30 రోజులు దాటిందా... కరెంట్‌ బిల్లు మీరే తీసుకోవచ్చు!

ABN , First Publish Date - 2021-06-17T19:00:07+05:30 IST

కరెంట్‌ బిల్లు వచ్చి నెల రోజులు దాటిందా, మీటర్‌ రీడింగ్‌ తీసేందుకు

30 రోజులు దాటిందా... కరెంట్‌ బిల్లు మీరే తీసుకోవచ్చు!

  • సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ యాప్‌
  • యాప్‌ ద్వారా రెండు నెలల్లో 6 వేల బిల్లులు

కరెంట్‌ బిల్లు వచ్చి నెల రోజులు దాటిందా, మీటర్‌ రీడింగ్‌ తీసేందుకు సిబ్బంది ఇంటికి ఇంకా రాలేదా, బెంగ అవసరం లేదు. మీరే విద్యుత్‌ మీటర్‌ను స్కాన్‌ చేసి సెల్ఫ్‌ రీడింగ్‌ తీసుకోవచ్చు. మే నుంచి టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ ఇందుకోసం యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది.


హైదరాబాద్‌ సిటీ : కొవిడ్‌ ఎఫెక్ట్‌తో కొన్ని నెలలుగా విద్యుత్‌ బిల్లుల జారీలో ఆలస్యం అవుతోంది. దీంతో విద్యుత్‌ శాఖ ప్రత్యేకంగా కోరల్‌ ఇన్నోవేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నెల రోజులు పూర్తయినా సిబ్బంది రాకపోతే యాప్‌ సాయంతో ఎవరికివారే రీడింగ్‌ తీసుకుని బిల్లు పొందొచ్చు. డిస్కం పరిధిలో మే, జూన్‌ నెలల్లో 6 వేల మందికి పైగా సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ బిల్లులు తీసుకున్నారు. జూన్‌లో 1300 మందికి పైగా వినియోగదారులు సెల్ఫ్‌ రీడింగ్‌తో బిల్లులు తీసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ తరహా వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని విద్యుత్‌ శాఖ అంచనా వేస్తోంది. డిస్కం పరిధిలో ఒక్క రోజులో 50 లక్షల మందికి పైగా వినియోగదారులు సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ తీసుకున్నా సమస్యలు రాకుండా యాప్‌ రూపొందించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 


డౌన్‌లోడ్‌ ఇలా..

గూగుల్‌  ప్లే స్టోర్‌ నుంచి టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ ఐటీ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ తెరవగానే కన్జ్సూమర్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌ గుర్తు అందులో కనిపిస్తుంది. కొత్తగా యాప్‌ వాడుతున్నట్లయితే యునిక్‌ సర్వీస్‌ నంబర్‌, ఈ మెయిల్‌, మొబైల్‌ నంబర్‌ వంటి వివరాలు నమోదు చేయాలి. మీరు ఏ మీటర్‌ బిల్లింగ్‌ తీసుకోవాలని అనుకుంటున్నారో దాన్ని ఎంచుకోగానే మీటర్‌ స్కానింగ్‌ అని చూపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీటర్‌లో కేడబ్ల్యూహెచ్‌ అంకెలు వచ్చినప్పుడు స్కాన్‌ చేయాలి. వివరాలు కరెక్ట్‌గా ఉంటే నెక్ట్స్‌ అని చూపిస్తుంది. దానిపై నొక్కగానే ఆన్‌లైన్‌లో బిల్లు కన్పిస్తుంది. చెల్లింపు సదుపాయం కూడా అందులో ఉంటుంది. వెంటనే బిల్లు కూడా చెల్లించుకోవచ్చు. ఈ విషయాలన్నీ వినియోగదారులకు అర్థమయ్యే లా యాప్‌లో డెమో వీడియోలను తెలుగులో అందుబాటులో ఉంచారు. ఒక వేళ మీ కంటే ముందే సిబ్బంది వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసి ఉంటే బిల్‌ జనరేటెడ్‌ అనే సమాచారం వస్తుంది. వినియోగదారుడే ముందు రీడింగ్‌ స్కాన్‌ చేసి బిల్లు తీసుకుంటే సిబ్బందికి అదే సమాచారం వెళ్తుంది.


వినియోగదారులకు లాభం 

విద్యుత్‌ వినియోగదారులు నేరుగా తమ విద్యుత్‌ బిల్లులు తీసుకునేలా సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ యాప్‌ను తయారుచేశాం. టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ యాప్‌లో దీన్ని అందుబాటులోకి ఉంచాం. ఈ యాప్‌ వినియోగంతో విద్యుత్‌ సంస్థలకు, వినియోగదారులకు ఇద్దరికీ లాభం. 30 రోజుల తర్వాత రీడర్‌ రావడం ఒక్కరోజు ఆలస్యమైనా వినియోగదారుడే బిల్లు తీసుకోవచ్చు. ఈ సర్వీస్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మూడు రోజుల్లోనే మొత్తం బిల్లులు తీసుకునే అవకాశముంటుంది. - తాండ్ర సికిందర్‌రెడ్డి, వినయ్‌ భార్గవ్‌రెడ్డి, భారత సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ యాప్‌ కో ఫౌండర్స్‌

Updated Date - 2021-06-17T19:00:07+05:30 IST