తీరు మారలేదు

ABN , First Publish Date - 2020-03-01T09:36:46+05:30 IST

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులోనూ భారత్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. స్టార్‌ లైనప్‌ కలిగి ఉన్నా నిర్లక్ష్యపు షాట్లతో తగిన మూల్యం చెల్లించుకుంది...

తీరు మారలేదు

..అయినా వేదిక మారినా భారత జట్టుది అదే కథ.. అదే వ్యధ. పిచ్‌ పచ్చికతో కళకళలాడుతున్నా బంతి అంత ప్రమాదకరంగా ఏమీ కనిపించలేదు.. పృథ్వీ షా దూకుడైన ఆటతీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఓ దశలో భారత్‌ 194/4 స్కోరుతో పటిష్ఠంగానే ఉంది. కానీ అంతలోనే ఏమైందో మరి.. చెత్త షాట్లకు చిత్తవుతూ 48 పరుగులకే మిగిలిన ఆరు వికెట్లనూ కోల్పోయింది. పుజార, విహారి భాగస్వామ్యం జట్టు పరువు కాపాడింది. అదనపు బౌన్స్‌తో ఇబ్బందిపెట్టిన జేమిసన్‌ ఈసారి ఐదు వికెట్లతో భారత్‌ వెన్నువిరిచాడు. ఇక మన బ్యాట్లు తడబడిన చోట కివీస్‌ ఓపెనర్లు సునాయాసంగా ఆడేస్తున్నారు. దీనికి తోడు రానున్న రెండు రోజులు పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో భారత్‌ కష్టాలు పెరగడం ఖాయం. 


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 242 ఆలౌట్‌

పృథ్వీ షా, పుజార, విహారి అర్ధసెంచరీలు

పేసర్‌ జేమిసన్‌కు ఐదు వికెట్లు

న్యూజిలాండ్‌  63/0


క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులోనూ భారత్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. స్టార్‌ లైనప్‌ కలిగి ఉన్నా నిర్లక్ష్యపు షాట్లతో తగిన మూల్యం చెల్లించుకుంది. అటు ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు తొలిరోజే పైచేయి సాధించింది. అయితే హనుమ విహారి (55), పృథ్వీ షా (54), పుజార (54) అర్ధసెంచరీల సహాయంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 63 ఓవర్లలో 242 పరుగులు చేయగలిగింది. కెరీర్‌లో రెండో టెస్టు ఆడుతున్న పేసర్‌ జేమిసన్‌ (5/45) ఐదు వికెట్లతో దెబ్బతీయగా.. టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఆతర్వాత కివీస్‌ శనివారం ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 63 రన్స్‌ సాధించింది. క్రీజులో లాథమ్‌ (27), బ్లండెల్‌ (29) ఉన్నారు. రెండో రోజు తొలి సెషన్‌లో మబ్బులు పట్టే అవకాశం ఉండడంతో భారత బౌలర్లు కివీస్‌ను ఇబ్బంది పెడతారేమో చూడాలి!


పృథ్వీ జోరు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఈసారీ శుభారంభం దక్కలేదు. అయితే గ్రీన్‌ వికెట్‌ అయినప్పటికీ భారత్‌ నుంచి ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ అర్ధసెంచరీలు చేయగలిగారు. ఓపిగ్గా ఆడితే పరుగులు రావడం కష్టం కాదనే విషయాన్ని మిగతా బ్యాట్స్‌మెన్‌ మరిచారు. తొలి టెస్టులో పేలవ ఫుట్‌వర్క్‌తో నిరాశపరిచిన ఓపెనర్‌ పృథ్వీ షా ఈసారి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తూ వన్డే తరహాలో చెలరేగాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా షా ధాటిగా ఆడాడు. చక్కటి డ్రైవ్‌ షాట్లతో అలరించాడు. వాగ్నర్‌ వేసిన ఓ బౌన్సర్‌ను సిక్సర్‌గా మలిచి 61 బంతుల్లో కెరీర్‌లో రెండో టెస్టు అర్ధసెంచరీ చేశాడు. అయితే 20వ ఓవర్‌లో లాథమ్‌ అద్భుత క్యాచ్‌తో షా అవుటవగా, రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 


ఆదుకున్న విహారి, పుజార: లంచ్‌ విరామం తర్వాత స్వల్ప వ్యవధిలోనే కెప్టెన్‌ కోహ్లీ (3), రహానె (7)ను సౌథీ పెవిలియన్‌ చేర్చడంతో భారత్‌ 113 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పుజారకు విహారి సహకారమందించాడు. పుజార నిదానం కనబర్చినా విహారి ఎదురుదాడికి దిగి పరుగులు రాబట్టాడు. పది బౌండరీలతో జోరు ప్రదర్శించాడు. పుజార 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు విహారి స్కోరు 13 పరుగులు కాగా, టీ బ్రేక్‌కు ముందు అవుటయ్యే సమయానికి 55 రన్స్‌ చేశాడు. అప్పటికి పుజార 53 పరుగులతోనే ఉన్నాడు. ఐదో వికెట్‌కు వీరు 81 రన్స్‌ జోడించారు.


చివరి సెషన్‌లో 

టపటపా: టీ బ్రేక్‌ సమయానికి జట్టు స్కోరు 194 కాగా, మరో ఐదు వికెట్లుండడంతో 300 పరుగులు ఖాయమేననిపించింది. కానీ పేసర్‌ జేమిసన్‌ వ్యూహం మార్చి భారత పతనాన్ని శాసించాడు. కివీస్‌ గడ్డపై తొలి హాఫ్‌ సెంచరీ సాధించిన పుజార.. జేమిసన్‌ బౌన్సర్‌ను అనవసరంగా పుల్‌షాట్‌ ఆడి  అవుటయ్యాడు. ఆ తర్వా త 19 పరుగుల తేడాతో పంత్‌ (12), జడేజా (9), ఉమేశ్‌ (0)ను జేమిసన్‌ అవుట్‌ చేసి కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఫీట్‌ సాధించాడు. అయితే షమి (16), బుమ్రా (10 నాటౌట్‌) బ్యాట్లు ఝుళిపించి ఆఖరి వికెట్‌కు 26 రన్స్‌ జోడించారు..


సౌథీ చేతిలో పదోసారి..

ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న విరాట్‌ కోహ్లీని కివీస్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ మాత్రం తెగ ఇబ్బందిపెడుతుంటాడు. రెండో టెస్టులో విరాట్‌ను ఎల్బీ చేసిన సౌథీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడిని ఏకంగా 10 సార్లు అవుట్‌ చేయడం విశేషం. ఏ బౌలర్‌ కూడా కోహ్లీని ఇన్నిసార్లు అవుట్‌ చేయలేదు. టెస్టుల్లో మూడుసార్లు.. వన్డేల్లో ఆరుసార్లు.. టీ20ల్లో ఒక్కసారి కోహ్లీని సౌథీ దెబ్బతీశాడు.


కోహ్లీ.. రివ్యూ అవసరమా!

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దారుణ ఫామ్‌ రెండో టెస్టులోనూ కొనసాగుతోంది. ఈసారి అతడు కేవలం 3 పరుగులకే సౌథీ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. అయితే స్పష్టంగా బంతి వికెట్లకు తాకే అవకాశం ఉందని తెలిసినా కోహ్లీ డీఆర్‌ఎస్‌ కోరడంపై అభిమానులు గుస్సా అవుతున్నారు. వ్యక్తిగత ప్రయోజనం కోసం రివ్యూ వృథా చేస్తావా.. క్రికెట్‌ అనేది జట్టు గేమ్‌ అని ఆ అవుట్‌కు సంబంధించిన ఫొటోను పెడుతూ విమర్శిస్తున్నారు. నిజానికి రివ్యూ కోరడంలో కోహ్లీ ఎప్పుడూ తడబడుతుంటాడు. టెస్టుల్లో బ్యాట్స్‌మన్‌గా 14 సార్లు డీఆర్‌ఎస్‌ కోరితే రెండు మాత్రమే అతడికి అనుకూలంగా వచ్చాయి. దీనికి తోడు ఐసీసీ కూడా అతడి చివరి ఐదు అంతర్జాతీయ ఐదు ఇన్నింగ్స్‌ల స్కోర్లను (3, 19, 2, 9, 15) ట్వీట్‌ ద్వారా ట్రోల్‌ చేసింది.


2 కివీస్‌ గడ్డపై టెస్టుల్లో అత్యంత పిన్న వయస్సు (20 ఏళ్ల 112 రోజులు)లో అర్ధశతకం సాధించిన రెండో భారత ఆటగాడు పృథ్వీ షా. సచిన్‌ టెండూల్కర్‌ (16 ఏళ్ల 291 రోజులు-1990లో) తొలి స్థానంలో నిలిచాడు.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లాథమ్‌ (బి) జేమిసన్‌ 54; మయాంక్‌ (ఎల్బీ) బౌల్ట్‌ 7; పుజార (సి) వాట్లింగ్‌ (బి) జేమిసన్‌ 54; కోహ్లీ (ఎల్బీ) సౌథీ 3; రహానె (సి) టేలర్‌ (బి) సౌథీ 7; విహారి (సి) వాట్లింగ్‌ (బి) వాగ్నర్‌ 55; పంత్‌ (బి) జేమిసన్‌ 12; జడేజా (సి) బౌల్ట్‌ (బి) జేమిసన్‌ 9; ఉమేశ్‌ యాదవ్‌ (సి) వాట్లింగ్‌ (బి) జేమిసన్‌ 0; షమి (బి) బౌల్ట్‌ 16; బుమ్రా (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 63 ఓవర్లలో 242 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-30, 2-80, 3-85, 4-113, 5-194, 6-197, 7-207, 8-207, 9-216, 10-242. బౌలింగ్‌: సౌథీ 13-5-38-2; బౌల్ట్‌ 17-2-89-2; గ్రాండ్‌హోమ్‌ 9-2-31-0; జేమిసన్‌ 14-3-45-5; వాగ్నర్‌ 10-2-29-1.

కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (బ్యాటింగ్‌) 27; బ్లండెల్‌ (బ్యాటింగ్‌) 29; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 23 ఓవర్లలో 63/0. బౌలింగ్‌: బుమ్రా 7-1-19-0; ఉమేశ్‌ యాదవ్‌ 8-1-20-0; షమి 7-1-17-0; జడేజా 1-1-0-0.

Updated Date - 2020-03-01T09:36:46+05:30 IST