పరాభవం

ABN , First Publish Date - 2020-02-25T10:34:49+05:30 IST

ప్రతికూల పరిస్థితుల్లో పోరాడాల్సిన బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో టీమిండియాకు ఘోర పరాభవం తప్పలేదు. రెండు టెస్ట్‌ల

పరాభవం

ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఏమూలనో ఆశ. కానీ, అలాంటిదేమీ జరగలేదు. టీమిండియా పాతకథనే పునరావృతం చేసింది. బ్యాట్స్‌మెన్‌ కనీస పోరాటం లేకుండానే పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. న్యూజిలాండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో  పరాజయం పాలైంది. నాలుగో రోజు 16 ఓవర్లు మాత్రమే ఆడిన కోహ్లీసేన.. 53 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఆరు వికెట్లు చేజార్చుకుంది. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌పలో తొలి ఓటమిని చవిచూసింది. 


10 వికెట్లతో టీమిండియా చిత్తు

న్యూజిలాండ్‌దే తొలి టెస్ట్‌

సౌథీకి ఐదు వికెట్లు

వెల్లింగ్టన్‌: ప్రతికూల పరిస్థితుల్లో పోరాడాల్సిన బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో టీమిండియాకు ఘోర పరాభవం తప్పలేదు. రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా తొలి టెస్ట్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో ప్రత్యర్థికి తలవంచిన కోహ్లీసేన.. నాలుగు రోజుల్లోనే  న్యూజిలాండ్‌కు మ్యాచ్‌ను అప్పగించింది. ఈ ఓటమితో భారత్‌ వరుస ఏడు టెస్ట్‌ల విజయాలకు బ్రేక్‌ పడగా.. కివీస్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఓవర్‌నైట్‌ స్కోరు 144/4తో నాలుగో రోజైన సోమవారం ఆటను కొనసాగించిన భారత్‌.. పేసర్లు టిమ్‌ సౌథీ (5/61), ట్రెంట్‌ బౌల్ట్‌ (4/39) దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది.  ఓవర్‌నైట్‌ స్కోరుకు 53 పరుగులు మాత్రమే జత చేసింది. తొలి సెషన్‌లోనే రహానె (29), విహారి (15), రిషభ్‌ పంత్‌ (25) పెవిలియన్‌ చేరడంతో.. ప్రత్యర్థి ముందు 9 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. దీన్ని న్యూజిలాండ్‌ ఓపెనర్లు లాథమ్‌ (7 నాటౌట్‌), బ్లండెల్‌ (2 నాటౌట్‌) వికెట్‌ కోల్పోకుండా 1.4 ఓవర్లలోనే ఛేదించారు. టెస్ట్‌ క్రికెట్‌లో కివీస్‌కు ఇది వందో విజయం. ఐదు వికెట్లతో భారత్‌ వెన్నువిరిచిన టిమ్‌ సౌథీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. 


16 ఓవర్లలోనే: టెస్ట్‌ను కాపాడుకోవాలనే ఆశలు టీమిండియాకు ఏమైనా మిగిలున్నాయంటే.. అది ఓవర్‌నైట్‌ జోడీ రహానె, విహారిపైనే. వీరిద్దరూ నిలిస్తే ప్రత్యర్థి ముందు కనీసం పోరాడగలిగే లక్ష్యాన్ని ఉంచే అవకాశం ఉండేది. కానీ, మ్యాచ్‌ ఆరంభమైన మూడో ఓవర్‌లోనే అవన్నీ ఆవిరయ్యాయి. బౌల్ట్‌ బౌలింగ్‌లో.. రహానె కీపర్‌కు క్యాచిచ్చాడు. దీంతో 5వ వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక్కడి నుంచి భారత్‌ పతనం వేగంగా జరిగిపోయింది. ఆ వెంటనే విహారిని సౌథీ ఓ అద్భుతమైన బంతితో బౌల్డ్‌ చేశాడు. అశ్విన్‌ (4), ఇషాంత్‌ (12) స్వల్పస్కోర్లకే వెనుదిరిగారు. రిషభ్‌ పోరాటంతో ఇన్నింగ్స్‌ ఓటమిని తప్పించగలిగాడు. పంత్‌తోపాటు బుమ్రాను అవుట్‌ చేసిన సౌథీ.. భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు. 


2018-19లో పెర్త్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత 

భారత్‌కు ఇదే తొలి ఓటమి


తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ వైఫల్యంతోనే మ్యాచ్‌ చేజారింది. టాస్‌ను కారణంగా చెప్పలేం. ఒక టెస్ట్‌ ఓడినంత మాత్రాన అంతా ముగిసిపోలేదు. మళ్లీ పుంజుకుంటాం. 

- కోహ్లీ


స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 165; న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 348;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లాథమ్‌ (బి) బౌల్ట్‌ 14, మయాంక్‌ (సి) వాట్లింగ్‌ (బి) సౌథీ 58, పుజార (బి) బౌల్ట్‌ 11, కోహ్లీ (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌ 19, రహానె (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌ 29, విహారి (బి) సౌథీ 15, పంత్‌ (సి) బౌల్ట్‌ (బి) సౌథీ 25, అశ్విన్‌ (ఎల్బీ) సౌథీ 4, ఇషాంత్‌ (ఎల్బీ) గ్రాండ్‌ హోమ్‌ 12, షమి (నాటౌట్‌) 2, బుమ్రా (సి/సబ్‌) మిచెల్‌ (బి) సౌథీ 0; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 81 ఓవర్లలో 191 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-27, 2-78, 3-96, 4-113,  5-148, 6-148, 7-162, 8-189, 9-191; బౌలింగ్‌: సౌథీ 21-6-61-5; బౌల్ట్‌ 22-8-39-4; గ్రాండ్‌హోమ్‌ 16-5-28-1; జేమిసన్‌ 19-7-45-0; అజాజ్‌ పటేల్‌ 3-0-18-0.

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: టామ్‌ లాథమ్‌ (నాటౌట్‌) 7, బ్లండెల్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు:0; మొత్తం: 1.4 ఓవర్లలో 9/0; బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 1-0-8-0, బుమ్రా 0.4-0-1-0. 

Updated Date - 2020-02-25T10:34:49+05:30 IST