New year వేడుకలపై స్వల్ప ఆంక్షలు

ABN , First Publish Date - 2021-12-14T13:44:21+05:30 IST

ప్రపంచాన్ని ‘ఒమైక్రాన్‌’ వణికిస్తున్న తరుణంలో కొత్త సంవత్సర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప ఆంక్షలు విధించింది. అయితే మరికొన్నింటిపై మాత్రం మరిన్ని సడలింపులు ఇచ్చింది. కొత్త సంవత్సర వేడుకలను

New year వేడుకలపై స్వల్ప ఆంక్షలు

- 31, 1 తేదీల్లో బీచ్‌ల వద్దకు అనుమతి రద్దు

- 3 నుంచి సాధారణ తరగతులు

- స్విమ్మింగ్‌పూల్స్‌కు అనుమతి

- ఇళ్లలో శుభకార్యక్రమాలకు ఓకే


చెన్నై: ప్రపంచాన్ని ‘ఒమైక్రాన్‌’ వణికిస్తున్న తరుణంలో కొత్త సంవత్సర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప ఆంక్షలు విధించింది. అయితే మరికొన్నింటిపై మాత్రం మరిన్ని సడలింపులు ఇచ్చింది. కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజల్లో అధికభాగం సముద్రతీరాలు, బీచ్‌ల వద్దకు వెళ్లడం ఆనవాయితీ. అందువల్ల ఈనెల 31వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు సముద్రతీర ప్రాంతాలు, బీచ్‌ల ప్రజల సందర్శనకు అనుమతి రద్దు చేసింది. అంతేగాక కొత్త సంవత్సరం మురిపెంలో ప్రజలు భారీగా గుమిగూడి వేడుకలు చేసుకోవడం తదితరాలకు దూరంగా వుండాలని సూచించింది. ప్రస్తుతం 6 నుంచి 12వ తరగతి వరకు రొటేషన్‌ విధానంలో తరగతులు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జనవరి 3వ తేదీ నుంచి ఆయా తరగతులు సాధారణ నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. స్విమ్మింగ్‌పూల్స్‌లపై వున్న ఆంక్షల్ని, ఇళ్లలో జరిగే కార్యక్రమాలపై వున్న నిబంధనల్ని రద్దు చేసింది. పండుగలు, పర్వదినాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ సభలు, సమావేశాలు తదితరాలన్నింటిపై ఇప్పటి వరకూ వున్న ఆంక్షలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌, డీజీపీ శేలైంద్రబాబు, రెవెన్యూ, విపత్తుల నివారణ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుమార్‌ జయంత్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌బేదీ, నగర పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ తదితర ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలో ‘ఒమైక్రాన్‌’ వైరస్‌ వ్యాప్తిని నిరోధించే దిశగా కొన్ని కట్టుబాట్లతో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రమంతటా డిసెంబర్‌ 31 నుంచి జనవరి ఒకటో తేదీ వేకువజాము వరకు జరిగే న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం విధించడం మంచిదని సమావేశం అభిప్రాయపడింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు సంబంధించిన కఠిన నిబంధనలేవీ అమలులో లేవు. ఇటీవలే నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న కేరళకు కూడా బస్సుసర్వీసులు ప్రారంభించారు. సినిమా థియేటర్లలో వందశాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 15న పూర్తి సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ గడువు ముగియనుండటంతో తదుపరి లాక్‌డౌన్‌ అమలుపై కొద్ది రోజులుగా వైద్యనిపుణుల సలహాలను సీఎం అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలలో కొత్త రూపు సంతరించుక్ను కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ కేసులు బయటపడుతుండటంతో రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ను ప్రస్తుతమున్నట్లే సడలింపులతో కొనసాగించాలా? లేక కొత్త నిబంధనలతో లాక్‌డౌన్‌ను అమలు చేయాలా? అనే విషయంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధికారులతో సమగ్రంగా చర్చించారు. అనంతరం సాయంత్రం కరోనా లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-12-14T13:44:21+05:30 IST