వాషింగ్టన్: న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది మంది మహిళలు తమను క్యూమో లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఈ క్రమంలో క్యూమో వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో డెమొక్రటికి పార్టీకి చెందిన క్యూమో రాజీనామాపై మంగళవారం అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన సందర్భంలో క్యూమో రాజీనామా విషయమై తలెత్తిన ప్రశ్నకు సమాధానంగా.. ఒకవేళ గవర్నర్‌పై వచ్చిన ఆరోపణలు రుజువైతే తప్పకుండా ఆయన రాజీనామా చేస్తారని అన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందన్నారు. మరోవైపు క్యూమో తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. తాను ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదని చెబుతున్నారు. ఇక గత పదేళ్లుగా క్యూమో న్యూయార్క్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. 2022తో ఆయన మూడో టర్మ్ గవర్నర్ గిరి ముగియనుంది.