ఆసిఫాబాద్‌లో బీజేపీలో కొత్త జోష్‌

ABN , First Publish Date - 2022-07-02T04:47:21+05:30 IST

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్రంపై గురిపెట్టిన ఆపార్టీ జాతీయ నాయ కత్వం ఆసిఫాబాద్‌ జిల్లాలోని రెండు శాసనసభా నియోజకవర్గాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఆసిఫాబాద్‌లో బీజేపీలో కొత్త జోష్‌

-జాతీయ స్థాయి నేతల రాకతో కార్యకర్తల్లో ఉత్సాహం

-బూత్‌స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి

-వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ

-విజయ సంకల్ప సభ నేపథ్యంలో జనసమీకరణ పైనా దృష్టి 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్రంపై గురిపెట్టిన ఆపార్టీ జాతీయ నాయ కత్వం ఆసిఫాబాద్‌ జిల్లాలోని రెండు శాసనసభా నియోజకవర్గాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాల అధ్యక్షులను నియమించిన బీజేపీ తాజాగా సంస్థాగత పటిష్టతపై దృష్టి సారించినట్టు కన్పిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజధానిలో నేడు, రేపు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాల కోసం ఆ పార్టీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలను ఇక్కడ మోహరించింది. ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంచార్జీని నియమించి పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో మొదటగా 2వ తేదీన జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత 3న నిర్వహించనున్న విజయ సంకల్ప సభకు భారీ జనసమీకరణ జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ కార్యక్రమాలకు దేశ ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరు కానుండ టంతో విజయ సంకల్పసభను విజయవంతం చేసేందుకు జిల్లాలో భారీగా జనసమీకరణ చేయాలని పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నింపేం దుకు ప్రయత్నిస్తోంది. జిల్లా నుంచి కనీసం 50వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ పార్టీ స్థానికనేతలు చెబుతుండగా, కనీసం 30వేల మందినైనా సభకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామని నియోజకవర్గస్థాయి నేతలు అంటున్నారు. ప్రత్యేకంగా విజయ సంకల్పసభకు జన సమీకరణ కోసమే పార్టీ కేంద్ర నాయకత్వం ఆసిఫాబాద్‌, సిర్పూరు శాసనసభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలుగా దాద్రానగర్‌ హవేలి రాష్ట్ర అధ్యక్షుడు దిపేష్‌ తండాల్‌, మణిపూర్‌ రాష్ట్ర అధ్యక్షురాలు శారద దేవికి బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరు రెండ్రోజులుగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ జనసమీకరణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి జనాన్ని సమీకరించేలా మండల, గ్రామ బూత్‌లెవల్‌ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ మార్గనిర్దేశనం చేస్తున్నారు. జాతీయ నేతల రాకతో జిల్లాలోని రెండు నియోజకవర్గాలోనూ బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తొణకిసలాడుతోంది. 

పార్టీ బలోపేతంపైనే దృష్టి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఓ అంచనాకు వచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలో అధికా రాన్ని కైవసం చేసుకునే దిశగా ప్రత్యేక కార్యచరణ అమలు చేయబో తోందని ఆపార్టీ ముఖ్యనాయకుడు ఒకరు వెల్లడించారు. స్థానిక నేతలతో పాటు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సంఘ్‌ పరివార్‌ నుంచి ప్రత్యేకంగా ఓ ప్రభారి(జిల్లా ఇన్‌చార్జి)ని కూడా నియమించారు. ప్రస్తుతం విజయ సంకల్పసభ నేపథ్యంలో కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రతినిధులు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వీరు అటు జనసమీకరణ కోసం ప్రయత్నాలు జరుపుతూనే మరో వైపు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నాయకత్వానికి మార్గనిర్ధేశం చేస్తున్నట్టు తెలు స్తోంది. ముఖ్యంగా గ్రామాలు, మండలాలు నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది. ఎక్కడ బలహీనంగా ఉంది. బలహీనంగా ఉన్న చోట పార్టీని పటిష్టం చేసే దిశగా వ్యూహాలు ఎలా ఉండాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి ఓ ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్రాల అధ్యక్షులు, సంఘ్‌ పరివార్‌కు చెందిన ఇతర అనుబంధ సంఘాలముఖ్యులను కూడా నియోజకవర్గాల్లో మోహ రించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో అధికారం సాధించటమే లక్ష్యంగా పావులు కదుపుతోందనే విషయాన్ని ఈ పరిణామాలు తెలియ జేస్తున్నాయి.

Updated Date - 2022-07-02T04:47:21+05:30 IST