చక్రాల కుర్చీకి పరిమితమైన పోలియో బాధితుడు.. నాఅన్న వాళ్లెవరూ లేరు.. అయినా ఇండియాకు తరలించేందుకు నిర్ణయించిన న్యూజీల్యాండ్!

ABN , First Publish Date - 2022-04-08T02:45:37+05:30 IST

భారత్‌లో నరేంద్రజిత్‌కు నా అన్న వారెవరూ లేరని తెలిసీ ప్రభుత్వం ఆయన్ను స్వదేశానికి సాగనంపేందుకు సిద్ధమైంది. దీనికి కారణం.. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ పొరపాటే!

చక్రాల కుర్చీకి పరిమితమైన పోలియో బాధితుడు.. నాఅన్న వాళ్లెవరూ లేరు.. అయినా ఇండియాకు తరలించేందుకు నిర్ణయించిన న్యూజీల్యాండ్!

ఎన్నారై డెస్క్: ఆయన పేరు నరేంద్రజిత్ సింగ్. వయసు నలభైకి పైనే. 22 ఏళ్లుగా న్యూజీల్యాండ్‌లో ఉంటున్నారు. పోలీయో కారణంగా నడుము కింద భాగమంతా చచ్చుబడిపోవడంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. దీనికి తోడు పారానాయిడ్ ష్క్రిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. అంటువంటి వ్యక్తిని భారత్‌కు పంపించేందుకు న్యూజిల్యాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌లో నరేంద్రజిత్‌కు నా అన్న వారెవరూ లేరని తెలిసీ ప్రభుత్వం ఆయన్ను స్వదేశానికి సాగనంపేందుకు సిద్ధమైంది. దీనికి కారణం.. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ పొరపాటే!


సుమారు 22 ఏళ్ల క్రితం నరేంద్రజిత్ సింగ్ తన కుటుంబంతో సహా న్యూజిల్యాండ్‌కు పర్యటక వీసాపై వెళ్లారు. ఆ తరువాత వారు.. అక్కడే నివసించేందుకు అనుమతి పొందారు. ఈ క్రమంలో ఓ రోజు నరేంద్ర..తన కారుతో పొరుగింటి వ్యక్తి కారును ఢీకొట్టారు. అదృష్టవశాత్తూ.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అప్పట్లో.. తన మానసిక సమస్య కారణంగా స్థిమితం కోల్పోయిన పరిస్థితిలో ఆయన ఈ యాక్సిడెంట్ చేశారు. అయితే.. ఈ వివరాలేవీ చెప్పకుండానే నరేంద్ర తాను చేసిన నేరాన్ని అంగీకరించారు.


అప్పటి నేరమే ఇప్పుడు నరేంద్రను చిక్కుల్లోకి నెట్టింది. నేరం చేసిన కారణంగా ఆయన న్యూజిల్యాండ్ నుంచి బహిష్కృతుడయ్యే ప్రమాదంలో పడ్డారు. అయితే.. ఆయన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకూంటు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ప్రారంభమైన ఆన్‌లైన్ పిటిషన్‌కు ప్రస్తుతం మద్దతు పెరుగుతోంది. ఈ విషయంలో కల్పించుకోవాలంటూ ఆయన బంధువులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. న్యూజీల్యాండ్ నుంచి నరేంద్రను పంపించడమంటే.. యావత్‌ కుటుంబానికి మరణ శిక్ష విధించడమేనని వారు వాపోయారు. 

Updated Date - 2022-04-08T02:45:37+05:30 IST