‘గాంధీ’కి కొత్త హంగులు.. మరో నెలలో...!

ABN , First Publish Date - 2022-02-21T19:24:21+05:30 IST

పేదల ఆస్పత్రి గాంధీలో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్లుగా...

‘గాంధీ’కి కొత్త హంగులు.. మరో నెలలో...!

  • మరో నెలలో క్యాథ్‌ల్యాబ్‌
  • రూ. 6.5 కోట్ల నుంచి..
  • రూ. 8.5 కోట్ల వరకు ఖర్చు
  • యాంజీయోగ్రామ్‌, యాంజీప్లాస్టీ నిర్వహణ
  • అవసరమైన వారికి స్టంట్లు

హైదరాబాద్‌  సిటీ : పేదల ఆస్పత్రి గాంధీలో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్లుగా మూలన పడిన క్యాథ్‌ల్యాబ్‌ సేవలు మరో నెలరోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రికి గుండె సంబంధిత ఇబ్బందులతో రోజుకు 90 నుంచి 120మంది వరకు వస్తుంటారు. ఇందులో సుమారు 15మంది వరకు క్యాథ్‌ల్యాబ్‌ సేవలు అవసరమవుతాయి. గత డిసెంబర్‌ 11న ఆస్పత్రిలో సిటీస్కాన్‌, ఇతర యంత్రాలను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి హరీశ్‌రావు 45రోజుల్లో క్యాథ్‌ల్యాబ్‌ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. దీంతో జనవరి నెలాఖరు నాటికి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని భావించారు. కానీ, పనులు పూర్తి కాకపోవడం, విదేశాల నుంచి పరికరాలను తెప్పించడం వంటి కారణాలతో ఈ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ప్రైవేట్‌కు.. 

హృద్రోగ బాధితులకు వైద్యం చేసేందుకు క్యాథ్‌ల్యాబ్‌ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. క్యాథ్‌ల్యాబ్‌లో యాంజీయోగ్రామ్‌, యాంజీప్లాస్టీ వంటి వైద్య సేవలతో పాటు, సంట్లు వేస్తారు. మూడేళ్లుగా ఆస్పత్రిలో క్యాథ్‌ల్యాబ్‌ పని చేయకపోవడంతో గుండె సంబంధిత ఇబ్బందులతో వచ్చే వారికి కేవలం మందులు రాసి ఇస్తున్నారు. అత్యవసరమైన వారిని నిమ్స్‌, ఉస్మానియా ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. ఆస్పత్రిలో సరైన సేవలు అందకపోవడంతో చాలా మంది ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి. నిమ్స్‌లో యాంజీయోగ్రామ్‌ చేయాలంటే దాదాపు రూ. పది వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్టంట్‌ వేయాలంటే రూ.లక్ష వరకు భరించాల్సిందే. ఇక ప్రైవేట్‌ ఆస్పత్రులలో అయితే ఖరీదు రెండు, మూడు లక్షల వరకు అవుతుంది.


రెండు వారాల్లో యంత్రాలు.. 

కొత్త క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటు చేయడానికి పాత క్యాథ్‌ల్యాబ్‌ను పూర్తిగా కూల్చివేసి శిథిలాలు తొలగించాల్సి ఉంటుంది. ఆ దిశగా పనులు పూర్తయ్యాయి. రెండు వారాల్లో క్యాథ్‌ల్యాబ్‌కు సంబంధించిన యంత్రాలు అందుబాటులోకి వస్తాయి. జర్మనీ నుంచి వీటిని తెప్పిస్తున్నాం. వచ్చిన యంత్రాలను నేరుగా క్యాథ్‌ల్యాబ్‌కు తరలించాల్సి ఉంటుంది.  ఈ మేరకు పనులు పూర్తి చేస్తున్నాం. క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటుకు రూ.6.5 కోట్ల నుంచి రూ. 8.5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.  - డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆస్పత్రి.



Updated Date - 2022-02-21T19:24:21+05:30 IST