బ్రెజిల్ అధ్యక్షుణ్ని అనుమతించని న్యూయార్క్
రెస్టారెంట్ .. బయటే నిల్చుని పిజ్జా తిన్న బోల్సెనారో
న్యూయార్క్, సెప్టెంబరు 21: ఇప్పటిదాకా కరోనా టీకాను వేయించుకోని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సెనారోను న్యూయార్క్‌లో ఓ రెస్టారెంట్ నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. దీంతో భోజనం చేసేందుకు అక్కడి వెళ్లిన ఆయన, తన బృందంతో కలిసి ప్రధాన ద్వారం ఆవలే నిల్చున్నారు. ఆకలితో తిరిగి వెళ్లలేక రెస్టారెంట్ బయట నిల్చున్న చోటుకే పిజ్జా తెప్పించుకొని తిన్నారు. బోల్సెనారో, మొదట్నుంచి కూడా కరోనాను తేలిగ్గా తీసుకుంటున్నారు. అప్పట్లో తమ ప్రజలకు టీకాలు అక్కర్లేదని ప్రకటించిన ఆయన, లక్షల్లో కేసులు వెలుగుచూడటంతో ఇటీవల టీకాలు వేసుకునేందుకు అనుమతించారు. ఆయన మాత్రం ఇప్పటిదాకా టీకా వేయించుకోలేదు. ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన బోల్సెనారో ఆదివారం రాత్రి తన బృందంతో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకుండా ఎవర్నీ అక్కడి రెస్టారెంట్లు లోపలికి అనుమతించడం లేదు. సాక్షాత్తు ఓ దేశానికి అధ్యక్షుడైనా రూల్ అంటే రూలే అంటూ బోల్సెనారోను రెస్టారెంట్ నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. దీంతో బయటే నిల్చుని ఆయన తన ఆకలిని తీర్చుకోవాల్సి వచ్చింది.