HYD : బిల్డర్లకో రేటు.. ప్రజలకు మరో రేటు.. ‘బండ్లగూడ’ ఎందుకీ తేడా..!?

ABN , First Publish Date - 2022-05-13T14:18:07+05:30 IST

బిల్డర్లకో రేటు.. ప్రజలకు మరో రేటు.. బండ్లగూడ ఎందుకీ తేడా..!?

HYD : బిల్డర్లకో రేటు.. ప్రజలకు మరో రేటు.. ‘బండ్లగూడ’ ఎందుకీ తేడా..!?

  • అధికంగా ఫ్లాట్ల నిర్ణీత ధర
  • నెల క్రితం బిల్డర్లకు చ.అడుగు రూ.2200
  • తాజాగా రూ.2750 - రూ. 3 వేలు
  • అదనంగా పార్కింగ్‌, డెవలప్‌మెంట్‌ ఫీజులు
  • ధరల నిర్ణయంపై ప్రభుత్వ పెద్దలు సైతం అసహనం

హైదరాబాద్‌ సిటీ : ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల క్రితం నిర్మించిన అపార్ట్‌మెంట్లు అవి. నిర్వహణ లేక పాడుబడ్డాయి. వాటిని బిల్డర్లు, డెవలపర్లకు గంపగుత్తగా అమ్మేయాలని నెల క్రితం నిర్ణయించారు. చ.అడుగు ధర రూ.2200 నుంచి రూ.2700గా ప్రకటించారు. కానీ కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కనీసం బిడ్‌ కూడా దాఖలు చేయలేదు. ఇప్పుడు వాటినే ప్రజలకు అమ్మాలని బహిరంగ మార్కెట్‌లో (Market) పెట్టారు. తాజా ధర చ.అడుగు రూ.2750 నుంచి రూ.3వేలుగా నిర్ణయించారు. పైగా పార్కింగ్‌, డెవలప్‌మెంట్‌ (Development) ఫీజులు అదనం అని షరతులు విధించారు. దీంతో హెచ్‌ఎండీఏ, హౌసింగ్‌ బోర్డు అధికారుల తీరు ‘అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచంలో’ అనే చందంగా ఉందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల వద్దకొచ్చేసరికి ధరను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి సైతం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.


నాగోల్‌ - బండ్లగూడలోని రాజీవ్‌ స్వగృహ (Rajeev Swagruha) అపార్ట్‌మెంట్లను ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించగా, ఐదు నుంచి పది శాతం మేర పనులు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్‌ విస్తరణతో నగరం మధ్యలోకి అపార్ట్‌మెంట్లు వచ్చేశాయి. నాగోల్‌ మెట్రో రైల్వే స్టేషన్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే రాజీవ్‌ స్వగృహకు చెందిన 33 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో సింగిల్‌, డబుల్‌, త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్లు (Single, Double, Triple Bed Rooms) మొత్తం 2,692 ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం 446 ఫ్లాట్లను విక్రయించారు.


ఇంకా 2,246 ఫ్లాట్లు మిగిలి ఉన్నాయి. వాటిని గంపగుత్తగా విక్రయించేందుకు గత నెల 24న హెచ్‌ఎండీఏ (HMDA) ఆన్‌లైన్‌లో ఈ-వేలం నిర్వహించింది. కేవలం డెవలపర్లు, బిల్డర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుగా రెండు, మూడు అపార్ట్‌మెంట్లను కలిపి ఓ క్లస్టర్‌గా నిర్ణయించి 33 అపార్ట్‌మెంట్లను 15 క్లస్టర్లుగా విభజించారు. చ.అడుగు అప్‌సెట్‌ ధర రూ.2200 నుంచి 2700గా నిర్ణయించారు. ఈ ధర కంటే రూ.100 ఎక్కువ వేస్తే వారికి వేలంలో క్లస్టర్‌ దక్కుతుంది. కానీ ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అపార్ట్‌మెంట్లు మొత్తం అమ్ముడుపోతే మౌలిక సదుపాయాలు, పార్కింగ్‌ ఇతర అభివృద్ధి పనులు తామే చేపడతామని హెచ్‌ఎండీఏ భరోసా కూడా ఇచ్చింది. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో వేలం జరగలేదు.


బహిరంగ మార్కెట్‌లో అధికంగా..

బిల్డర్లు, డెవలపర్లకు అప్‌సెట్‌ ధర తక్కువగా నిర్ణయించిన హెచ్‌ఎండీఏ, హౌసింగ్‌బోర్డు అధికారులు బహిరంగ మార్కెట్‌లో చ.అడుగు ధర అధికంగా నిర్ణయించారు. బండ్లగూడలో రెడీ ఫర్‌ మూవ్‌ ఫ్లాట్లను చ.అడుగు ధర రూ.3వేలు నిర్ణయించగా, కొంత అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్స్‌కు రూ.2,750 నిర్ణయించారు. పోచారంలో రెడీ ఫర్‌ మూవ్‌ ఫ్లాట్‌కు చ.అడుగుకు రూ.2500 కాగా, అసంపూర్తిగా ఉన్నవాటికి చ.అడుగు రూ.2,250గా నిర్ణయించారు. లాటరీ పద్ధతిలో ఫ్లాట్‌ దక్కిన తర్వాత కారు పార్కింగ్‌ కోసం ఫీజు చెల్లించాలి. బండ్లగూడలో స్టిల్ట్‌ పార్కింగ్‌కు రూ.3.25 లక్షలు, సెల్లార్‌ పార్కింగ్‌ రూ.2.25 లక్షలు, ఓపెన్‌ పార్కింగ్‌కు రూ.లక్ష చెల్లించాలి. దాంతో పాటు డెవల్‌పమెంట్‌ ఫీజు కింద రూ.50వేలు చెల్లించాలి. రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అండ్‌ కార్పస్‌ ఫండ్‌ను చ.అడుగుకు రూ.50చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నెల రోజుల క్రితం ఈ-వేలంలో పాల్గొన్న బిల్డర్లకు ఈ ఫీజులేవీ నిర్ణయించలేదు.


రూ.534 కోట్ల ఆదాయం..

బండ్లగూడలోని 33 అపార్ట్‌మెంట్లలో 2,246 ఫ్లాట్లు ఉండగా, 1501 ఫ్లాట్లు అమ్మకానికి పెట్టారు. అందులో 345 త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ డీలక్స్‌, 444 త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌, 712 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్లు ఉన్నాయి. సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్లు అమ్మకానికి పెట్టలేదు. అమ్మకానికి పెట్టిన ఫ్లాట్ల ద్వారా రూ.480 కోట్ల ఆదాయం రానుంది. అదనంగా రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అండ్‌ కార్పస్‌ ఫండ్‌ పేరుతో రూ.47.34 కోట్లు, డెవల్‌పమెంట్‌ ఫీజు కింద రూ.7.50 కోట్లు మొత్తంగా రూ.534 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పోచారంలో 1470 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. నెల రోజుల్లోనే ధరల్లో వ్యత్యాసంపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డెవలపర్లు, బిల్డర్లు కొనేందుకు ఆసక్తి చూపని ఫ్లాట్లను జనాలకు మాత్రం అధిక ధరలకు విక్రయించాలని నిర్ణయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Read more