ఈసీగా నిమ్మగడ్డ బాధ్యతలు ఎప్పుడు తీసుకోనున్నారంటే..

ABN , First Publish Date - 2020-05-29T23:23:02+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఇవాళ హైకోర్టు షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈసీగా నిమ్మగడ్డ బాధ్యతలు ఎప్పుడు తీసుకోనున్నారంటే..

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఇవాళ హైకోర్టు షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ తీర్పుతో గత కొన్ని రోజులుగా మూతపడ్డ ఏపీఎస్‌ఈసీ కార్యాలయం తెరుచుకోనుంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించిన తర్వాత ఏపీ ఎస్‌ఈసీ కార్యాలయానికి జీఏడీ సీల్‌ వేసింది. అయితే సోమవారం ఆఫీస్ తెరుచుకోనుంది.


ఇదిలా ఉంటే.. అదే రోజునే (సోమవారం) ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ బాధ్యతలు తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టగానే ఏమేం చేయబోతున్నారు..? ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు..? మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎలా రియాక్ట్ అవుతారో..? అనేదానిపై అన్ని పార్టీల నేతల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


నిష్పాక్షికంగా బాధ్యతలు నిర్వర్తిస్తా!

కాగా.. తీర్పు అనంతరం ఆయన మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు బాధ్యతలు తీసుకుంటున్నానని రమేశ్ కుమార్ ప్రకటించారు. గతంలో మాదిరిగానే నిష్పాక్షికంగా బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. అన్నిరాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. వ్యక్తులు కాదు.. రాజ్యాంగ సంస్థలు, విలువలు శాశ్వతమని రమేశ్ పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవారిపై వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంటుందని రమేశ్ మీడియాకు వివరించారు. మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది.

Updated Date - 2020-05-29T23:23:02+05:30 IST