ప్రముఖులు.. వారిలో ఒకరు ఎమ్మెల్యేనా..!?

ABN , First Publish Date - 2022-03-01T12:13:27+05:30 IST

అదో ఖరీదైన బిల్డింగ్‌. అందులో ప్రముఖులు పేకాట ఆడుతున్నట్లు సోమవారం రాత్రి..

HYD : ఖరీదైన బిల్డింగ్.. పేకాట ఆడుతూ పట్టుబడ్డ ప్రముఖులు.. వారిలో ఒకరు ఎమ్మెల్యేనా..!?

  • ఎవరో ఆ నేత..?
  • పేకాట ఆడుతూ పట్టుబడ్డ  8 మంది..
  • వారిలో ఒకరు ఎమ్మెల్యేనా.. ఎమ్మెల్సీనా?
  • నోరువిప్పని పోలీసులు.. పెద్దలను తప్పించే యత్నం
  • మంత్రి ముఖ్య అనుచరుడి గెస్ట్‌హౌస్‌గా ప్రచారం?
  • రూ. కోటీ 50 లక్షలు స్వాధీనం.. 
  • అంతా రియల్టర్‌లేనని పోలీసుల వెల్లడి

హైదరాబాద్ సిటీ/మాదాపూర్‌ : అదో ఖరీదైన బిల్డింగ్‌. అందులో ప్రముఖులు పేకాట ఆడుతున్నట్లు సోమవారం రాత్రి సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్థాయి నాయకుడితోపాటు పలువురు రియల్టర్లు, మహిళలు ఉన్నట్లు సమాచారం. నిందితుల నుంచి రూ.కోటీ 50లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రెండు పెద్ద బ్యాగుల నిండా డబ్బును పోలీసులు తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే, పేకాట స్థావరాలపై దాడులు చేసిన అనంతరం ఎస్‌ఓటీ, సంబంధిత పోలీసులు వివరాలు వెల్లడిస్తారు. కానీ, ఈ కేసులో మాత్రం వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో ఉన్నట్లు వివరాలు బయటకు వచ్చాయి. దాంతో వారిని కాపాడే ప్రయత్నంలో పోలీసులు నిందితుల వివరాలను రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ. కోటీ 50లక్షలను కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఆ బిల్డింగ్‌ ఎవరిది..?

పోలీసులు దాడులు నిర్వహించిన ఆ బిల్డింగ్‌ (పేకాట స్థావరం) ఎవరిదనే కోణంలో నగరంలో తీవ్రమైన చర్చ జరిగింది. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత, ప్రముఖ మంత్రి అనుచరుడికి చెందిన గెస్ట్‌హౌస్‌గా మాదాపూర్‌లో జోరుగా గుసగుసలు వినిపించాయి.


పోలీసులు ఏమంటున్నారంటే..

మదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ ‘మాదాపూర్‌-6లోని కాకతీయ హిల్స్‌లో జీవీఎస్‌ విపంజి అనే అపార్టుమెంట్‌లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది. ఈ దాడిలో ఎనిమిది మంది పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. వారిలో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు’ అని వెల్లడించారు. వారి నుంచి 90లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ వారిలో శ్రీనివాస్‌, తుమ్మల శ్రీకాంత్‌, శ్రీకాంత్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, వందన, సౌజన్య, వసంతలు ఉన్నారు. ఆ ఫ్లాట్‌ శ్రీనివాస్‌ అనే వ్యక్తిదని, పట్టుబడ్డ వారిలో అధికారపార్టీకి చెందిన నాయకులు ఎవరూ లేరని, అదంతా తప్పుడు సమాచారమని ఇన్‌స్పెక్టర్‌ పేర్కొన్నారు. ఆ బిల్డింగ్‌ ఓ అధికారపార్టీ నాయకుడిదని వస్తున్న వార్తల్లో నిజంలేదన్నారు.

Updated Date - 2022-03-01T12:13:27+05:30 IST