Kuppam టౌన్‌ బ్యాంక్‌లో కుర్చీలాట.. YSRCP Vs TDP..!

ABN , First Publish Date - 2022-03-01T12:30:11+05:30 IST

రెండు మూడు రోజులకు గతంలో తొలగించిన మహిళలిద్దరినీ తాత్కాలిక ఉద్యోగులుగా తిరిగి నియమించారు.

Kuppam టౌన్‌ బ్యాంక్‌లో కుర్చీలాట.. YSRCP Vs TDP..!

  • ఖాతాదారుల ప్రయోజనాలు గాలికి 
  • గతంలో రూ.2 కోట్ల గోల్‌మాల్‌ 
  • నామినేటెడ్‌ పాలకమండళ్లతో వివాదాల మయం

చిత్తూరు జిల్లా/కుప్పం : కుప్పం పట్టణ సహకార బ్యాంక్‌లో కుర్చీలాట సాగుతోంది. రెండేళ్ల క్రితం ఏకం గా రూ.2 కోట్ల మేర అవినీతి జరగడం, దానికి బాధ్యు లుగా భావించి అప్పటి మేనేజరుతో సహా క్యాషియర్‌, క్లర్కు, అప్రైజర్‌లందరినీ తొలగించడం జిల్లాలోనే సంచలనమైంది. నాటి ఆ వివాదం నేటికి కూడా రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే భాగ్యరాజ్‌ ప్రభంజన్‌ ఛైర్మన్‌గా ఇద్దరు సభ్యులతో కూడిన త్రీమెన్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీని నియమించింది. దీంతో పాత వివాదం మళ్లీ రాజుకోవడం ప్రారంభమైంది. పాలకమండళ్లు వివాదాన్ని జటిలం చేస్తున్నాయి.


త్రీమెన్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీ బాధ్యతలు తీసుకున్న రెండు మూడు రోజులకు గతంలో తొలగించిన మహిళలిద్దరినీ తాత్కాలిక ఉద్యోగులుగా తిరిగి నియమించారు. దీంతో ముగిసిపోయిం దనుకున్న వివాదం మళ్లీ మొదలైంది. మేనేజరుగా పదోన్నతి పొంది ఆ పదవిలో కొనసాగుతున్న ఒక ఉద్యోగికి, అతనికి మద్దతు ఇస్తున్న వారికి ఈ నిర్ణయం ఏమాత్రం రుచించలేదు. రూ.2 కోట్ల కేసులో ఉద్వాసనకు గురైన మహిళా ఉద్యోగు లను తిరిగి ఎలా నియమించుకుంటారన్న ప్రశ్న వారిది. ఇదిలా ఉండగానే తిరిగి తాత్కాలిక పద్ధతిన నియమించిన మహిళ ల్లో పాత మేనేజరుగా ఉన్న మహిళను తిరిగి ఆ కుర్చీలో కూర్చోబెట్ట డానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోప ణలు వినిపిస్తూ వచ్చాయి. దీనికోసం ప్రస్తుతం మేనేజరు పదవిలో ఉన్న వ్యక్తికి పొమ్మనకుండా పొగ బెడుతున్నారన్న విమర్శ లు వినబడుతున్నాయి. అయితే ఇతడికి మేనేజరుగా ఉండగల అర్హత లేదని అతడి వాదన. 


టౌన్‌ బ్యాంక్‌లో పలు లావాదేవీలకు సంబంధించిన రికార్డులు చూపాలని ఛైర్మన్‌ కోరినా ప్రస్తుత మేనేజరు చూపడంలేదని అంటున్నారు. ఈ వివాదం చిలికిచిలికి పెద్దదైంది. సోమవారంనాడు ఇదే అంశంపై టౌన్‌ బ్యాంకులో గొడవ పెద్దదై ఎమ్మెల్సీ భరత్‌ దగ్గరికి చేరినట్లు తెలిసింది. ఇందులో రాజకీయాలు సైతం చొరబడుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ, మళ్లీ అధికార పార్టీలోనే రెండు వర్గాలు సిబ్బందిలో రెండు వర్గాలకు కొమ్ము కాస్తుండడంవల్లే ఎంతకీ తెగకుండా జీడిపాకంలా వివాదం సాగుతోంది. ఈ మధ్యలో ఖాతాదారుల గురించి, వారి ప్రయోజనాల గురించి పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఇప్పటికైనా టౌన్‌ బ్యాంక్‌ నియామకాల విషయంలో సహకార శాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన విధానాలను కఠినంగా అమలు చేస్తే ఈ వివాదాలకు తెరపడే అవకాశం ఉంటుంది. అయితే రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని అధికారులు అంతటి సాహసానికి ఒడిగడుతారన్న నమ్మకం తమకు ఏకోశానా లేదని ఖాతదారులు నోరు చప్పరిస్తున్నారు.

Updated Date - 2022-03-01T12:30:11+05:30 IST