పరీక్షకు పైరవీలు

ABN , First Publish Date - 2020-08-02T10:58:58+05:30 IST

పరీక్షకు పైరవీలు

పరీక్షకు పైరవీలు

పీహెచ్‌సీల్లో యాంటీజెన్‌ కిట్ల కొరత 

 ప్రైమరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు లేవు 

తప్పుడు లెక్కలతో గందరగోళం 

హైకోర్టు ఆదేశాలు బేఖాతరు 

వైద్యాశాఖ తీరుతో అయోమయం 

రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు 

ప్రజల్లో కనిపించని ముందు జాగ్రత్తలు 

యధావిధిగా పెళ్లిళ్లు, వేడుకలు 


నిర్మల్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి)  : జిల్లాలో కరోనా మహమ్మారి సాధారణ ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే కరోనా లక్షణాలు ఉన్న వారికి టెస్టులు నిర్వహించడంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పొలిటికల్‌ పైరవీలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిరోజూ దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో ఉన్న వారు ప్రభుత్వ ఆసుపత్రులకు కరోనాపరీక్షల కోసం క్యూ కడుతున్నారు. అయితే కరోనాకిట్ల కొరత కారణంగా సిఫారసు చేసిన వారికి మాత్రమే పరీక్షలు చేస్తూ మిగతా వారిని వెనక్కి పంపుతున్నట్లు ఆరోపణలున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కరోనా పాజిటివ్‌ కేసుల విషయంలో తప్పుడు లెక్కలు చూపుతున్నారన్న ఫిర్యాదులున్నాయి. కరోనా విషయంలో ప్రతిరోజూ వైద్య, ఆరోగ్యశాఖ వ్యవహరించాల్సిన తీరుతో పాటు పాజిటివ్‌, నెగెటివ్‌ కేసుల విషయంలో ప్రత్యేక బులెటిన్‌ జారీ చేయాలంటూ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు సైతం ఉల్లంఘనకు గురవుతున్నాయంటున్నారు. ముఖ్యంగా నిర్మల్‌ జిల్లా అధికారులు జారీ చేస్తున్న లెక్కలు, రాష్ట్రవైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెల్లండిస్తున్న లెక్కలకు పొంతన ఉండడం లేదంటున్నారు. పాజిటివ్‌ కేసుల విషయంలో అధికారులు వాస్తవాలు దాస్తున్నారన్న విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రితో పాటు చాలా పీహెచ్‌సీల్లో యాంటీజెన్‌ కిట్ల కొరత కొనసాగుతున్నందున పరీక్షలకు ఆటంకాలు ఎదురవుతున్నాయంటున్నారు. ఒక్కొ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌ వెల రూ. 4వేలకు పైగా ఉండడంతో పాటు ఈ కిట్ల కొరత కారణంగా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయలేని పరిస్థితి తలెత్తుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఆసుపత్రిలో ఇప్పటి వరకు 490 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందులో నుంచి 85 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా  భైంసా, ఖానాపూర్‌ ఏరియా ఆసుపత్రులతో పాటు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో 212 మందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో నుంచి 43 మందికి పాజిటివ్‌ తేలింది. మొత్తం 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటి వరకు 213 మందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో నుంచి 43 మందికి పాజిటివ్‌ రావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాలు కరోనా తీవ్రత దృష్ట్యా స్వచ్చందంగా లాక్‌డౌన్‌ను ప్రకటించుకుంటూ హోం క్వారంటైన్‌ అమలు చేస్తున్నాయి. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లో మాత్రం స్తానికులు కనీస ముందు జాగ్రత్త చర్యలను పాటించడం లేదు. దీని కారణంగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకు విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికి చాలా మంది పెండ్లిల్లు, వేడుకలు యధావిదిగా జరుపుతుండడం ఆందోళన రేకేత్తిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో వాయిదా పడ్డ పెండ్లిల్లు తిరిగి ఊపందుకుంటున్నాయి. గత వారం రోజుల నుంచి వరుస పెండ్లిలతో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాలు సందడీగా మారుతుండడమే కాకుండా వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలున్నాయన్న వాదనలు మొదలవుతున్నాయి. 


రాజకీయ పైరవీలకే ప్రాధాన్యం

అయితే నిర్మల్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కరోనా కిట్‌ల కొరత కారణంగా లక్షణాలు ఉన్న వారు పరీక్షలు చేయించుకోవడం సమస్యగా మారుతోంది. దీని కోసం గాను సంబందిత అధికారులు పరీక్షల కోసం వచ్చే వారికి నచ్చజెప్పేందు కోసం నానా రకాల తంటాలు పడతున్నారంటున్నారు. అయితే ప్రజా ప్రతినిధులు, రాజకీయనేతల సిఫారసులు ఉన్న వారికి మాత్రం పరీక్షలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీని కారణంగా ప్రతిరోజూ పరీక్షల కోసం వస్తున్న వారిలో కొంతమందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తూ మిగతా వారికి నచ్చజెప్పుతున్నట్లు వాదనలున్నాయి. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటేనే పరీక్షలు చేయించుకోవాలని లేనట్లయితే పరీక్షలు అవసరం లేదని హోం క్వారంటైన్‌కు పరిమితం కావాలంటూ సూచిస్తున్నారంటున్నారు. చాలా మంది గ్రామాల నుంచి వచ్చే బాధితులు అలాగే స్థానికంగా ఉన్న బాధితులు పొలిటికల్‌ పైరవీల కోసం తంటాలు పడుతున్నారన్న విమర్శలున్నాయి. కిట్ల కొరత కారణంగా స్థానిక వైద్యాధికారులు కూడా పరీక్షల విషయంలో ఏమి చేయలేని పరిస్థితి తలెత్తుతోందంటున్నారు


సమస్యగా మారిన కిట్ల కొరత

ప్రస్తుతం కరోనా పరీక్షల వ్యవహారం కిట్ల కొరత కారణంగా ఓ సమస్యగా మారిందంటున్నారు. కిట్ల కొరత కారణంగా అధికారులు లక్షణాలతో వచ్చే వారందరికి పరీక్షలు చేయలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఇప్పటి వరకు 490 మందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో నుంచి 85 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇక్కడ కిట్ల కొరత తీవ్రంగా ఉండడంతో లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయడం అధికారులకు సవాలుగా మారుతోంది. ఖానాపూర్‌ ఏరియా ఆసుపత్రికి 100 కిట్లు సరఫరా కాగా ఇప్పటి వరకు 64 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో నుంచి నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా ఇంకా 36 కిట్లు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. సోన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేవలం 25 కిట్లు మాత్రమే పంపిణీ కాగా 25 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో నుంచి 9 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయట పడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ కిట్ల కొరత తీవ్రంగా ఉండడంతో వైద్య సిబ్బంది పరీక్షలను నిలిపివేశారు. ముథోల్‌ పిహెచ్‌సికి 25 కిట్లు సరఫరా కాగా అదే సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన అధికారులు ఇందులో నుంచి నలుగురికి పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించారు. మహగాం పిహెచ్‌సికి 25 కిట్లు పంపిణీ కాగా 08 మందికి పరీక్షలు నిర్వహించిన అధికారులు నలుగురికి పాజిటివ్‌ లక్షణాలున్నట్లు దృవీకరించారు. భాసర పిహెచ్‌సికి 20 కిట్లు పంపిణీ కాగా అదే సంఖ్యలో పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఇక్కడ కూడా కిట్ల కొరత ఉంది. నిర్మల్‌ జిల్లాలోని మహగాం, దిలావర్‌పూర్‌ తదితర పిహెచ్‌సిల్లో కూడా కిట్ల కొరత ఉన్నట్లు చెబుతున్నారు. 


హైకోర్టు ఆదేశాలు బేఖాతరు.. తప్పుల తడకగా లెక్కలు

ఇదిలా ఉండగా మిగతా జిల్లాల కన్నా నిర్మల్‌ జిల్లాలో కరోనా లెక్కలు గందరగోళంగా ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్న లెక్కలకు, రాష్ట్ర అధికారులకు వెల్లడిస్తున్న లెక్కలకు ఎక్కడ పొంతన ఉండడం లేదంటున్నారు. ప్రతిరోజూ హెల్త్‌ బులెటిన్‌ జారీ చేయాల్సిన అధికారులు ఇష్టానుసారంగా ఈ బులెటిన్‌ను విడుదల చేస్తూ గందరగోళ పరిస్థితులకు కారణమవుతున్నారంటున్నారు. ప్రతిరోజూ కరోనా పరీక్షలు, పాజిటివ్‌, నెగెటివ్‌ కేసులకు సంబందించిన లెక్కలను వెల్లడించాలంటూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించినప్పటికి ఇక్కడి అధికారుల తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదంటున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులను అలాగే చుట్టూ పక్కల వారిని అప్రమత్తం చేయాల్సిన అధికారులు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు లెక్కలతో స్థానికులు కూడా అయోమయానికి గురవుతున్నారు. కరోనా పాజిటివ్‌ విషయంలో పుకార్డు షికార్లు చేస్తుండడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోందంటున్నారు. 

Updated Date - 2020-08-02T10:58:58+05:30 IST