న్యూయార్క్‌లో 25 వేలు దాటిన మరణాల సంఖ్య

ABN , First Publish Date - 2020-07-16T04:20:05+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య

న్యూయార్క్‌లో 25 వేలు దాటిన మరణాల సంఖ్య

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 25 వేలు దాటింది. మంగళవారం కరోనా బారిన పడి తొమ్మిది మంది చనిపోవడంతో మొత్తం కేసుల సంఖ్య 25,003కు చేరింది. మరోపక్క మంగళవారం 63,598 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 831 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,04,006గా ఉంది. కాగా.. మార్చి, ఏప్రిల్ నెలల్లో న్యూయార్క్ రాష్ట్రం కరోనాకు కేంద్రంగా ఉండేది. ఆ సమయంలో నిత్యం వందలాది మంది ప్రాణాలు విడిచారు. ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు లేక ఆసుపత్రికి వచ్చిన సెకన్లలోనే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడి మృతిచెందిన వారిని పూడ్చడానికి శ్మశానాలు కూడా సరిపోలేదంటే ఎంతటి దారుణమైన పరిస్థితి ఎదురైందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తూ రావడంతో.. కరోనాను నియంత్రించగలిగింది. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేట్ ఒక శాతానికి అటు ఇటుగానే ఉంటోంది. మరణాల రేటు కూడా చాలా తక్కువగానే నమోదవుతోంది. మరోపక్క ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో న్యూయార్క్ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతోంది. ఇక అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 35 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా.. లక్షా 39 వేలకు పైగా మరణించారు.

Updated Date - 2020-07-16T04:20:05+05:30 IST