అవునా?

ABN , First Publish Date - 2021-09-18T05:52:03+05:30 IST

నాలుగు రోజుల కిందట అమెరికన్ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన ఒక వార్తాకథనం భారతప్రభుత్వాన్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టింది. కొవిడ్‌ నిర్వహణ భారతదేశంలో సూటిగా, పారదర్శకంగా జరగలేదని, నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం...

అవునా?

నాలుగు రోజుల కిందట అమెరికన్ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన ఒక వార్తాకథనం భారతప్రభుత్వాన్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టింది. కొవిడ్‌ నిర్వహణ భారతదేశంలో సూటిగా, పారదర్శకంగా జరగలేదని, నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం రాజకీయ అవసరాలకు అనుగుణంగా అది సాగిందని ఆ పత్రికాకథనం సారాంశం. వైద్య ఆరోగ్యరంగంలో భారతదేశానికి శిఖరాయమానమైన పరిశోధన సంస్థ, కొవిడ్‌ నిర్వహణలో మొత్తం దేశానికి మార్గదర్శనం చేస్తున్న వ్యవస్థ అయిన భారతీయ వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) ప్రభుత్వానికి కావలసినవిధంగా తన అధ్యయన ఫలితాలను, సూచనలను మలిచిందని న్యూయార్క్ టైమ్స్ రాసింది. ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలు. రెండో వెల్లువ వస్తుందని తమ బృందంలోని శాస్త్రవేత్తలు సూచిస్తున్నప్పటికీ, దాన్ని కప్పిపుచ్చి, అంతా సజావుగా ఉన్నదనీ, కొవిడ్‌ చరమదశలోకి వచ్చామని 2021 జనవరి, ఫిబ్రవరి మాసాలలో కూడా ఐసిఎంఆర్ చెప్పి, కేంద్రప్రభుత్వ రాజకీయ అవసరాలకు సాయపడడం నిజమే అయితే, అంతకు మించిన దుర్మార్గం మరొకటి లేదు. కొవిడ్‌–19 ప్రారంభమైన పద్దెనిమిది, పందొమ్మిది మాసాలలో ఏమి జరిగిందో, ప్రభుత్వ స్పందనలు ఎట్లా ఉన్నాయో, ఐసిఎంఆర్ మార్గదర్శకత్వం ఏ ప్రాతిపదికల మీద సాగిందో పెద్ద ఎత్తున దర్యాప్తు చేయవలసిన అవసరం ఉన్నదా? 


తరువాతెప్పుడో సమీక్షించుకోవలసిన అంశాలను ఇప్పుడు ఉన్నపళంగా ముందుకు తెచ్చి, చేస్తున్న పని నుంచి పక్కదారి పట్టడం సబబు కాదు, ఈ అంశాలేవీ ప్రజారోగ్య దృక్పథం నుంచి ముఖ్యమైనవేమీ కావు-, అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు. ఈ కథనానికి సందర్భశుద్ధి లేదు. ఇటువంటి వక్రీకరణలను ఖండిస్తున్నాము, వాంఛనీయమైన పరిణామాలు కావు ఇవి- అని నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యులు వి.కె. పాల్ వ్యాఖ్యానించారు. ఇక కథానాయకుడైన ఐసిఎంఆర్ డెరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ ఏమన్నారు?– ‘కొవిడ్‌ కట్టడి విషయంలో ఇప్పుడు మనం చాలా బాగున్నాము, టీకాకరణ కూడా అద్భుతంగా సాగుతున్నది, ఈ సమయంలో మన విజయాల నుంచి దృష్టి మళ్లించడానికి ఇవన్నీ రాశారు, ఇందులోని అంశాలన్నీ ఎప్పుడో సమసిపోయినవి, పట్టించుకోదగినవే కాదు.’ 


మన దేశ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలుచేయడానికి ఒక విదేశీ పత్రిక రాసిన రాతలుగా న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని పరిగణించవచ్చునా? ఈ తాజా కథనమే కాదు, మన కొవిడ్‌ మరణాల లెక్కలను సవాల్ చేస్తూ కూడా ఈ పత్రిక ఆ మధ్య కథనం ప్రచురించింది. ఇక అమెరికన్ వార్తావారపత్రిక టైమ్ అయితే, నదీతీరంలో అసంఖ్యాక చితుల ఆకాశచిత్రాన్ని ముఖచిత్రంగా ప్రచురించింది. ఒక ప్రపంచ విపత్తు విషయంలో వాస్తవాల వెల్లడిని దేశభక్తి, జాతీయత అన్న పరికరాలతో అర్థం చేసుకోగలమా? కొవిడ్‌ నిర్వహణలో అందరి కంటె అధికంగా అల్లరిపాలు అయిందెవరంటే అమెరికా ప్రభుత్వమే. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండగా, కొవిడ్‌ కట్టడుల విషయంలో అత్యంత హాస్యాస్పదంగా, బాధ్యతారహితంగా ఆయన వ్యవహరించాడని ప్రపంచమంతా విమర్శించింది. ఇవాళ అఫ్ఘానిస్థాన్ విషయంలో జో బైడెన్‌ను దేశంలోనూ బయటా తప్పుపట్టేవారున్నారు. ఇక్కడ స్వదేశీ, విదేశీ వాదనలు చెల్లవు. ఈ కథనాన్ని రాసినవారూ, కథనంలో అభిప్రాయాలు చెప్పినవారూ అందరూ భారతీయులే. 


రెచ్చగొట్టే కథనంగా బలరామ్ భార్గవ న్యూయార్క్ టైమ్స్ వార్తను ఎందుకు అభివర్ణిస్తున్నారు? ఎందుకంటే, ప్రభుత్వ అభీష్టాన్ని గ్రహించి, సాటి శాస్త్రవేత్తల ద్వారా అమలు చేయించినవారు భార్గవే అని న్యూయార్క్ టైమ్స్ రాసింది. 2020 మార్చి చివరలో లాక్‌డౌన్ ప్రభావాన్ని నిర్వీర్యం చేసిందని తబ్లిగీ జమాత్‌పై కేంద్రప్రభుత్వం, జాతీయ అధికారపార్టీ శ్రేణులు గురిపెట్టిన ప్రచారానికి కూడా ఐసిఎంఆర్ వంతపాడిందని, అభ్యంతరపెట్టిన శాస్త్రవేత్తలను ఆయన వారించాడని కథనం వివరించింది. వ్యాధి నిరోధకత వ్యాప్తిని అంచనా వేయడానికి జరిపే సీరో అధ్యయనాల ఫలితాలను ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా మలచి చూపించారని కూడా ఆ వార్తలో రాశారు. ఈ కథనం ప్రకారం... గత ఏడాది ఆగస్టు 15 నాటికి స్వదేశీ టీకాకు అనుమతులు ఇవ్వాలని శాస్త్రవేత్తలపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నది, ఎర్రకోటపై జెండావందనం జరిగే సమయానికి ప్రధాని మోదీకి దాన్ని ఒక విజయాంశంగా అందించడం లక్ష్యం కావచ్చు. దానిపై విమర్శలు వచ్చాక అది సద్దుమణిగి, కొన్ని నెలల అనంతరం మాత్రమే టీకాకు అనుమతులు మొదలయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలలో లబ్ధి కోసం, రెండో విడత వెల్లువ గురించి హెచ్చరికలను తగ్గించి చెప్పారు. ఐసిఎంఆర్ పెద్దలను ప్రశ్నిస్తూ వచ్చిన డాక్టర్ అనుప్ అగర్వాల్ గత ఏడాది అక్టోబర్‌లో సంస్థ నుంచి మాత్రమే కాదు, దేశం నుంచే బయటకు వెళ్లిపోవలసి వచ్చింది. ప్రస్తుతం ఆయన అమెరికాలో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. తరువాత కాలంలో వ్యర్థమని తెలిసిన అనేక చికిత్సా పద్ధతులను, ఔషధాలను కూడా కొవిడ్‌ కాలంలో దేశం మీద రుద్దారని అగర్వాల్ న్యూయార్క్ టైమ్స్‌కు చెప్పారు. 


దేశంలోని సకల వ్యవస్థలను గుప్పిటిలో పెట్టుకోవాలని, అధికారాన్ని కేంద్రీకృతం చేయాలని ప్రస్తుత కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని, విజయం కూడా సాధిస్తోందని తెలుసును. కానీ, శాస్త్రవిజ్ఞాన రంగాలకు చెందిన సంస్థలపై కూడా ఇటువంటి నియంత్రణ ప్రభుత్వాలకు ఉండడం వాంఛనీయం కాదు. నిజానికి న్యూయార్క్ టైమ్స్ కథనంలో చెప్పిన అనేక అంశాలు ఆయా సందర్భాలలో దేశంలో కూడా చర్చకు వచ్చినవే. కానీ, ఆరోగ్య రంగానికి సంబంధించి ఒక ధీమాను, విశ్వాసాన్ని ఇవ్వవలసిన ప్రతిష్ఠాత్మక సంస్థ ఇట్లా వ్యవహరిస్తుందా అన్నది నమ్మశక్యంగా లేదు. అందుకే విచారణ జరగాలి. అది ఎవరి ముందో నిరూపణ కోసం కాదు. మనలను మనం నిలబెట్టుకోవడానికి. వారం రోజుల్లో అమెరికా పర్యటన ఉండగా, ఇటువంటి కథనం రావడం ప్రధానికి, ప్రభుత్వానికి ఇబ్బందే.

Updated Date - 2021-09-18T05:52:03+05:30 IST