ఆ ఫ్లాట్లపై మళ్లీ అనుమానాలు.. ఇంతకీ అవి పైరవీలకా.. ప్రజలకా..!?

ABN , First Publish Date - 2022-05-19T15:17:44+05:30 IST

ఆ ఫ్లాట్లపై మళ్లీ అనుమానాలు.. ఇంతకీ అవి పైరవీలకా.. ప్రజలకా..!?

ఆ ఫ్లాట్లపై మళ్లీ అనుమానాలు.. ఇంతకీ అవి పైరవీలకా.. ప్రజలకా..!?

  • రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల వేలంలో అనుమానాలు
  • ఆన్‌లైన్‌ లాటరీ పద్ధతిపై విశ్వసనీయత కరువు

హైదరాబాద్‌ సిటీ : రాజీవ్‌ స్వగృహ, హెచ్‌ఎండీఏ (HMDA) సంయుక్తంగా విక్రయానికి పెట్టిన బండ్లగూడ, పోచారంలోని అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల ఖరారుపై పలు అనుమానాలు (Doubt) తెరపైకి వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో లాటరీ పద్ధతిలో ఖరారు చేస్తామని అధికారులు ప్రకటించినా.. పలుకుబడి, పైరవీలు చేసేవారికే ఫ్లాట్లు దక్కుతాయా.. అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్ల విక్రయానికి హెచ్‌ఎండీఏ ఈ నెల 11న నోటిఫికేషన్‌ జారీ చేసింది. 12 నుంచి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 14 సాయంత్రం 5 వరకు రిజిస్ర్టేషన్‌ చేసుకోవడానికి అధికారులు గడువు విధించారు. ఆరు రోజుల్లోనే 8 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. గతంలో బిల్డర్లు, డెవలపర్లు కొనుగోలుకు ఆసక్తి చూపని ఫ్లాట్లకు జనం నుంచి భారీ స్పందన వస్తోంది.


రోజూ వెయ్యికి పైగా రిజిస్ర్టేషన్లు..

బండ్లగూడలో త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ డీలక్స్‌ ఫ్లాట్‌ (1487 చ.అడుగులు) రూ.44.61 లక్షలకు,  1617 చ.అడుగులైతే రూ.48.51 లక్షలుగా ఖరారు చేశారు. త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ (1266చ.అడుగులు) రూ.34.81 లక్షలకు, 1141 చ.అడుగులైతే రూ.31.37లక్షలుగా నిర్ణయించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ (798చ.అడుగులు) రూ.21.94 లక్షలకే లభించనుంది. పార్కింగ్‌ ఫీజులు లక్ష నుంచి రూ.3.25లక్షల వరకు ఉండగా, ఇతరాత్ర ఫీజులు మరో లక్ష నిర్ణయించారు. గ్రేటర్‌ పరిధిలోని బిల్డర్ల వద్ద ఇటువంటి ఫ్లాట్ల ధరలు అంతకు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరవాసులు ఫ్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా రిజిస్ర్టేషన్‌ చేసుకునే అవకాశం కల్పించడంతో రోజూ సుమారు వెయ్యి నుంచి 1500 వరకు రిజిస్ర్టేషన్లు అవుతున్నాయి. ఒక్కొక్కరు కనీసం పది రిజిస్ర్టేషన్ల వరకు చేసుకుంటున్నారు.


స్పష్టత కరువు..

బహిరంగంగా నిర్వహించే లాటరీ పద్ధతిపై ఎలాంటి అనుమానాలూ ఉండవు. కానీ ఈ ఫ్లాట్లకు ఆన్‌లైన్‌లో లాటరీ తీసి ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఫ్లాట్లు ఎవరికి దక్కాయనేది జూన్‌ 22న మెస్సేజ్‌ రూపంలో సమాచారం అందిస్తామని అంటున్నారు. ఆన్‌లైన్‌ లాటరీ పద్ధతి ఎలా ఉంటుందనేది స్పష్టత లేదు. రిజిస్ర్టేషన్‌ సందర్భంలోనే ప్రభుత్వ ఉద్యోగులా, కాదా అనేది తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రాధాన్యం ఇస్తారా అనే సందేహాలున్నాయి. ఇప్పటికే వీటి కోసం ఉన్నతస్థాయిలో పైరవీలు మొదలుపెట్టినట్లు సమాచారం. కొందరైతే వాస్తు ప్రకారం ఉన్న ఫలానా ఫ్లాట్లు తమకు కట్టబెట్టాలని పలుకుబడి ఉపయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘‘ఆన్‌లైన్‌లోనే లాటరీ తీసి వారం రోజుల తర్వాత అలాట్‌మెంట్‌ చేయడమనేది సరికాదు. బహిరంగ పద్ధతిలోనే లాటరీ ద్వారా ఫ్లాట్స్‌ ఖరారు చేయాలి.’’ అని సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-05-19T15:17:44+05:30 IST