ముందుంది వరద కాలం

ABN , First Publish Date - 2020-08-02T10:08:45+05:30 IST

ముందుంది వరద కాలం

ముందుంది వరద కాలం

ఆగస్టులో గోదావరికి పెరగనున్న వరదలు

70 ఏళ్లలో 31సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక 

మార్గదర్శిగా గోదావరి ఫ్లడ్‌ మాన్యువల్‌

ఇప్పటి వరకు రెండుసార్లు మార్పులు 


భద్రాచలం, ఆగస్టు 1: రాబోయే ముప్పై రోజులు గోదావరికి వరదల కాలంగా గత 70ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఈ నెల గడిస్తే గండలం గడిచినట్లేనన్న అభిప్రాయాలు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు నెలల ఎగువన కురిసే భారీ వర్షాలతో గోదావరి తన సహజసిద్ద రూపాన్ని సంతరించుకొని కొన్ని సందర్భాల్లో ఉగ్ర గోదావరిగా మారుతుంది. ఈ క్రమంలో గత 70ఏళ్లల్లో గోదావరి ఆగస్టులో 31 సార్లు మొదటి ప్రమాద హెచ్చరికను దాటిందంటే ఆగస్టు నెలకున్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో అధికార యంత్రాంగం గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలను సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు 1984లో గోదావరి ఫ్లడ్‌ మాన్యువల్‌ను రూపొందించింది. కాల క్రమంలో వస్తున్న భారీ వరదలను పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు ఆ మాన్యువల్‌లో మార్పులను చేస్తూ జిల్లాకు రాబోయే నూతన అధికారులకు ఈ గోదావరి ఫ్లడ్‌ మాన్యువల్‌ మార్గదర్శిగా నిలిచేలా రూపొందించారు. 


70 ఏళ్లలో 31సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక దాటిన ప్రవాహం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 1953 నుంచి గత ఏడాది ఆగస్టు వరకు 31 సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక(43 అడుగులు)ను దాటింది. కాగా ఇందులో 21 సార్లు రెండో ప్రమాద హెచ్చరిక(48 అడుగులు) దాటింది. మూడోది తుది ప్రమాద హెచ్చరిక అయిన 53అడుగులను 16సార్లు దాటి గోదావరి ప్రవహించింది. ఇందులో 1986 ఆగస్టు 16న వచ్చిన 75.6 అడుగుల నీటిమట్టం ఇప్పటి వరకు భద్రాద్రి చరిత్రలో అత్యధికంగా చెప్పవచ్చు. 1953 ఆగస్టులో 72.5 అడుగులు, 1990 ఆగస్టు 24న 70.8 అడుగులు, 2006 ఆగస్టు 6న వచ్చిన 66.9 అడుగులు భారీగా వచ్చిన వరదలుగా పేర్కొనవచ్చు. 


మార్గదర్శిగా గోదావరి ఫ్లడ్‌ మాన్యువల్‌

ప్రతి ఏటా జూన్‌, జూలై, ఆగస్టు మాసాల్లో గోదావరికి వరదలు వస్తుంటాయి. ఈ క్రమంలో అధికార యంత్రాంగం గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గోదావరి ఫ్లడ్‌ మాన్యువల్‌ను రూపొందించారు. 1984లో తొలిసారిగా ఈ గోదావరి ఫ్లడ్‌ స్కీం పేరిట రూపొందించగా 1986లో వచ్చిన అత్యధిక వరద 75.6 అడుగులను దృష్టిలో ఉంచుకొని ఫ్లడ్‌ మాన్యువల్‌ను 1987లో మార్పు చేసి అప్‌గ్రేడ్‌ చేశారు. అలాగే 1990, 1994, 1995, 1998, 2000, 2002, 2006లో వచ్చిన వరదలను ఆధారంగా చేసుకొని 2007లో అప్పటి భద్రాచలం సబ్‌కలెక్టరు డా. బుద్దప్రకాష్‌ జ్యోతి ఫ్లడ్‌ మాన్యువల్‌కు పలు మార్పులు చేసి రెండోసారి అప్‌గ్రేడ్‌ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్‌, సబ్‌కలెక్టర్‌గా ఎవరు వచ్చినా గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు గోదావరి ఫ్లడ్‌ మాన్యువల్‌ ఒక మార్గదర్శిగా నిలుస్తోంది. ఈ ఫ్లడ్‌ మాన్యువల్‌లో గోదావరి వరదల సమయంకు ఏ విధంగా సన్నద్దం కావాలి?, బఫర్‌స్టాక్స్‌ మూడు నెలల కోసం ముందుగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, సెక్టోరియల్‌ అధికారుల ఏర్పాటు, కంట్రోల్‌ రూం ఏర్పాటు ఇతరత్రా వివరాలను పొందుపరిచారు. 

Updated Date - 2020-08-02T10:08:45+05:30 IST