Advertisement
Advertisement
Abn logo
Advertisement

మిర్చి రైతుల పరేషాన్‌

పూత నాశనం చేస్తున్న రసం పీల్చే పురుగు

ఆంధ్ర నుంచి తెలంగాణకు వ్యాప్తి 

జిల్లా వ్యాప్తంగా ఉధృతం.. ఆందోళనలో రైతులు

నేడు జిల్లాకు శాస్త్రవేత్తల బృందం రాక 


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, నవంబరు 29 : మిర్చి తోటలపై కొత్త రకం రసం పీల్చే నల్లతామర పురుగు వ్యాప్తి చెందుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు పరేషాన్‌కు గురవుతున్నారు. వాతావరణ మార్పులు... విపరీతంగా పురుగుల మందుల వాడకం, బయో మందుల వాడకంతో ఈ రసం పీల్చే కొత్త నల్ల రకం తామర పురుగు మహబూబాబాద్‌ జిల్లాలో మిర్చి తోటలకు సోకిందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.సూర్యనారాయణ ధ్రువీకరించారు. 


ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రాంతం నుంచి తెలంగాణలోకి ఈ కొత్త రకం రసం పీల్చే నల్లతామర పురుగు మిర్చి తోటలకు వ్యాప్తి చెందింది. సాధారణ తామర పురుగే అని భావిస్తున్న రైతులు దాని నివారణకు పలు రకాల క్రిమిసంహారిక మందులు ఎక్కువగా కొడుతున్న పురుగు మాత్రం చావడం లేదు. ఇంకా ఉధృతంగా పెరుగుతూనే ఉన్నాయి. శాస్త్రవేత్తలకు సైతం ఈ కొత్త రకం పురుగు గురించి అంతుబట్టడం లేదు. రైతులు సైతం పురుగు ఉధృతిని ఎలా తగ్గించాలని దిగ్గుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నారు. 


జిల్లాలో 86 వేల ఎకరాల్లో మిర్చి సాగు...

జిల్లాలో ఏనాడు లేనంతగా ఈ సారి మిర్చి సాగు చేస్తున్నా రు. ఎస్సారెస్పీ నీరు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో పాటు అకాల వర్షాలతో భూగర్భ జలాలు పెరిగిపోవడంతో ఈ జిల్లాలో మిర్చి తోటల సాగు బాగా పెరిగింది. గతేడాది 44 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా ఈ సారి 86 వేల ఎకరాల విస్తీర్ణంలో రికార్డు స్థాయిలో సాగు చేస్తున్నారు. 


ముదురు నలుపురంగులో పురుగు 

సాధారణంగా మిర్చి పంటలో తామర పురుగు అన్ని దశలలో ఆశించడం జరుగుతుంది. తద్వారా ఆకుల అంచుల వెంబడి పైకి ముడుచుకుపోవడం ద్వారా పై ముడత కూడా అంటారు. కానీ కొత్తగా వచ్చిన ఈ రసం పీల్చే తామర పురుగులో వాటికి భిన్నంగా ముదురు నలుపురంగులో ఉంది. ఎలాంటి పురుగుమందులు వాడినా లొంగకుండ విపరీతంగా ఉధృతంగా పెరుగుతోంది. జిల్లాలో ప్రస్తుతం మిర్చిపంట పూత, కాత దశకు వస్తోంది. ఈ కొత్తగా వచ్చిన పురుగులతో పుప్పడి, పువ్వలను తినడం వల్ల పూత రాలిపోవడం, కాయలు ఎదగకపోవడం జరుగుతుంది. 


అలాగే పై ముడత రావడం వల్ల కూడ కొమ్మలు ఎండిపోయి మొక్కలు ఎర్రబారి ఎండిపోతున్నాయి. దీంతో రైతులకు మాములు తామర పురుగుగానే వ్యాప్తి చెందుతుందిలే అని భావించిన రైతులు తమకు తోచిన పురుగుమందులు, అధికారులు, క్రిమిసంహారిక మందుల డీలర్లు ఇచ్చిన నానా రకాల పురుగు మందులను పిచికారి చేస్తున్నప్పటికి పురుగుల ఉధృతి తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో రైతులు నష్టపోతు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ప్రధానంగా డోర్నకల్‌, మహబూబాబాద్‌, మరిపెడ, గూడూరు, కురవి, కేసముద్రం మండలాల్లోనే కాకుండా అన్ని మండలాల్లో ఈ కొత్తరకం తామరపురుగు మిర్చి తోటలపై విస్తరించింది. 


మొదటిసారిగా గుంటూరులో...

గతేడాది జనవరి నెలలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఈ కొత్తరకం రసం పీల్చే నల్ల తామర పురుగులను డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు జిల్లా ఉద్యానవన అధికారులు తెలిపారు. క్రమేపి ఈ ఏడాది ఆ పురుగు ఆంధ్రాను దాటి తెలంగాణ జిల్లాలోకి ప్రవేశించి మిర్చి రైతులను పరేషాన్‌ చేస్తున్నాయి. వేల రూపాయలు ఖర్చు చేసి క్రిమిసంహారిక మందులు పిచికారి చేసిన పురుగు చావకుండ తట్టుకునే శక్తి బాగా పెరుగుతోంది. దీంతో ఆ పురుగును నివారించేందుకు ఏం చేయాలో తోచక రైతులు తలలు పట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


రైతులు తక్షణమే తీసుకోవాల్సి జాగ్రత్తలు..

రైతులు విపరీతంగా మందులు కొట్టడం వల్ల రసం పీల్చే నల్లతామర పురుగులు గుడ్లు పెట్టే సామార్థ్యం ఎక్కువగా పెరిగింది. సింథటిక్‌ పైరీట్రైడ్‌ మందులను, స్సైనోసార్‌, ప్రొఫీనోఫాస్‌, ఇమిడాక్లోఫ్రిడ్‌ లాంటి మందులు ఎక్కువగా పిచికారి చేయరాదని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు. రైతులు సామూహికంగా ఎక్కువ సంఖ్యలో నీలిరంగు, పసుపురంగు అట్టముక్కలను పొలంలోనూ, మిర్చి తోటల్లో పెట్టుకోవడం ద్వారా తల్లిపురుగులను నివారించే అవకాశం ఉంది. 


అందుబాటులో ఉన్న పురుగుమందుల ద్వారా పిల్ల పురుగులను సులువుగా నివారించవచ్చు. అయితే తల్లి పురుగులను నివారించడం చాలా కష్టం. తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండ నివారించడం కోసం వేపాకు సంబంధించిన పురుగుమందులను పిచికారి చేయాలి. వేపనూనే 10 వేలు పీపీఎం లీటర్‌ నీటికి 3మిల్లిమీటర్లు. 0.5 గ్రాముల సర్ఫ్‌కానీటైటాన్‌–100 కలిపి పిచికారి చేసుకోవాలి. ఎస్సిటామీఫ్రిడ్‌ (ఫ్రైడ్‌) ఎకరానికి 40–50 గ్రాములు వరకు లేదా సైయాంట్రనిలిఫ్రోల్‌ 240 మిల్లిలీటర్లు ఎకరానికి పిచికారి చేయాలి. మిరప రైతులు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి అవసరం మేరకే వాడాల్సిన అవసరం ఉంది. పొలాల్లో, మిర్చి తోటల్లో అక్కడక్కడ పొద్దుతిరుగుడు మొక్కలను ఆకర్షక పంటగా వేసుకోవాలి. 


ఎన్ని మందులు కొట్టిన తగ్గడం లేదు : వాంకుడోతు భాస్కర్‌, రైతు, సోమ్లతండ, డోర్నకల్‌ 

రెండేకరాల్లో మిర్చి పంటను సాగు చేశా... ప్రమాదంలో ఒక కాలు పోయినప్పటికి ఎంతోకష్టపడి మిర్చి తోటను సాగు చేశా. కొత్తగా ఈ నల్లతామర పురుగు ఉధృతంగా వ్యాప్తి చెందింది. ఎన్నో రకాల పురుగుమందులు తీసుకువచ్చి వేల రూపాయలు ఖర్చు చేసి పిచికారి చేసిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రభుత్వ ఆర్థికంగా తనను ఆదుకోవాలి.

Advertisement
Advertisement