78 రోజుల లాక్‌డౌన్ తర్వాత తెరుచుకున్న న్యూయార్క్ నగరం

ABN , First Publish Date - 2020-06-09T03:13:03+05:30 IST

అమెరికాలో అత్యధిక కరోనా కేసులు న్యూయార్క్‌లోనే నమోదైన విషయం తెలిసిందే.

78 రోజుల లాక్‌డౌన్ తర్వాత తెరుచుకున్న న్యూయార్క్ నగరం

న్యూయార్క్: అమెరికాలో అత్యధిక కరోనా కేసులు న్యూయార్క్‌లోనే నమోదైన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి న్యూయార్క్ అతలాకుతలమైంది. కరోనాకు కేంద్రంగా మారిన న్యూయార్క్‌లో ఏ ఆసుపత్రిలో చూసినా శవాల దిబ్బలే దర్శనమిచ్చాయి. అయితే న్యూయార్క్‌లో ప్రస్తుతం కరోనా అదుపులోకి వచ్చింది. దీంతో 78 రోజుల లాక్‌డౌన్ తరువాత న్యూయార్క్ నగరం తిరిగి సోమవారం తెరుచుకుంది. దాదాపు మూడు నెలల నుంచి ఇళ్లకే పరిమితమైన ప్రజలు కూడా బయటకు వచ్చేందుకు అనుమతి లభించింది. విడతల ప్రకారం ఒక్కో రంగానికి మినహాయింపులు ఇస్తూ వెళ్తామని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో అన్నారు. సోమవారం నుంచి మొదటి విడతలో భాగంగా నిర్మాణ రంగం, రిటైల్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, హోల్ సేల్ ట్రేడ్, అగ్రికల్చర్, ఫిషింగ్ అండ్ హంటింగ్ ఇండస్ట్రీలు తెరుచుకోనున్నాయి. హెయిర్ సెలూన్లు, ఆఫీసులు, బార్స్, రెస్టారెంట్స్‌లోని ఇండోర్ సీటింగ్‌లకు మాత్రం రెండో విడతలో అనుమతివ్వనున్నారు. మెట్రో రైళ్లు, బస్సులు కూడా పూర్తిస్థాయిలో సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రాత్రి 1 నుంచి ఉదయం ఐదు వరకు మాత్రం మెట్రో సేవల నిలిపివేయనున్నారు. ఈ సమయంలో రైళ్లను డిస్‌ఇన్‌ఫెక్టెంట్ చేయనున్నారు. మరోపక్క న్యూయార్క్‌లోని మెట్రో ట్రైన్‌లో గవర్నర్ ఆండ్రూ క్యూమో పర్యటించి ప్రయాణికులతో సంభాషించారు. కాగా.. న్యూయార్క్‌లో ఇప్పటివరకు 3,98,828 కేసులు నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 20,10,442 మంది కరోనా బారిన పడగా.. కరోనా కారణంగా మొత్తం 1,12,549 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-06-09T03:13:03+05:30 IST