డొనాల్డ్ ట్రంప్‌నకు రోజుకు 10 వేల డాలర్ల జరిమానా

ABN , First Publish Date - 2022-04-28T00:49:58+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకు

డొనాల్డ్ ట్రంప్‌నకు రోజుకు 10 వేల డాలర్ల జరిమానా

న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకు 10,000 డాలర్లు జరిమానా చెల్లించాలని న్యూయార్క్ జడ్జి సోమవారం (స్థానిక కాలమానం) ఆదేశించారు. ఆయన హాజరుకావాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడంతోపాటు, తన వ్యాపార పద్ధతులకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించే వరకు ఈ జరిమానాను చెల్లించాలని తెలిపారు. దీంతో ఆయన మంగళవారం 10 వేల డాలర్ల జరిమానా బాకీపడ్డారు. 


డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక లబ్ధి పొందడం కోసం తన ఆస్తులను తప్పుడు విధానంలో విలువ కట్టినట్లు వచ్చిన ఆరోపణలపై 2019లో దర్యాప్తు ప్రారంభమైంది. ఆయన అనుసరించిన వ్యాపార పద్ధతులకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని న్యూయార్క్ అటార్నీ జనరల్ కార్యాలయం ఆదేశించింది. ఈ పత్రాలను ఆయన సమర్పించకపోవడంతో స్టేట్ జడ్జి ఆర్థర్ ఎంగోరోన్ సోమవారం జారీ చేసిన ఆదేశాల్లో ట్రంప్ రోజుకు 10,000 డాలర్ల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించారు. ఈ పత్రాలను సమర్పించడంలో మరింత ఆలస్యం జరిగితే అటార్నీ జనరల్ కార్యాలయం కొన్ని వ్యాజ్య కారణాలపై దర్యాప్తును కొనసాగించడం సాధ్యంకాదని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో గోల్ఫ్ క్లబ్స్, ఓ పెంట్‌హౌస్ అపార్ట్‌మెంట్ సహా ట్రంప్ ఆస్తుల విలువను అక్రమ పద్ధతుల్లో లెక్కగట్టినట్లు వెల్లడైందన్నారు. 


ఇదిలావుండగా, డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేత, అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ డెమొక్రాట్ పార్టీకి చెందినవారు. దీంతో ఈ దర్యాప్తు రాజకీయ ప్రేరేపితమని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ట్రంప్ తరపు న్యాయవాది అలీనా హబ్బా మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆదేశాలపై అపీలు చేస్తామన్నారు. 


స్వయంగా హాజరుకావాలని ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని ట్రంప్ కోరినప్పటికీ ఫలితం దక్కలేదు. మార్చి 3 నాటికి డాక్యుమెంట్లను సమర్పించాలన్న ఆదేశాలను ఆయన పాటించలేదు. ఆయన తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు ఈ గడువును మార్చి 31 వరకు పొడిగించినా ఆ డాక్యుమెంట్లను ఆయన సమర్పించలేదు. 


గతంలో జేమ్స్ తెలిపిన వివరాల ప్రకారం, ట్రంప్ ఆర్గనైజేషన్ తన ఆస్తుల విలువపై తప్పుదోవ పట్టించే విధంగా దాదాపు పదేళ్ళపాటు ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. 

 


Updated Date - 2022-04-28T00:49:58+05:30 IST