New Year-2022 : హైదరాబాద్‌లో అంతా.. ప్రశాంతం.. పోలీసుల ముందస్తు వ్యూహం Success

ABN , First Publish Date - 2022-01-02T18:33:05+05:30 IST

ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకునేలా చేయడంలో పోలీసులు సక్సెస్‌ అయ్యారు....

New Year-2022 : హైదరాబాద్‌లో అంతా.. ప్రశాంతం.. పోలీసుల ముందస్తు వ్యూహం Success

  • ఇన్సిడెంట్‌ ఫ్రీగా న్యూఇయర్‌ వేడుకలు
  • అడుగడుగునా నిఘా, వందల మంది పోలీసుల పహరా 
  • బందోబస్తును పర్యవేక్షించిన ట్రై కమిషనరేట్‌ సీపీలు
  • కనిపించని భౌతిక దూరం.. మాస్కులు..

హైదరాబాద్‌ సిటీ : ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకునేలా చేయడంలో పోలీసులు సక్సెస్‌ అయ్యారు. హోంగార్డు స్థాయి నుంచి సీపీల వరకు రాత్రంతా రోడ్డుమీదనే విధులు నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.


న్యూ ఇయర్‌ వేడుకలు ఇన్సిడెంట్‌ ఫ్రీ (జీరో యాక్సిడెంట్‌, జీరో డెత్‌)గా జరిగేందుకు పోలీసు బాస్‌లు మొదటినుంచి ప్రయత్నించారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించారు. వేడుకలు నిర్వహించే వారికి హెచ్చరికలు జారీ చేశారు. వేడుకలు జరిగే ప్రతిచోట పోలీసు పహరాను పటిష్టం చేశారు. మహిళలు, చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక సిబ్బందిని, షీటీమ్స్‌ను రంగంలోకి దింపారు. వందలాది మంది పోలీసులు రాత్రంతా రోడ్లపైన పహరా కాశారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ట్రై కమిషనరేట్‌ సీపీలు సీవీ ఆనంద్‌, మహేష్‌ భగవత్‌, స్టీఫెన్‌ రవీంద్ర రాత్రంతా భద్రతా చర్యలను పర్యవేక్షించారు. డీసీపీలు, ఏసీసీలు ఆయా కమిషనరేట్‌ పరిధిలో శాంతి భద్రతలకు స్వయంగా పరిశీలించారు.


నూతన సంవత్సర వేడుకలను  సంతోషంగా నిర్వహించుకున్న నగరవాసులు.. కరోనా నిబంధనలు మాత్రం తుంగలో తొక్కారు. ఎక్కడా కూడా భౌతిక దూరం పాటించలేదు. చాలామంది మాస్కులు ధరించలేదు. అయినా పోలీసులు, అధికారులు అవేవీ పరిగణనలోకి తీసుకోలేదు. కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న అధికారుల ప్రకటనలు ఎవరూ లెక్క చేయలేదు. ప్రజలు గుంపులుగా రోడ్లమీదకు రావడంతో పోలీసులు కేవలం భద్రతాఏర్పాట్లు, డ్రంకెన్‌ డ్రైవ్‌పై దృష్టి  సారించారు.


- నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీలు, ఏసీపీలు, కమిషనరేట్‌ సిబ్బందితో కలిసి సీపీ మహేష్‌ భగవత్‌ శనివారం కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌, డీసీపీ సలీమ, ఇతర డీసీపీలు ఏసీపీలు, కమిషనరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

- సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర  దుర్గంచెరువు వంతెనపై మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆఫీసర్‌ బొక్క గోపాల్‌తో కలిసి కేక్‌ కట్‌ చేశారు.  

- తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌, కేబీఆర్‌ పార్కు, క్లాక్‌ టవర్‌ సికింద్రాబాద్‌, కోఠి ఆంధ్రా బ్యాంక్‌తో పాటు చార్మినార్‌ కూడళ్ల వద్ద నగర సీపీ ఆనంద్‌ కేక్‌ను కట్‌ చేశారు.


2,498 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు అడుగడుగునా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో-200 సైబరాబాద్‌లో 200, రాచకొండలో- 100 స్పెషల్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 2,498 మంది తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో 1265మందితో హైదరాబాద్‌ టాప్‌లో నిలిచింది. సైబరాబాద్‌లో 873, రాచకొండలో 360 మంది డ్రైంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ పోలీసులకు చిక్కారు.


సిబ్బందికి అభినందనలు..

నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి సంఘటనలు జరగకుండా, ప్రశాంతంగా ముగిసేలా బందోబస్తు నిర్వహించిన పోలీసులకు అభినందనలు. అంతా కలిసి కట్టుగా సమన్వయంతో పనిచేయడంతోనే పోలీసులు సక్సెస్‌ అయ్యారు. - సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, సైబరాబాద్‌


జీరో ఇన్సిడెంట్‌గా వేడుకలు..

కొత్త సంవత్సర వేడుకల్లో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు, గొడవలు, అపశృతిలేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టిన రాచకొండ పోలీస్‌ సిబ్బందికి అభినందనలు. ముందునుంచి అనుకున్నట్లుగా ఇన్సిడెంట్‌ ఫ్రీగా వేడుకలు జరగడం ఆనందంగా ఉంది. - మహేష్‌ ఎం.భగవత్‌, రాచకొండ సీపీ


పకడ్బందీ వ్యూహం..

పోలీసుల పకడ్బందీ బందోబస్తు వ్యూహం నేపథ్యంలో నగరంలో తొలిసారిగా ఎలాంటి ప్ర మాదం జరగలేదు. నూతన సంవత్సరపు వేడుకల్లో పోలీసులకు సహకరించింనందుకు నగర ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు. - సీపీ ఆనంద్‌  


చెదురుమదురు ఘటనలు..

నగరంలో న్యూ ఇయర్‌ వేడుకలు ప్రశాంతంగా జరిగినప్పటికీ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కాలనీలో పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాలు కొట్టుకున్నారు. దాంతో గొడవ ఆపాలని వారి మధ్యలోకి వెళ్లిన వ్యక్తికి గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వనస్థలిపురం పరిధిలో మద్యం మత్తులో ఉన్న యువకులు ఇన్నోవా కారును స్పీడుగా నడిపి ఒక అపార్టుమెంట్‌ గోడను ఢీ కొట్టారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

Updated Date - 2022-01-02T18:33:05+05:30 IST