హైదరాబాద్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు ఇలా చేస్తున్నారేం.. అసలేం జరుగుతోంది.. !?

ABN , First Publish Date - 2022-02-06T14:46:40+05:30 IST

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు రాత్రి 10 గంటల తర్వాతే నిర్వహించాలి.. ఇవి ఉన్నతాధికారుల ఆదేశాలు. కానీ..

హైదరాబాద్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు ఇలా చేస్తున్నారేం.. అసలేం జరుగుతోంది.. !?

  • రాత్రి 7 గంటలకే తనిఖీలు 
  • భారీగా జామవుతున్న ట్రాఫిక్‌
  • గంటల తరబడి రోడ్లపై వాహనదారులు
  • అధికారులు ఆదేశాలు బేఖాతరు
  • బడాబాబుల కోసమేనా..?

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు రాత్రి 10 గంటల తర్వాతే నిర్వహించాలి.. ఇవి ఉన్నతాధికారుల ఆదేశాలు. కానీ, కొందరు ట్రాఫిక్‌ పోలీసులు రాత్రి ఏడు గంటలకే రోడ్లపై ట్రాఫిక్‌ ఆపేస్తున్నారు. అందరూ ఇళ్లకు వెళ్లే సమయంలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తుండడంతో ట్రాఫిక్‌లో చిక్కుకుని వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. 


హైదరాబాద్‌ సిటీ : ట్రాఫిక్‌కు క్రమబద్ధీకరించి.. నగరవాసులకు ఇబ్బందులు తప్పించాల్సిన పోలీసులే కొత్త సమస్యను సృష్టిస్తున్నారు. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వారితోపాటు వ్యాపారులు, ఇతరులతో నగర రోడ్లపై  రాత్రి 7 గంటల నుంచి పది గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటుంది.  ఇది చాలదన్నట్లు పోలీసులు టైం కాని టైంలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తూ ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను దిగ్బంధిస్తుండటంతో వాహనదారులు ట్రాఫిక్‌లో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.


అర్ధరాత్రి వరకు బార్లు బార్లా..

నగరంలో రాత్రి పదకొండు గంటల వరకు వైన్‌షాపులు, 11:30 వరకు బార్లు, అర్ధరాత్రి 12-1గంటల వరకు పబ్‌లు, క్లబ్‌లు తెరిచి ఉంటున్నాయి. నిజానికి మద్యం తాగి వాహనాలు నడిపే వారు రాత్రి పది గంటల తర్వాతే రోడ్లపైకి వస్తారు. ఇందులో ఎక్కువగా డబ్బున్న వారే ఉన్నట్లు పోలీసుల లెక్కలే చెబుతున్నాయి.  అలాంటి వారిని వదిలేయడానికే రాత్రి 9:30 గంటల తర్వాత చేయాల్సిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు 7:30కే ప్రారంభించి మమ అనిపించుకుంటున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తే చిరుద్యోగులు, సామాన్యులు మాత్రమే పట్టుపడతారని,  ఆ సమయంలో ట్రాఫిక్‌ ఆపి పరీక్షలు నిర్వహించాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. 


అత్యుత్సాహం..

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల విషయంలో ట్రాఫిక్‌ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం 7గంటలకే నగరంలోని పలు ప్రదాన ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్‌ చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్డు మధ్యలో బారికేడ్లు, ఫ్లెక్సీలు పెట్టి వాహనాలు ఆపేస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ఇదే విషయాన్ని వాహనదారులు గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయగా, వారు స్పందించి, రాత్రి 9.30 గంటల తర్వాత డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా, కొందరు సదరు ఆదేశాలను పట్టించుకోకుండా, ఇష్టానుసారంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 


నాలుగు రోజుల క్రితం కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి ఎదుట ట్రాఫిక్‌ పోలీసులు రాత్రి 7:30లకే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేశారు. ఇందుకోసం రోడ్డు మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ను ఆపేశారు. దీంతో  కోఠి బస్టాండ్‌ కూడలి నుంచి అబిడ్స్‌ పోస్టాఫీస్‌ సిగ్నల్‌ వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో పోలీసులు ట్రాఫిక్‌ను ఆపేయడంతో పలువురు వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసుల తీరును తప్పు పడుతున్నారు. సమయం సందర్భం లేకుండా చేస్తున్న డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-02-06T14:46:40+05:30 IST