ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ కళ్ళు మొత్తం `లైగర్` మీదనే ఉన్నాయి. `ఇస్మార్ట్ శంకర్` లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. `వరల్డ్ ఫేమస్ లవర్` తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నిర్మాణంలో కూడా పూరీకి భాగస్వామ్యం ఉంది. పూరీ సాధారణంగా ఆడుతూ పాడుతూ చాలా తక్కువ సమయంలో సినిమా తీసేస్తాడు. అయితే `లైగర్` విషయంలో మాత్రం పూరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.
లొకేషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాలో హీరోను పూరీ సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడట. ఈ సినిమాలో విజయ్ పాత్ర నత్తిగా మాట్లాడుతుందట. విజయ్ దేవరకొండ లాంటి భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోతో అలాంటి పాత్ర చేయించడం సాహసమే. నేషనల్ ఛాంపియన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న క్యారెక్టర్‌కి నత్తి పెట్టడం పూరీ స్పెషాలిటీ. ఇక, ఈ సినిమాలో డైలాగ్‌లు, పంచ్‌లు పూరీ తరహాలో అదిరిపోయే స్థాయిలో ఉంటాయట. సాధారణ కథనే పూరీ స్టైల్లో పూర్తి డిఫరెంట్‌గా తెరకెక్కిస్తున్నారట. ఇక, `లైగర్`కి మరో ప్లస్ పాయింట్.. రమ్యకృష్ణ. విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించిందట. కొడుకు జాతీయ ఛాంపియన్ కావాలని కలలు కంటూ, తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. రఫ్ అండ్ టఫ్‌గా ఉండే పాత్రలో రమ్య అద్భుతంగా నటించిందట.
మాస్ ఎలిమెంట్స్, లవ్, ఛాలెంజ్, పూరీ మార్కు ట్రీట్మెంట్.. వెరసి పాన్ ఇండియా ఫిల్మ్ అంటే ఏంటో `లైగర్` చూపిస్తుందని యూనిట్ విశ్వాసంగా ఉంది. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ యాభై శాతమే పూర్తయిందట. వచ్చే నెల నుంచి విదేశాల్లో ఛేజింగ్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. బాలీవుడ్ భామ అనన్యా పాండే కథానాయికగా నటిస్తోంది.