Tirumala ఘాట్‌ రోడ్ల పునరుద్ధరణ.. సాయంత్రం 6 గంటలకు మూసివేత

ABN , First Publish Date - 2021-11-20T16:51:15+05:30 IST

ఈ వర్షంతో తిరుమలలోని లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపునీరు ..

Tirumala ఘాట్‌ రోడ్ల పునరుద్ధరణ.. సాయంత్రం 6 గంటలకు మూసివేత

  • అస్తవ్యస్తంగా శ్రీవారిమెట్టు నడక మార్గం


తిరుమల : తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో శుక్రవారం ఉదయం.. రెండో ఘాట్‌లో మధ్యాహ్నం నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. గురువారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు 190 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పదేళ్లల్లో ఇదే రికార్డు. ఈ వర్షంతో తిరుమలలోని లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపునీరు రాత్రి 10 గంటలకు అడవుల్లోకి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయ మాడవీధులతో పాటు, క్యూలైన్లలో చేరిన మట్టి, బురదను తొలగించారు. ఘాట్‌రోడ్లలో పలు ప్రదేశాల్లో కొండచరియలు విరిగపడటం, రోడ్డు సైడ్‌బేస్‌ కూలడంతో రాకపోకలు స్తంభాయించాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మొదటి ఘాట్‌రోడ్డులోనే రాకపోకలకు అనుమతించారు. గంటసేపు పైనుంచి కిందకు.. మరోగంట తిరుపతి నుంచి తిరుమలకు వాహనాలను అనుమతించారు. దీంతో అలిపిరి, తిరుమల జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద భక్తులు వాహనాల్లోనే గంటల కొద్దీ నిరీక్షించారు. రైళ్లు, బస్సు టికెట్లు కలిగిన భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పది ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లు, దాదాపు వందమంది సిబ్బందితో రెండో ఘాట్‌రోడ్డులో కూలిన మట్టి, బండరాళ్లు, చెట్లను తొలగించారు. దీంతో మధ్యాహ్నం నుంచి వాహనాలను అనుమతించడంతో ప్రయాణకష్టాలు తొలగాయి. వర్షంపడే అవకాశముందని సాయంత్రం 6 గంటలకు రెండు ఘాట్‌రోడ్లను మూసివేశారు. మొదటి ఘాట్‌రోడ్డులోని అక్కగార్ల ఆలయం వద్ద ఫుట్‌బిడ్జి కింద ఘాట్‌రోడ్డు సైడ్‌బేస్‌ కూలిపోగా ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. 


రెండో ఘాట్‌లో 9, 6 కిలోమీటర్ల వద్ద సైడ్‌ బేస్‌ కూలిపోయింది. తిరుమలలో శ్రీవారిపాదాలు, పాపవినాశన మార్గాలను శుక్రవారం కూడా మూసివేశారు. రోడ్డుపై కొట్టుకువచ్చిన రాళ్లు, మట్టిని సాయంత్రానికి తొలగించారు. మరోవైపు గురవారం నాటి భారీ వర్షంతో శ్రీవారిమెట్టు కాలిబాటలో కొండచరియలు విరిగి దూసుకువచ్చాయి. భారీ కొండరాళ్లు, మట్టితో పలు ప్రదేశాల్లో మార్గం మూసుకుపోయింది. అడుగుభాగంలో పరిచిన బండరాళ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోవడం గమనార్హం. అలిపిరి మెట్ల మార్గంలో వర్షపు నీరు జోరుగా ప్రవహించింది. ఈ రెండు నడక మార్గాలను మూసివేయడంతో భక్తులకు ఎలాంటి ప్రమాదం లేకుండా పోయింది. తిరుమలలోని రింగురోడ్డులో కూడా పలు ప్రదేశాల్లో రోడ్డు కుంగడంతో కొండచిరియలు విరిగిపడ్డాయి. గోగర్భ డ్యాము, పాపవినాశనం డ్యాంలో రెండు గేట్లను ఎత్తగా, మిగిలిన మూడు డ్యాముల్లో నీరు ఓవర్‌ఫ్లో అవుతోంది. తిరుమలను పొగమంచు కమ్మేసింది. 


డేటా సెంటర్‌ పునరుద్ధరణ

ఆర్జితం కార్యాలయం కిందభాగంలోని సర్వర్ల గదిలోకి వర్షపునీరు రావడంతో గురువారం ఆ గదికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆన్‌లైన్‌ సర్వీసులు నిలిచిపోయాయి. గదుల కేటాయింపు, కొనసాగింపు, దర్శన టికెట్ల స్కానింగ్‌ వంటి సేవను మాన్యువల్‌గా నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నానికి దీనిని పునరుద్ధరించడంతో ఆన్‌లైన్‌ సర్వీసులు మొదలయ్యాయి. 

Updated Date - 2021-11-20T16:51:15+05:30 IST