Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD : ఊపిరి తీసిన ఉపాధి.. భద్రతాలోపం.. కార్మికులకు శాపం.. Dial -A- సెఫ్టిక్‌ ట్యాంక్‌ ఎక్కడ..!?

  • సేఫ్టీ పరికరాలు లేకుండానే పనులు
  • ప్రాణాలు కోల్పోతున్న పలువురు
  • వీధినపడుతున్న కుటుంబాలు 
  • తాజాగా కొండాపూర్‌ ఘటనలో ఇద్దరి మృతి

హైదరాబాద్‌ సిటీ : భద్రతను పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు, సూపర్‌వైజర్లు చేపడుతున్న పనులకు కార్మికులు సమిధలవుతున్నారు. నిర్మాణ పనులు, డ్రైనేజీ, సెఫ్టిక్‌ ట్యాంక్‌లను శుభ్రం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. కొండాపూర్‌లో ఆదివారం సెఫ్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తూ మరణించిన ఇద్దరూ ఇతర జిల్లాల నుంచి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నవారు చనిపోవడంతో ఆ కుటుంబాలు వీధినపడ్డాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉపాధి కోసం నగరానికి వచ్చి వివిధ పను లు చేస్తున్నారు. వారిలో కొందరు పారిశుధ్య విభాగంతో పాటు సివరేజీ, డ్రైనేజీ పనులతో పాటు సెఫ్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసే పనులూ చేస్తున్నారు. అయితే, ఈ కార్మికుల జీవితాలకు ఎలాంటి భద్రతా ఉండడం లేదు. పనులు పూర్తి చేయడమే తప్పితే.. వారి భద్రత సూపర్‌వైజర్లు, కాంట్రాక్టర్లకు పట్టడం లేదు. నిర్మాణ రంగంలోనూ ఇదే పరిస్థితి. పనులు జరిగే చోట సేఫ్టీ పరికరాలు కనిపించవు.

గతంలో కూడా..

- 2020 నవంబర్‌ 20న ఉప్పల్‌ పారిశ్రామిక వాడలోని ఓ సెఫ్టిక్‌ ట్యాంక్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను తీసేందుకు దిగిన సెఫ్టిక్‌ ట్యాంక్‌ డ్రైవర్‌ మాలోతు భీమానాయక్‌ (35) ఘాటైన వాసనలకు సొమ్మసిల్లి చనిపోయాడు. అతడిని రక్షించేందుకు అందులోకి దిగిన ట్యాంకర్‌ యజమాని భూక్య ఊమ్లా నాయక్‌ (46) కూడా విష వాయువులకు బలయ్యారు.

- అక్టోబర్‌ 21న గచ్చిబౌలిలోని పాపిరెడ్డికాలనీ రాజీవ్‌ గృహకల్ప వద్ద గల సెఫ్టిక్‌ ట్యాంక్‌కు మూతలేకపోవడంతో గాలిపటం ఎగరవేస్తున్న ఏడేళ్ల బాలుడు అందులో పడి మరణించాడు. మూడేళ్ల క్రితం కూడా అదే కాలనీకి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు కూడా మృతి చెందాడు.

- 2018 జూలై 7న మియాపూర్‌ జనప్రియనగర్‌లో సెఫ్టిక్‌ ట్యాంక్‌ స్లాబ్‌ కూలి జీహెచ్‌ఎంసీ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుడు వెంకటేశ్‌ మృతి చెందాడు. 

- 2021 ఆగస్టు 3న బీఎన్‌రెడ్డి నగర్‌ డివిజన్‌ పద్మావతి నగర్‌ కాలనీలో రాత్రి వేళలో డ్రైనేజీని శుభ్రం చేసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగిన శివ, అంతయ్య అనే కార్మికులు మృతి చెందారు.


డయల్‌ ఏ సెఫ్టిక్‌ ట్యాంక్‌ ఎక్కడ..?

నగరంలో సెఫ్టిక్‌ ట్యాంకర్ల నిర్వహణ అడ్డగోలుగా ఉంది. హైదరాబాద్‌తో పాటు ఔటర్‌ పరిధిలోని ప్రాంతాల్లో డయల్‌ ఏ సెఫ్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ సేవలను మూడు నెలల క్రితమే వాటర్‌బోర్డులో అందుబాటులోకి తెచ్చారు. అందులో నమోదు చేసుకున్న ట్యాంకర్ల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వాటర్‌బోర్డు ఆర్డర్‌లు తీసుకోకుండా సొంతంగా క్లీనింగ్‌ పనులు ఒప్పుకుంటున్నారు. నగరంలో వ్యర్థాల నిర్వహణ, క్లీనింగ్‌ కోసం వాటర్‌బోర్డు డయల్‌ ఏ సెఫ్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ను జూలై 17న అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు ప్రారంభమయ్యే నాటికి నగరవ్యాప్తంగా 87 సెఫ్టిక్‌ ట్యాంకర్లు నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతం వందకు పైగా ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భద్రతా సామాగ్రితో పాటు కార్మికులకు ప్రత్యేక యూనిఫాం అందజేశారు. కానీ కాంట్రాక్టర్లు భద్రత సామగ్రిని వదిలేశారు.

కొండాపూర్‌ ఘటన ఈ కోవకే..

కొండాపూర్‌ ఘటనకు చెందిన ట్యాంకర్‌ డయల్‌ ఏ సెఫ్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ సేవలో నమోదై ఉంది. కానీ జూలై నెల చివరలో ఒక ఆర్డర్‌కు మాత్రమే యజమాని సేవలను అందించారు. సొంతంగా వచ్చిన బుకింగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. స్వతాహాగా పనులు చేసే క్రమంలోనే కార్మికులు చనిపోయారు. సెఫ్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ పనిలో ఉన్న నలుగురు కార్మికులకూ భద్రత పరికరాలు లేవు. గ్లౌజ్‌లు, మాస్క్‌ కూడా లేకుండానే పనులు చేయడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.


చార్జీలు తక్కువగా ఉండడంతోనే..

‘డయల్‌ ఏ సెఫ్టిక్‌ టాంక్‌ క్లీనింగ్‌’ ద్వారా వాటర్‌బోర్డు నిర్ణయించిన చార్జీలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని కొందరు చెబుతున్నారు. బోర్డు నిర్ణయించిన ప్రకారం ధర రూ.800 నుంచి రూ.1400. ప్రైవేటుగా చేసుకుంటే ట్యాంకర్‌కు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వస్తుండడంతో ట్యాంకర్‌ యజమానులు అటువైపే దృష్టి సారిస్తున్నారు.


సింగరేణి కాలనీ బస్తీలో విషాదం

సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ కార్మికులు మృతి చెందడంతో సైదాబాద్‌ సింగరేణి కాలనీ బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీను నాయక్‌(40), నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు చెందిన అంజి (35) ఇదే బస్తీలో నివాసముంటున్నారు. ఈ ఘటనలో ఇదే బస్తీకి  చెందిన మరో కార్మికుడు గన్ను (33) తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement
Advertisement