మొలకెత్తని మొక్కజొన్న

ABN , First Publish Date - 2020-08-02T10:07:13+05:30 IST

మొలకెత్తని మొక్కజొన్న

మొలకెత్తని మొక్కజొన్న

వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులు 

నకిలీ విత్తనాలతో రూ. లక్షల వ్యాపారం

నియంత్రణ సాగు మాటున నిండా మునిగిన రైతులు 


గుండాల, ఆగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ సాగు నిర్ణయంతో పోడు భూముల్లో మొక్కజొన్న పంటను సాగు చేసుకునే రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాకాలంలో మొక్కజొన్న పంటను సాగు చేయవద్దనడం, పోడు భూములు ఇతర పంటలకు అనువుగా లేక పోవడం విత్తన వ్యాపారులకు కలిసి వచ్చింది. నిషేధం మాటున మొక్కజొన్న విత్తనాలను విక్రయిస్తున్నారు. గత్యంతరంలేక వ్యాపారులు ఇచ్చిన మొక్కజొన్న విత్తనాలను మన్యంలోని రైతులు లక్షల ఎకరాల్లో విత్తారు. నకిలీ విత్తనాలను రైతులకు అంటకట్టిన వ్యాపారులు, భూమిలో తేమ లేకనే విత్తనం రైతులను దబాయిస్తున్నారు. 


పక్షం రోజులైనా మెలకెత్తలేదు

గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో దళారీ వ్యాపారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. పోడు భూములకు పట్టాలు లేకపోగా, వర్షాధార పంటలు తప్ప, రెండో పంటకు అవకాశం లేదు. పోడు భూములను నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతులు ఈ ఏడాది నిండా మునిగారు. తొలకరిలో ట్రాక్టర్ల ద్వారా దుక్కులు చేసుకుని, మక్కలను విత్తారు. పక్షం రోజులైనా మొలకెత్తక పోవడంతో రైతులకు ముచ్చేమటలు పట్టాయి. వ్యాపారుల వద్దకు వెళ్లి విత్తనాలు మొలకెత్తలేదని ప్రశ్నించగా, తేమ తక్కువ ఉన్న సమయంతో విత్తడంతో మొలకెత్తలేదంటూ వ్యాపారులు దబాయిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో మళ్లీ దుక్కులు చేసి మక్క విత్తనాలను విత్తుతున్నారు. ఆర్ధికభారం పడుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 


పెట్టుబడి నష్టం

ఎకరం పోడు భూమిని ట్రాక్టర్‌తో రెండు దఫాలుగా దుక్కి చేసినందుకు, రూ.నాలుగు వేలు, ఎరువులకు రూ.1300 వందలు, కూలీలకు రూ.1500 ఖర్చు వస్తోందని, విత్తనాలకు రూ.1500 ఖర్చు చేస్తున్నామని రైతులంటున్నారు. ఒక్కో ఎకరానికి రూ.8,300 ఖర్చు చేసి, మక్కలను విత్తితే మొలకెత్తక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో రైతు 20 ఎకరాల నుంచి 40 ఎకరాల వరకు పోడు భూముల్లో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. అంటే ఒక్కో రైతు ఎంత నష్ట పోయాడో అర్ధం చేసుకోవచ్చు. 


అధికారులు పట్టించుకోండి

పోడు భూములకు పట్టాలు లేక, బ్యాంకుల్లో అప్పులు పుట్టక పల్లె రైతులు వడ్డీ వ్యాపారుల చుట్టు తిరుగుతున్నారు. గుండాల మండలంలోని శెట్టుపల్లి, ఇల్లెందు మండలంలోని కొమరారం, పోచారం, మాణిక్యారం, ముత్తారపుకట్ట వంటి గ్రామాల్లో మొక్కసాగును రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. వ్యవసాయశాఖాధికారులు నిఘా పెట్టక పోవడం, విత్తనాల విక్రయిస్తున్న వ్యాపారుల వద్ద నిల్వ ఉన్న విత్తనాలను పరిశీలించకపోవడంతో రైతులపై సాగు పెట్టుబడి అప్పు తడిసి మోపెడవుతోంది. ఇల్లెందు కేంద్రంగా మొక్కజొన్న కలుపు నివారణ మందును తయారు చేస్తున్న మూఠాను పట్టుకున్న వ్యవసాయశాఖాధికారులు, నకిలి విత్తనాలపై దృష్టి సారించక పోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుక పోతున్నారు. 

Updated Date - 2020-08-02T10:07:13+05:30 IST