'నైటా' ఆధ్వర్యంలో ఘనంగా బోనాల కార్యక్రమం

ABN , First Publish Date - 2021-07-27T17:46:50+05:30 IST

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో బోనాలు, పిక్నిక్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

'నైటా' ఆధ్వర్యంలో ఘనంగా బోనాల కార్యక్రమం

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో బోనాలు, పిక్నిక్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మంది హాజరయ్యారని.. పిల్లలు, పెద్దలతో విచ్చేసిన కమ్యునిటీ ప్రముఖులతో ఆద్యంతం ధూంధాంగా జరిగిందని ప్రెసిడెంట్ రమ వనమ తెలిపారు. ‘అమ్మా బైలేల్లినాదో.. తల్లీ బైలేల్లినాదో’  అంటూ అమ్మ వారిపై  భక్తిపూర్వకంగా పాటలు పాడుకుంటూ తెలంగాణ సంసృతికి అద్దంపట్టే సంప్రదాయ “బోనాలు” ఎత్తుకుని ఊరేగింపుగా బయలుదేరిన మహిళలు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. బోనాలతో స్త్రీలు ప్రదర్శనగా సాగుతుండగా ముందు పోతరాజు(అశోక్ చింతకుంట) నాట్యం చేయడం ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 


అనంతరం మహిళలు పూలు, పసుపు కుంకుమలు, ఇష్ట నైవేద్యాలతో అమ్మ వారిని పూజలు చేశారు. దూరదేశంలోనూ తమ మొక్కులు తీర్చేందుకు సాక్షాత్తు అమ్మవారు విచ్చేసారా అన్నట్లున్న అలంకరణ చూసి అందరూ తమ కోరికలను విన్నవించుకుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంతా మహిళలు, పిల్లల కోలాహంతో, ఆటపాటలతో సందడిగా జరిగింది. ఈ సందర్భంగా న్యూయార్క్ తెలంగాణా తెలుగు సంఘం (నైటా) తరఫున ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు ప్రెసిడెంట్ రమ కుమారి వనమ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు.

Updated Date - 2021-07-27T17:46:50+05:30 IST