Abn logo
Aug 2 2020 @ 05:31AM

పశువుకులకు వైద్యంపై పట్టింపేదీ?

పశువులను చుట్టుముడుతున్న భయంకర వ్యాధులు 

వేధిస్తున్న వైద్యుల కొరతతో నాటు వైద్యమే దిక్కు

సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్న జీవాలు 

కరోనా ఎఫెక్ట్‌తో క్షేత్రస్థాయిలో కొరవడుతున్న పర్యవేక్షణ

జిల్లాలో 27మంది వైద్యులకు గానూ విధుల్లో 19మంది మాత్రమే..


 వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లా లో పశుపోషణ ఎక్కువగానే కనిపిస్తోంది. యేటా వర్షాకాలంలో పశువులు సీజనల్‌ వ్యాధుల భారీన పడి భయంకర వ్యాధులు చుట్టుముట్టి మృత్యువాత పడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఇప్పటికి కొందరు రైతులు నాటు వైద్యాన్నే నమ్ముకొని పశువులకు సోకే వ్యాధులను నయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నాటు వైద్యం వికటించడంతో పశువుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రతీ ఐదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం పశుగణనను నిర్వహిస్తోంది. ఈలెక్కల్లో పశుసంపద అంతరించి పోతున్నట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. ప్రతి యేటా సీజనల్‌గా పశువు ల్లో వచ్చే వ్యాధుల పై రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.వేదిస్తున్న వైద్యుల కొరతతో సకాలంలో వైద్యం అందక మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయని చెబుతున్నారు. కంటికి రెప్పల కాపాడుకున్న పశువులను భ యంకర వ్యాధులు కభలించడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. ప్రధానంగా గ్రామీణ పశువైద్యశాలలో సరైన వసతులు లేక పోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన వెటర్నరి అసిస్టెంట్ల పోస్టులు భర్తీకాక పోవడంతో రైతుల పాలిట శాపంగా మారుతుంది. ఏటా పెరిగి పోతున్న యాంత్రికరణతో అంతరించి పోతున్న పశుసంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ సారి కరోనా ఎఫెక్ట్‌తో క్షేత్రస్థాయి పర్యటన చేయడమే కష్టం గా కనిపిస్తోంది. దీంతో సీజనల్‌ వ్యాధుల భారీన పడుతున్న మూగజీవాలు దూరంకావడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. 


సీజనల్‌ వ్యాధుల ముప్పు

రాష్ట్రంలో మరెక్కడ లేని విధంగా జిల్లాలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. సీజనల్‌ వ్యాధులు పశుపోషణపై తీవ్ర ప్రభావం చూపుతోంది.అలాగే పశువుల్లో చురుకు ధనం కనిపించక పోవడంతో పాటు ప్రధానంగా బొబ్బరోగం, చిటుక వ్యాధి, పీపీఆర్‌, గురుక పెట్టడం, జబ్బవాపు, గొంతువాపు, డయేరియా లాంటి వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో పాడి పశువులు అంతు చిక్కని వ్యాధుల భారీన పడి అనారోగ్యం పాలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను పశువ్యాధులపై అప్రమత్తం చేయాల్సిన అధికారులు అందుబాటులో లేక అవస్థలు పడాల్సి వస్తుంది. ఇప్పటికే నట్టల నివారణ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోవడం లేదు. అలాగే మిగితా వ్యాధుల నివారణ పై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆపద సమయంలో వైద్యం అందుబాటులో లేక పోవడంతో పశుసంపద చేజారిపోయే అవకాశం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


వెంటాడుతున్న వైద్యుల కొరత

జిల్లాలోని 18 మండలాల పరిధిలోని మొత్తం 21 పశువైద్య శాస్త్ర చికిత్స కేంద్రాలు (వీడీ) ఉండగా, 12 గ్రామీణ పశువైద్య కేంద్రాలు(ఆర్‌ఎల్‌యూ), మరో రెండు వెటర్నరీ ఆసుపత్రులు(వీహెచ్‌) ఉన్నాయి. జిల్లాలో మొత్తం 27మంది వైద్యులు పని చేయాల్సి ఉండగా ప్రస్తుతం 19మంది వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. గత కొంత కాలంగా వైద్యుల కొరత పశువైద్య శాఖను వేదిస్తునే ఉంది. అలాగే వెటర్నరి లైవ్‌స్టాక్‌ (వీఎల్‌వో)ల పోస్టులు మూడు ఉండగా ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఐదుగురు జూనియర్‌ వెటర్నరి అధికారులు(జేవీవో), లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ అధికారులు(ఎల్‌ఎ్‌సఏ) 8 మంది పని చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉం డాల్సిన వెటర్నరి అసిస్టెంట్‌ అధికారుల పోస్టులు 21ఉండగా ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగితా 20పోస్టులు గత కొంత కాలంగా ఖాళీగా ఉన్నాయి. దీంతో గ్రామాల్లో గోపాలమిత్రలే అన్నదాతలకు అప్తులవుతున్నారు. అలాగే వైద్యులు అందుబాటులో లేక సంచార వైద్యసేవలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. దీంతో జిల్లాలో పశువైద్యం గాడితప్పడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Advertisement
Advertisement