భాగ్యనగరంలో New Year పార్టీయింగ్‌లో తీరు మారింది.. భయమంతా ఇదే..!

ABN , First Publish Date - 2022-01-02T15:28:36+05:30 IST

భాగ్యనగరంలో New Year పార్టీయింగ్‌లో తీరు మారింది.. భయమంతా ఇదే..!

భాగ్యనగరంలో New Year పార్టీయింగ్‌లో తీరు మారింది.. భయమంతా ఇదే..!

  • రిసార్ట్స్‌, ఫాం హౌస్‌లకు గిరాకీ..


హైదరాబాద్‌ సిటీ/ రంగారెడ్డి అర్బన్‌ : నగరంలో కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో న్యూ ఇయర్‌ అనగానే భారీ సంఖ్యలో ఈవెంట్లు కనబడేవి. కానీ, ఈసారి ఆ సంఖ్య 50కి లోపే పరిమితమైంది. పబ్‌లు, క్లబ్‌లు, స్టార్‌ హోటల్స్‌లో రెగ్యులర్‌గా జరిగే పార్టీలే తప్ప పెద్ద ఈవెంట్లేమీ జరగలేదు. తారలు.. సెలబ్రిటీలు, డీజేలూ కరువయ్యారు. కపుల్స్‌కు మాత్రమే ప్రవేశం.. స్టాగ్స్‌కు అవకాశం లేదనే నిబంధనలు పార్టీ మూడ్‌పై భారీగానే ప్రభావం చూపాయి. వీటికి తోడు కరోనా, ఒమైక్రాన్‌ భయాలు పార్టీ ప్రియులను వెంటాడుతుండటంతో చాలామంది అపార్ట్‌మెంట్‌లు, ఫాంహౌస్‌ పార్టీలకు పరిమితమయ్యారు. గతంలో పార్టీల కోసమే గోవా లాంటి ప్రాంతాలకు వెళ్లిపోవడం కనిపించేది. కానీ ఈసారి మాత్రం అక్కడకు కూడా తక్కువగానే వెళ్లారు. దీంతో నగర శివార్లలోని ఫాంహౌ‌స్‌లన్నీ ఈసారి ఫుల్‌ అయ్యాయి. 


ఓ సోషలైట్‌,  పార్టీ ప్రియుడు సచిన్‌ మాట్లాడుతూ ‘గత ఇయర్‌ ఎండ్‌ కొవిడ్‌తోనే ముగిసిపోయింది. ఈసారి కాస్త ఎంజాయ్‌ చేద్దామనుకుంటే ఒమైక్రాన్‌కునుకు లేకుండా చేస్తోంది. ఎట్‌లీస్ట్‌ గోవా వెళ్దామన్నా క్వాలిటీ ఈవెంట్లు లేవు. అందుకే జహీరాబాద్‌లోని ఫాంహౌస్‌కు వెళ్లిపోయాం. బాగా కావాల్సిన వారు మాత్రమే వచ్చారు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారే’ అని అన్నారు.


రిసార్ట్‌లు కళకళ

ఈసారి డిసెంబర్‌ 31 శుక్రవారం రావడంతో మూడు రోజులు పార్టీయింగ్‌లో మునిగి తేలాలని సంపన్న, ఉన్నత తరగతితోపాటుగా మధ్య తరగతి కూడా ప్రణాళిక చేసింది.  గత ఏడాది కరోనా మహమ్మారితో వెలవెల బోయిన రిసార్స్ట్‌లు ఈ సారి కళకళలాడాయి. నాలుగైదు కుటుంబాలు కలిసి రిసార్ట్స్‌లను అద్దెకు తీసుకుని వేడుకలను సరికొత్తగా జరుపుకొన్నారు. నగర శివారులోని రెండు రిసార్స్ట్‌లలో ఈవెంట్‌ నిర్వహించుకోవడానికి దాదాపు రూ. 10 లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. గండిపేట చెరువుకు ఒడ్డున ఉండటంతో ఈ రిసార్స్ట్‌లకు అధికంగా డిమాండ్‌ లభించింది. కనకమామిడి సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో రూ.8లక్షలు, అదే రెవెన్యూలోని మరో రిసార్ట్స్‌లో రూ.7లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. 


బాకారం రెవెన్యూలోని మరో రిసార్ట్స్‌లో సుమారు రూ.6లక్షల వరకూ వసూలు చేశారు. అజీజ్‌నగర్‌, హిమయత్‌నగర్‌, తోల్‌కట్ట, ఎన్కేపల్లి, చిలుకూరు గ్రామాల్లోని రిసార్స్ట్‌ల్లో రూ. 5 లక్షల వరకు వసూలు చేశారు. ఒక్కో రిసార్ట్స్‌లో 30-50 మందికి పైగా కలిసి వేడుకలు జరుపుకున్నారు. అజీజ్‌నగర్‌ రెవెన్యూ పరిధిలోని ఓ రిసార్ట్‌లో సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు.. వారి సంబంధీకులు వేడుకల్లో పాల్గొన్నట్లు సమాచారం. శంకర్‌పల్లి మండలంలోని  ఓ రిసార్ట్‌లో ఒక్కో గదికి 6-8 వేల వరకు వసూలు చేశారు. అదే ఏరియాలో మరో రిసార్స్ట్‌లో ఒక్కో గదికి 10-15 వేల వరకు వసూలు చేశారు. 


కుటుంబ సభ్యుల నడుమ..

ఒకప్పుడు  కుటుంబ సభ్యుల నడుమ వేడుక చేసుకోవడాన్ని ఇబ్బందిగా భావించే వారు కూడా ఇప్పుడు ‘నా కుటుంబమే నాకు ముఖ్యం.. వారితో ఆనందంగా గడపడాన్ని మించిన ఆనందం ఎక్కడ లభిస్తుందని’ ఎదురు ప్రశ్నిస్తున్నారు.  చాలామంది నగరవాసులు ఇళ్లల్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు.

Updated Date - 2022-01-02T15:28:36+05:30 IST