వివాదం తర్వాత Karate Kalyaniకి బిడ్డను దత్తత ఇచ్చిన వారి రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2022-05-17T17:15:43+05:30 IST

వివాదం తర్వాత Karate Kalyaniకి బిడ్డను దత్తత ఇచ్చిన వారి రియాక్షన్ ఇదీ..

వివాదం తర్వాత Karate Kalyaniకి బిడ్డను దత్తత ఇచ్చిన వారి రియాక్షన్ ఇదీ..

హైదరాబాద్‌సిటీ : కొంతకాలంగా నాపై కుట్ర జరుగుతోందని, చిన్న పిల్లలను అమ్ముకుంటున్నాని నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, పిల్లలను అమ్ముకున్నట్లు ఆధారాలు ఉంటే చూపాలని కరాటే కళ్యాణి డిమాండ్‌ చేశారు. చైల్డ్‌వెల్ఫేర్‌ అధికారులు దాడి చేసిన సమయం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆమె సోమవారం అమీర్‌పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సినిమావాళ్లకు పిల్లలను అమ్ముకుంటున్నానని ఆరోపణలు చేశారని, అంత నీచమైన స్థాయికి దిగజారలేదన్నారు. తాను ఎటూ పారిపోలేదని, పరిగెట్టించే రకాన్నని అన్నారు. ఫోన్‌లో సమస్య కారణంగా స్విచ్చాఫ్‌ అయిందని అందుకే అందుబాటులోకి రాలేకపోయానన్నారు.


సింగరేణి కాలనీలో పాప గురించి మాట్లాడితే పోక్సో కేసు పెట్టారు. తనకు పిల్లలంటే ఇష్టమని, పిల్లలు పుట్టని కారణంగా ఆడపిల్లను దత్తత తీసుకున్నానన్నారు. తాను పిల్లలను పెంచుకుంటున్న విషయంపై తన తల్లికి పూర్తిగా తెలియదన్నారు. ఏడాది తర్వాత పాపను అధికారికంగా దత్తత తీసుకుంటానన్నారు. తనపై శివశక్తి అనే సంస్థ కుట్ర చేయిస్తోందని ఆరోపించారు. ఇల్లు కొనుగోలు విషయంలో నాకు జరిగిన అన్యాయంపై ఘటకేసర్‌, దమ్మాయిగూడ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశానన్నారు. తనకు ఎలాంటి నోటీసులూ అందలేదని, రేపు కలెక్టర్‌ను కలిసి వివరిస్తానన్నారు. తాను బీజేపీలో ఉన్నందున తనపై రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు. తన వద్ద ఉన్న బాలుడు దొరికితే పెంచుకున్నానని, ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదివిస్తున్నానన్నారు.


మనస్ఫూర్తిగా దత్తత ఇచ్చాం : పాప తండ్రి గోవర్ధన్‌

మూడో డెలివరీలో పాప పుట్టిన అనంతరం నా భార్యకు ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ముగ్గురు పిల్లలను చూసుకోవడం ఇబ్బందిగా మారడంతో చిన్న పాపను దత్తత ఇద్దామని భావించాం. ఇదే  విషయాన్ని సోదరుడు వరసయ్యే శ్యామ్‌కు చెప్పాను. దత్తత కోసం ప్రాసెస్‌ ఉంటుంది, దాని కోసం మాతోనే కలిసి ఉండాలని కళ్యాణి కోరింది. ప్రస్తుతం ఆమెతోనే కలిసి ఉంటున్నాం. పాపను మనస్ఫూర్తిగా  దత్తత ఇచ్చాం.


పాప వివరాలతో కలెక్టరేట్‌కు రావాలి

కరాటే కళ్యాణి నిర్వహించిన సమావేశానికి చైల్డ్‌లైన్‌ అధికారులు వచ్చారు. పాప ఆధార్‌, బర్త్‌ సర్టిఫికెట్‌, వివరాలతో కలెక్టర్‌ కార్యాలయంలోని సీడబ్ల్యూసీ కార్యాలయానికి రావాలని సూచించారు. అంతేకాకుండా ఆమె వద్ద ఉన్న 12 ఏళ్ల బాబు వివరాలు కూడా సమర్పించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పాపను తీసుకొని రేపు కలెక్టరేట్‌కు రమ్మని సూచించారు.


నిబంధనల మేరకే దత్తత తీసుకోవాలి: కలెక్టర్‌

పిల్లలు లేని తల్లిదండ్రులు నిబంధనల ప్రకారం  దత్తత తీసుకోవాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్‌ సూచించారు. సినీనటి కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్‌లైన్‌ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై సోమవారం హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. కరాటే కళ్యాణి విషయంలో ఇప్పటికే జిల్లా స్ర్తీ,శిశు సంక్షేమాధికారులు విచారణ చేపడుతున్నారని చెప్పారు. ఇంటిలో ఆమె లేకపోవడంతో కుటుంబ సభ్యులకు మౌఖిక ఆదేశాలు జారీచేశారని తెలిపారు. సకాలంలో స్పందించకుంటే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.



Updated Date - 2022-05-17T17:15:43+05:30 IST