Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్పిన్‌ ఉచ్చులో..

 అక్షర్‌కు ఐదు, అశ్విన్‌కు మూడు వికెట్లు

కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 296 ఆలౌట్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 14/1

ప్రస్తుత ఆధిక్యం 63

ఇంతలోనే ఎంత మార్పు.. రెండో రోజు అత్యంత పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్‌ శనివారం స్పిన్‌ ఉచ్చులో పడి విలవిల్లాడింది. ఓ దశలో 196/1 స్కోరుతో ఉన్న ఈ జట్టుకు 350+ రన్స్‌ కూడా సునాయాసమే అనిపించింది. కానీ అలా జరుగలేదు.. అక్షర్‌ పటేల్‌ మ్యాజిక్‌ బంతులకు కేవలం 99 పరుగులు మాత్రమే జత చేసి మిగతా వికెట్లన్నీ కోల్పోయింది. తక్కువ ఎత్తులో అతడు వేసిన బంతులను ఆడలేక కివీస్‌ బ్యాటర్స్‌ చకచకా పెవిలియన్‌కు చేరారు. అటు అశ్విన్‌ కూడా ఈ పతనంలో భాగం పంచుకున్నాడు. 


అక్షర్‌ పటేల్‌ తన తొలి నాలుగు టెస్టుల్లోనే ఐదు వికెట్లను ఐదేసి సార్లు సాధించడం విశేషం. ఈ జాబితాలో టామ్‌ రిచర్డ్‌సన్‌, రోడ్నీ హాగ్‌తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. చార్లీ టర్నర్‌ టాప్‌లో ఉన్నాడు. అలాగే ఆడిన ప్రతీ టెస్టు మ్యాచ్‌ ఏదేని ఇన్నింగ్స్‌లో క్రమం తప్పకుండా 5 వికెట్లు తీస్తూ టర్నర్‌, రిచర్డ్‌సన్‌ సరసన నిలిచాడు. వరుసగా 6 ఇన్నింగ్స్‌ల్లోనూ 4+ వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్‌ అక్షర్‌. 


 అంపైర్‌తో అశ్విన్‌ వాగ్వాదం

మూడో రోజు ఆటలో అశ్విన్‌ బౌలింగ్‌ తీరుపై అంపైర్‌ నితిన్‌ మీనన్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. 77వ ఓవర్‌లో అశ్విన్‌ రౌండ్‌ ద వికెట్‌ బౌలింగ్‌ చేస్తూ బంతి విసిరాక అంపైర్‌, నాన్‌స్ట్రయికర్‌ను క్రాస్‌ చేస్తూ వెళ్లాడు. దీంతో తనకు వికెట్లు కనిపించడంలేదని, ఎల్బీ నిర్ణయాల్లో ఇబ్బంది ఎదురయ్యే చాన్స్‌ ఉంటుందని అంపైర్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే ‘మీరు నిర్ణయం తీసుకోలేకపోయినా ఇబ్బంది లేదు. మేం డీఆర్‌ఎస్‌కు వెళతాం. నాకిలాగే సౌకర్యంగా ఉంది’ అని అశ్విన్‌ బదులిచ్చాడు. 


కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తిరిగి పోటీలోకొచ్చింది. స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌ (5/62), అశ్విన్‌ (3/82) శనివారం ఆటను తిప్పేశారు. దీంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 142.3 ఓవర్లలో 296 పరుగులకే పరిమితం కాగా టీమిండియాకు 49 పరుగుల ఆధిక్యం దక్కింది.  ఓపెనర్లు లాథమ్‌ (282 బంతుల్లో 10 ఫోర్లతో 95), యంగ్‌ (214 బంతుల్లో 15 ఫోర్లతో 89) అద్భుత పోరాటానికి మిగిలిన బ్యాటర్స్‌ నుంచి సహకారం కరువైంది. అయితే స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ కూడా ఆదిలోనే ఓపెనర్‌ గిల్‌ (1) వికెట్‌ను కోల్పోయింది. పేసర్‌ జేమిసన్‌ సూపర్‌ బంతికి అతడు బౌల్డయ్యాడు. ఈ దశలో మరో వికెట్‌ కోల్పోకుండా పుజార (9 బ్యాటింగ్‌), మయాంక్‌ (4 బ్యాటింగ్‌) రోజును ముగించడంతో భారత్‌ 5 ఓవర్లలో 14/1 స్కోరుతో ఉంది. ప్రస్తుతానికి జట్టు ఆధిక్యం 63 పరుగులు. నాలుగో రోజంతా బ్యాటింగ్‌ చేస్తే కివీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు.


అశ్విన్‌ బ్రేక్‌ చేశాడు..: 

శుక్రవారం రెండు సెషన్లపాటు భారత బౌలర్లను విసిగించిన కివీస్‌.. మూడో రోజు తేలిపోయింది. 129/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో మెరుగ్గా కనిపించినా.. సెషన్‌ గడుస్తున్న కొద్దీ భారత స్పిన్‌ దెబ్బకు వికెట్ల జాతర కొనసాగింది. ఆరంభంలో ఓపెనర్లు లాథమ్‌, యంగ్‌ ఓపిగ్గానే ఆడి స్కోరును 150 దాటించారు. చివరకు 67వ ఓవర్‌లో భారత్‌ ఎదురుచూపులు ఫలించాయి. తక్కువ ఎత్తులో అశ్విన్‌ వేసిన బంతి అవుట్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని భరత్‌ చేతుల్లో పడింది. అయితే అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా భారత్‌ డీఆర్‌ఎ్‌సకు వెళ్లి ఫలితం సాధించడంతో తొలి వికెట్‌కు 151 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే కెప్టెన్‌ విలియమ్సన్‌ (18)ను పేసర్‌ ఉమేశ్‌ ఎల్బీగా అవుట్‌ చేయడంతో జట్టు లంచ్‌ విరామానికి వెళ్లింది.


అక్షర్‌ దెబ్బ:

రెండో సెషన్‌ నుంచి అక్షర్‌ పటేల్‌ కివీస్‌ పతనాన్ని శాసించాడు. టేలర్‌ (11), నికోల్స్‌ (2)లను వరుస ఓవర్లలో అవుట్‌ చేయగా.. శతకానికి స్వల్ప దూరంలో ఉన్న లాథమ్‌ను సైతం ఊరించే బంతికి స్టంప్‌ అయ్యేలా చేశాడు. దీంతో కివీస్‌ 227/5 స్కోరుతో కష్టాల్లో పడింది. కాసేపటికే రచిన్‌ (13)ను జడేజా బౌల్డ్‌ చేశాడు. బ్లండెల్‌ (13), సౌథీ (5)లను కూడా అక్షర్‌ అవుట్‌ చేసి ఐదు వికెట్లను పూర్తి చేశాడు. అయితే చివర్లో జేమిసన్‌ (23), సోమర్‌విల్లే (6) జోడీ మాత్రం బౌలర్లను విసిగిస్తూ వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఈ ఇద్దరినీ అశ్విన్‌ అవుట్‌ చేసి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.

భళా.. భరత్‌

రెగ్యులర్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా మెడ నొప్పి కారణంగా మూడో రోజు ఆటకు దూరమయ్యాడు. దీంతో ఆంధ్ర క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ సబ్‌స్టిట్యూట్‌ కీపర్‌గా బరిలోకి దిగాడు. అనూహ్యంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఈ తెలుగు క్రికెటర్‌ అద్భుతంగా వినియోగించుకున్నాడు. వికెట్ల వెనకాల మెరుపు కదలికలతో పాటు రెండు క్లిష్టమైన క్యాచ్‌లు, ఓ స్టంపింగ్‌తో వహ్వా అనిపించాడు. తక్కువ ఎత్తులో వస్తున్న బంతిని పట్టుకోవడంలో భరత్‌ నైపుణ్యం ప్రదర్శించాడు. ఈక్రమంలోనే విల్‌ యంగ్‌ క్యాచ్‌ను పట్టేసి ఆత్మవిశ్వాసంతో డీఆర్‌ఎస్‌ కోరమన్నాడు. అది ఫలించి భారత్‌కు గట్టి బ్రేక్‌ లభించినట్టయింది. అలాగే లాథమ్‌ 95 స్కోరు వద్ద భరత్‌ చేసిన స్టంపింగ్‌ కూడా అబ్బురపరిచింది. అక్షర్‌ వేసిన షార్ట్‌ బంతిని లాథమ్‌ ముందుకొచ్చి ఆడగా.. బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి నేలను తాకి తక్కువ ఎత్తులో పైకి లేచింది. దీన్ని మెరుపు వేగంతో అందుకున్న భరత్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బెయిల్స్‌ను పడగొట్టాడు. ఈ వికెట్‌ కూడా టీమిండియాకు కీలక మలుపునిచ్చింది. అటు భరత్‌ ప్రదర్శనపై స్పిన్నర్‌ అక్షర్‌పటేల్‌తోపాటు మాజీలు కూడా ప్రశంసించారు. అలాగే జట్టుకు మరో అద్భుత కీపర్‌ సిద్ధంగా ఉన్నాడని, సాహాకు ఇక కష్టకాలమేనని విశ్లేషకుల అభిప్రాయం.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 345

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌:

లాథమ్‌ (స్టంప్‌ సబ్‌) భరత్‌ (బి) అక్షర్‌ 95; యంగ్‌ (సి సబ్‌) భరత్‌ (బి) అశ్విన్‌ 89; విలియమ్సన్‌ (ఎల్బీ) ఉమేశ్‌ 18; టేలర్‌ (సి సబ్‌) భరత్‌ (బి) అక్షర్‌ 11; నికోల్స్‌ (ఎల్బీ) అక్షర్‌ 2; బ్లండెల్‌ (బి) అక్షర్‌ 13; రచిన్‌ (బి) జడేజా 13; జేమిసన్‌ (సి) అక్షర్‌ (బి) అశ్విన్‌ 23; సౌథీ (బి) అక్షర్‌ 5; సోమర్‌విల్లే (బి) అశ్విన్‌ 6; ఎజాజ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 142.3 ఓవర్లలో 296 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-151, 2-197, 3-214, 4-218, 5-227, 6-241, 7-258, 8-270, 9-284, 10-296. బౌలింగ్‌: ఇషాంత్‌ 15-5-35-0; ఉమేశ్‌ 18-3-50-1; అశ్విన్‌ 42.3-10-82-3; జడేజా 33-10-57-1; అక్షర్‌ 34-6-62-5.


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌:

మయాంక్‌ (బ్యాటింగ్‌) 4; గిల్‌ (బి) జేమిసన్‌ 1; పుజార (బ్యాటింగ్‌) 9; మొత్తం: 5 ఓవర్లలో 14/1. వికెట్‌ పతనం: 1-2. బౌలింగ్‌: సౌథీ 2-1-2-0; జేమిసన్‌ 2-0-8-1; ఎజాజ్‌ 1-0-4-0.

Advertisement
Advertisement