Viral News: చేయని తప్పుకు 20ఏళ్లపాటు జైలు జీవితం.. ఫెడరల్ కోర్టు తాజా తీర్పులో ఏం చెప్పిందంటే..

ABN , First Publish Date - 2022-08-13T18:43:10+05:30 IST

చేయని తప్పుకు ఓ వ్యక్తి 20ఏళ్లపాటు జైలు జీవితాన్ని గడిపిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల మాటలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. అతడికి జైలు శిక్ష విధించింది. అయితే 20ఏళ్ల తర్వాత అతడు నిర్దోషిగా తేలాడు. ఈ క్రమం

Viral News: చేయని తప్పుకు 20ఏళ్లపాటు జైలు జీవితం.. ఫెడరల్ కోర్టు తాజా తీర్పులో ఏం చెప్పిందంటే..

ఎన్నారై డెస్క్: చేయని తప్పుకు ఓ వ్యక్తి 20ఏళ్లపాటు జైలు జీవితాన్ని గడిపిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల మాటలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. అతడికి జైలు శిక్ష విధించింది. అయితే 20ఏళ్ల తర్వాత అతడు నిర్దోషిగా తేలాడు. ఈ క్రమంలో ఫెడరల్ కోర్టు తాజాగా కీలక తీర్పు వెల్లడించింది. దీంతో ప్రస్తుతం స్థానికంగా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



1996లో జార్జి కొల్లాజో అనే వ్యక్తి హత్యకు న్యూయార్క్‌లో( New York) గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో అధికారులు.. రిచార్డ్ రొసారియో(Richard Rosario) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడిగా కోర్టులో హాజరుపర్చారు. విచారణ సందర్భంగా ముగ్గరు ప్రత్యక్ష సాక్షులు.. కోర్టుకు హాజరయ్యారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు.. రిచార్డ్ రొసారియోనే హంతకుడు అని కోర్టుకు తెలపగా.. మరో వ్యక్తి మాత్రం ఆ మాటలను ఖండించాడు. ఈ క్రమంలో కోర్టు.. ఇద్దరు వ్యక్తుల సాక్ష్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని 1998లో రిచార్డ్ రొసారియోని దోషిగా తేల్చింది. అంతేకాకుండా అతడికి జైలు శిక్ష విధించింది. హత్య జరిగిన సమయంలో తాను ఫ్లోరిడాలో(Florida) ఉన్నానని చెప్పినా.. అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని రిచార్డ్ రొసారియో కోర్టుకు చెప్పాడు. అయితే కోర్టు మాత్రం అతడి మాటలను వినిపించుకోలేదు. 


ఈ నేపథ్యంలో 20ఏళ్ల అనంతరం అతడు నిర్దోషి అనే సత్యం బయటపడింది. దీంతో జైలు నుంచి విడుదలైన అతడు.. న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు(New York Federal Court)ను ఆశ్రయించాడు. తనను జైల్లో వేయడం వల్ల తనకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నాడు. దీంతో స్పందించిన కోర్టు.. అతడి వాదనలపై విచారణ జరిపి.. తాజాగా తీర్పు వెల్లడించింది.నష్ట పరిహారంగా రిచార్డ్ రొసారియోకు 5 మిలియన్ డాలర్ల డబ్బును అందించాలని పేర్కొంటూ తీర్పు వెల్లడించింది. 


Updated Date - 2022-08-13T18:43:10+05:30 IST