నవవధువు దుర్మరణం

ABN , First Publish Date - 2021-01-16T05:26:41+05:30 IST

మూడు నెలల క్రితం వారికి వివాహమైంది. పాడేరు సమీపంలోని వంజంగిలో ప్రకృతి అందాలను తిలకించడానికి బైక్‌పై వచ్చారు.

నవవధువు దుర్మరణం
నరేంద్ర, రుక్మిణి (ఫైల్‌ ఫొటో)

సలుగు పంచాయతీ రాయికొట్ల వద్ద బైక్‌ అదుపుతప్పి బోల్తా 

భర్తతో కలిసి వంజంగి అందాలు సందర్శించి తిరిగి వెళుతుండగా దుర్ఘటన

భర్తకు తీవ్రగాయాలు... పాడేరు ఆస్పత్రిలో చికిత్స


పాడేరు రూరల్‌, జనవరి 15: మూడు నెలల క్రితం వారికి వివాహమైంది. పాడేరు సమీపంలోని వంజంగిలో ప్రకృతి అందాలను తిలకించడానికి బైక్‌పై వచ్చారు. ఇంటికి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరగడంతో ఆమె మృతిచెందింది. అతను తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాడేరు మండలం సలుగు పంచాయతీ రాయికొట్ల గ్రామానికి సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


వి.మాడుగుల మండలం కేజే పురం గ్రామానికి చెందిన పాలకుర్తి నరేంద్రకు, ఇదే మండలం వీరవల్లి అగ్రహారం గ్రామానికి చెందిన రుక్మిణి (25)తో గత ఏడాది అక్టోబరు 13వ తేదీన వివాహం జరిగింది. పాడేరు మండలం వంజంగిలో మేఘాల అందాలను తిలకించేందుకు శుక్రవారం ఉదయం బైక్‌పై ఇక్కడకు వచ్చారు. సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యారు. సలుగు పంచాయతీ రాయికొట్ల గ్రామానికి సమీపంలో బైక్‌ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో రుక్మిణి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్ర గాయాలైన నరేంద్రను స్థానికులు సమీపంలోని ఈదులపాలెం పీహెచ్‌సీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి వెళ్లి నరేంద్రను, రుక్మిణి మృతదేహాన్ని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మృతురాలి బంధువులు పాడేరు చేరుకున్నారు. రుక్మిణి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. కాగా నరేంద్రకు తలపై బలమైన గాయం కావడంతో 30 కుట్లు పడ్డాయని, ఎడమ చెయ్యి విరిగిందని వైద్యులు చెప్పారు. రుక్మిణి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.



Updated Date - 2021-01-16T05:26:41+05:30 IST