నిమిషానికి ముగ్గురికి కొవిడ్‌

ABN , First Publish Date - 2022-01-21T08:28:08+05:30 IST

నిమిషానికి ముగ్గురికి కొవిడ్‌

నిమిషానికి ముగ్గురికి కొవిడ్‌

రాష్ట్రంలో కొత్తగా 4,207మందికి కరోనా.. పండుగ తర్వాత భారీగా పెరుగుదల


హైదరాబాద్‌, జనవరి 20(ఆంధ్రజ్యోతి): నిమిషానికి దాదాపు ముగ్గురు.. రాష్ట్రంలో గురువారం కొవిడ్‌ నిర్ధారణ అయినవారి సంఖ్య ఇది. సంక్రాంతి తర్వాత కేసులు పెరుగుతాయని ఊహించినట్లుగానే పరిస్థితి మారుతోంది. పండుగ అనంతరం రెట్టింపు నమోదవుతున్నాయి. సంక్రాంతికి ముందు రాష్ట్రంలో సగటున 1,934 కేసులు వచ్చాయి. అయితే, నాలుగు రోజులుగా 3,312 చొప్పున రికార్డవుతున్నాయి. గురువారం మొత్తం 1,20,215 పరీక్షలు నిర్వహించగా.. 4,207 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. గతుడాది మే 15వ తేదీన 4,298 పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇవే అత్యధికం. తాజా కేసుల్లో హైదరాబాద్‌లో 1,645, మేడ్చల్‌లో 380, రంగారెడ్డి జిల్లాలో 336, హనుమకొండలో 154, సంగారెడ్డిలో 107, ఖమ్మంలో 98 కేసులు వచ్చాయి. కాగా, కొన్ని రోజుల నుంచి కోలుకుంటున్నవారి కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉంటుండడంతో యాక్టివ్‌ కేసులు 25 వేలు దాటాయి. గురువారం 1,825 మంది కోలుకున్నారు. వైర్‌సతో ఇద్దరు మరణించారు.  కొత్తగా 3.18 లక్షల మందికి టీకా ఇచ్చారు. 


ఆంక్షలు మరో 11 రోజులు

కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన ఆంక్షలను ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ దాకా పొడిగించింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నెలాఖరు వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగనుంది. ఆంక్షలను పొడిగించడం ఇది రెండోసారి. కాగా, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి కరోనా సోకింది. తనకు లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు వైరస్‌ నిర్ధారణ అయింది.  సంజయ్‌కుమార్‌.. గురువారం మధ్యాహ్నం వరకు జగిత్యాలలో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కరోనా నుంచి కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందన్న వార్తలు అవాస్తవమని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లోని నీటి పారుదల శాఖ విభాగాధిపతి కార్యాలయం జలసౌధలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే కృష్ణా బోర్డు ఛైర్మన్‌ మహేంద్రప్రతా్‌పసింగ్‌తో పాటు సభ్యుడు రవికుమార్‌ పిళ్లై, ఎస్‌ఈ ప్రకాశ్‌, మరో ఇద్దరు ఉద్యోగులు వైర్‌సకు గురవగా.. తాజాగా అంతరాష్ట్ర విభాగం ఎస్‌ఈ ఒకరు కరోనా బారినపడ్డారు. ఈయన కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్‌ వచ్చింది. ఈ విభాగంలోనే మరో 9 మంది ఉద్యోగులకు కరోనా సోకింది.  కేసులు పెరుగుతుండటంతో ఉద్యోగులు సెలవు బాటపడుతున్నారు. 19 మందిపైగా కరోనా బారినపడడంతో రొటేషన్‌ అమలు చేయాలని కోరుతున్నారు. వైరస్‌ ప్రభావం తగ్గేదాకైనా సమీక్షలు ఆపాలని సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, హైదరాబాద్‌ బర్కత్‌పురలోని భవిష్య నిధి ప్రాంతీయ కార్యాలయంలో ఇప్పటికే 10 మంది ఉద్యోగులకు కొవిడ్‌ సోకింది. ముగ్గురు సిబ్బందికి పాజిటివ్‌ రావడంతో క్యాంటీన్‌ను మూసేశారు. ఖాతాదారులను అనుమతించడం లేదు. ఈ కార్యాలయంలో 500మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో 50ుమంది సిబ్బంది విధులకు హాజరు కావాలని కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వగా, ఇక్కడ మాత్రం రెండు షిఫ్టులలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. 


Updated Date - 2022-01-21T08:28:08+05:30 IST