న్యూయార్క్‌లో మరణ మృదంగం.. ఒక్క రోజే 630 మంది మృతి

ABN , First Publish Date - 2020-04-06T07:57:52+05:30 IST

కరోనా కోరల్లో చిక్కి అమెరికా విలవిలలాడుతోంది. కేవలం పాజిటివ్‌ కేసులే నమోదైన సంఖ్య 3,12,146కి చేరినట్లు జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇంతవరకు 8,162 మంది ఈ మహమ్మారికి బలయ్యారని వెల్లడించింది. ఇంకోవైపు.. న్యూయార్క్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. గత 24 గంటల్లో 630 మంది మరణించారు.

న్యూయార్క్‌లో మరణ మృదంగం.. ఒక్క రోజే 630 మంది మృతి

  • వారంలోగా పరిస్థితి మరింత ప్రమాదకరం
  • అమెరికాలో పాజిటివ్‌ కేసులే 3.12 లక్షలు
  • మరణాల సంఖ్య 8,162..
  • ఆరోగ్య సిబ్బందికి మాస్క్‌లు, పీపీఈల కొరత..
  • వెంటిలేటర్లకూ ఇబ్బందే


న్యూయార్క్‌, ఏప్రిల్‌ 5: కరోనా కోరల్లో చిక్కి అమెరికా విలవిలలాడుతోంది. కేవలం పాజిటివ్‌ కేసులే నమోదైన సంఖ్య 3,12,146కి చేరినట్లు జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇంతవరకు 8,162 మంది ఈ మహమ్మారికి బలయ్యారని వెల్లడించింది. ఇంకోవైపు.. న్యూయార్క్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. గత 24 గంటల్లో 630 మంది మరణించారు. వచ్చే వారం రోజుల్లో పరిస్థితి మరింత భయానక రూపం దాల్చవచ్చని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆండ్రూ కుమోవో ఆందోళన వ్యక్తంచేశారు.


ఈ నెల 2, 3వ తేదీల మధ్య 24 గంటల్లో 562 మంది చనిపోగా.. ఈ వైరస్‌ వల్ల ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసింది. శనివారం నుంచి ఆదివారుం ఉదయం వరకు 630 మంది చనిపోయారు. ఇంతవరకు ఈ వ్యాధికి ఈ రాష్ట్రంలో 3,565కి చేరాయి. దేశం మొత్తంలో పాజిటివ్‌ కేసులు 3.12 లక్షలకుపైనే ఉండగా.. ఒక్క న్యూయార్క్‌లోనే 1,13,704 కేసులు నమోదు కావడం గమనార్హం. 30 వేల పాజిటివ్‌ కేసులతో న్యూజెర్సీ రెండో స్థానంలో ఉంది. న్యూయార్క్‌ రాష్ట్రంలో కూడా న్యూయార్క్‌ నగరంలోనే అత్యధిక కేసులు (63,306) నమోదైనట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆరోగ్య సిబ్బందికి అత్యవసర రక్షణ పరికరాలైన మాస్కులు, గౌన్లు, వెంటిలేటర్లు, పీపీఈలు లేవని.. ఈ కారణంగానే వైరస్‌ కేసులు రానురాను పెరుగుతున్నాయని గవర్నర్‌ చెప్పారు. 17 వేల వెంటిలేటర్లకు ఆర్డర్‌ ఇస్తే ఫెడరల్‌ ప్రభుత్వం వద్ద అంత స్టాకు లేదని తెలిపారు. చైనా 1,000 వెంటిలేటర్లు పంపుతానని హామీ ఇచ్చిందన్నారు.


చైనాలోని వూహాన్‌లో కరోనా విస్తరించిందని చైనా ప్రకటించిన తర్వాత.. అక్కడి నుంచి 4.30 లక్షల మంది నేరుగా విమానాల్లో అమెరికా చేరినట్లు తెలిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమానాల రాకపోకలపై ఆంక్షలు ప్రకటించకముందు.. 1,300 విమానాల్లో అమెరికాలోని 17 నగరాలకు వీరంతా చేరుకున్నారు. ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 40 వేల మంది రావడం విశేషం. వీరందరి వల్లే అమెరికాలో కరోనా విస్తరించిందని పలు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. మీడియాపై ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై తప్పుడు వదంతుల ప్రచారం మానుకోవాలని సూచించారు. జనవరి మొదట్లో కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినా.. దీనికి అడ్డుకట్ట వేయడంలో అమెరికా నెలల తరబడి జాప్యం చేసినట్లు వెల్లడైంది. వైరస్‌ కట్టడికి అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుకోవలసి ఉండగా. రెండు నెలలుగా ట్రంప్‌ యంత్రాంగం అలసత్వంతో వ్యవమరించిందన్నవిమర్శలున్నాయి. 


65 వేల మంది బలి

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్నీ వణికిస్తోంది. 190 దేశాలకు వ్యాపించిన ఈ వైరస్‌.. ఇప్పటివరకు 12 లక్షల మందికిపైగా సోకగా.. 65,272 మందిని బలి తీసుకుంది. ఇందులో ఒక్క ఇటలీలోనే 15,362 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌ 12,418 మందిని కోల్పోయింది. అమెరికాలో 8,503 మంది, ఫ్రాన్స్‌లో 7,560, బ్రిటన్‌లో 4,313 మంది ఈ వైరస్‌ సోకి చనిపోయారు. అధికార వర్గాలను ఉటంకిస్తూ ఏఎ్‌ఫపీ సంస్థ ఆదివారం ఈ గణాంకాలను వెల్లడించింది. 

Updated Date - 2020-04-06T07:57:52+05:30 IST