నయా సాల్‌... నయా టేస్ట్‌

ABN , First Publish Date - 2021-01-02T05:50:41+05:30 IST

కొత్త ఏడాది అన్నీ కొత్తగానే చేయాలనుకుంటాం. అలానే కొత్త రుచులను ఆస్వాదించాలనుకుంటాం. ఎగ్‌ప్లాంట్‌ స్టీక్స్‌, మొజరెల్లా గోబీ కోఫ్తా, కోకొనట్‌ మాక్రూన్స్‌, స్వీడిష్‌ మీట్‌బాల్స్‌...

నయా సాల్‌... నయా టేస్ట్‌

కొత్త ఏడాది అన్నీ కొత్తగానే చేయాలనుకుంటాం. అలానే కొత్త రుచులను ఆస్వాదించాలనుకుంటాం.  ఎగ్‌ప్లాంట్‌ స్టీక్స్‌, మొజరెల్లా గోబీ కోఫ్తా, కోకొనట్‌ మాక్రూన్స్‌, స్వీడిష్‌ మీట్‌బాల్స్‌... వంటి వెరైటీ వంటకాలు అలాంటివే. ఇంకేం వీటిని వండివార్చి ఇంటిల్లిపాది రుచుల విందు చేసుకోండి మరి...


రొయ్యలు క్రిస్పీగా...


కావలసినవి

రొయ్యలు - అరకేజీ, కార్న్‌స్టార్చ్‌ - అరకప్పు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఎగ్‌వైట్స్‌ - మూడు, కొబ్బరి తురుము - రెండు కప్పులు, నూనె - సరిపడా, స్వీట్‌ రెడ్‌ చిల్లీ సాస్‌ - కొద్దిగా, పంచదార - రెండున్నర టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం

  • ఒక పాత్రలో కార్న్‌స్టార్చ్‌, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత అందులో రొయ్యలు వేసి మరోసారి కలిపి పక్కన పెట్టాలి.
  • మరొక పాత్రలో ఎగ్‌వైట్స్‌ తీసుకోవాలి. 
  • ఇంకో పాత్రలో కొబ్బరి తురుము, పంచదార వేసి కలియబెట్టాలి.
  • ఇప్పుడు రొయ్యలు ఒక్కోటి తీసుకుంటూ ఎగ్‌వైట్‌లో డిప్‌ చేస్తూ కొబ్బరి తురుము అద్దాలి.
  • వీటిని బేకింగ్‌ షీట్‌లో పెట్టి పైన కవర్‌ వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక రొయ్యలు వేసి వేగించాలి.
  • ఈ క్రిస్పీ రెసిపీ రెడ్‌ చిల్లీ సాస్‌తో తింటే రుచిగా ఉంటుంది.

ఎగ్‌ప్లాంట్‌ స్టీక్స్‌


కావలసినవి

వంకాయలు - నాలుగు, కాబూళి సెనగలు - అరకప్పు, క్యాప్సికం - మూడు(ఎరుపు, పసుపు, ఆకుపచ్చ), జున్ను - అరకప్పు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్‌, ఆలివ్‌ ఆయిల్‌ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, టొమాటో కెచప్‌ - మూడు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం

  • వంకాయలను పొడవు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 
  • కాబూళి సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టుకొని, మెత్తగా అయ్యే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • క్యాప్పికంను కట్‌ చేసి కాస్త వేగించి పక్కన పెట్టాలి.
  • ఒక ప్లేట్‌లో ఉప్పు, మిరియాల పొడి వేసి వంకాయ ముక్కలు రబ్‌ చేసి పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
  • గ్రిల్‌ పాన్‌ను వేడి చేసి కొద్దిగా నూనె చిలకరించాలి.
  • తరువాత వంకాయ ముక్కలను రెండు వైపులా కాల్చాలి. 
  • ఇప్పుడు ఆ ముక్కలకు టోమాటో సాస్‌ రాసి, సర్వింగ్‌ ప్లేట్‌లోకి తీసుకోవాలి.
  • ఉడికించిన కాబూళి సెనగలు, క్యాప్సికం ముక్కలు సమంగా పరచాలి. కొద్దిగా సాస్‌ పోయాలి. 
  • జున్ను, కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి. వీటిని చల్లగా లేదా వేడిగా సర్వ్‌ చేసుకోవచ్చు.

కోకొనట్‌ మాక్రూన్స్‌


కావలసినవి

కొబ్బరి తురుము - ఒక కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - అర కప్పు, వెనీలా ఎక్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌, ఎగ్‌వైట్స్‌ - రెండు, ఉప్పు - పావు టీస్పూన్‌, స్వీట్‌ చాక్లెట్‌ - అరకప్పు.


తయారీ విధానం

  • ఓవెన్‌ను 325 డిగ్రీల ఫారన్‌హీట్‌కు ప్రీ హీట్‌ చేసుకోవాలి. 
  • ఒక పాత్రలో కొబ్బరి తురుము తీసుకుని అందులో కండెన్స్‌డ్‌ పాలు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి కలుపుకోవాలి.
  • మరొక పాత్రలో ఎగ్‌వైట్స్‌ తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి మిక్సర్‌తో బాగా కలియబెట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కొబ్బరి తురుము ఉన్న పాత్రలో వేసి కలుపుకోవాలి. 
  • బేకింగ్‌ షీట్‌లో మిశ్రమాన్ని వేసి ఓవెన్‌లో ఉడికించాలి. 
  • తరువాత ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారిన తరువాత చాక్లెట్‌ మిశ్రమంలో డిప్‌ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. 
  • వీటిని ఫ్రిజ్‌లో పావు గంటపాటు పెట్టుకుంటే చాక్లెట్‌ గట్టిపడుతుంది. తరువాత సర్వ్‌ చేసుకోవాలి.

మొజరెల్లా గోబీ కోఫ్తా


కావలసినవి

కోఫ్తా కోసం: క్యాలీఫ్లవర్‌ - ఒక కప్పు, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, పెరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, మొజరెల్లా ఛీజ్‌ - పావు కప్పు, గరంమసాలా - ఒక టీస్పూన్‌, ఉప్పు - చిటికెడు, గ్రేప్‌ సీడ్‌ ఆయిల్‌ - రెండు టేబుల్‌స్పూన్లు.

రైతా కోసం : చిలగడదుంప - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, ఉల్లికాడలు - నాలుగైదు, క్రీమ్‌ - ఒక కప్పు, పాలు - అరకప్పు, ఉప్పు-చిటికెడు, గరంమసాలా - ఒక టీస్పూన్‌. 


తయారీ విధానం

  • క్యాలీఫ్లవర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఉల్లిపాయ, ఉల్లికాడలను సన్నగా తరగాలి. చిలగండదుంపను కట్‌ చేసి పెట్టుకోవాలి. 
  • ఒక మీడియం సైజు పాత్రలో క్యాలీఫ్లవర్‌ ముక్కలు తీసుకుని అందులో ఛీజ్‌, సెనగపిండి, పెరుగు, గరంమసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక క్యాలీఫ్లవర్‌ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ బాల్స్‌ చేసుకుని నూనెలో వేగించాలి. ముదురు గోధుమ రంగులోకి మారే వరకు వేగించుకోవాలి.
  • ఒక పాత్రలో చిలగడదుంపలు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. 
  • తరువాత నీళ్లన్నీ తీసేసి మరొక పాత్రలోకి చిలగడదుంపలు తీసుకోవాలి. వాటిలో ఉల్లిపాయలు, ఉల్లికాడలు, గరంమసాలా, తగినంత ఉప్పు వేసి కలపాలి. 
  • క్రీమ్‌, పాలు పోసి కలిపితే రైతా రెడీ. గోబీ కోఫ్తాలను ఈ రైతాతో తింటే రుచిగా ఉంటాయి.

స్వీడిష్‌ మీట్‌ బాల్స్‌


కావలసినవి

కోడిగుడ్లు - రెండు, బోన్‌లెస్‌ మటన్‌ - పావుకేజీ, క్రీమ్‌ - అరకప్పు, వైట్‌ శాండ్‌విచ్‌ బ్రెడ్‌ - ఒకటిన్నరకప్పు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, ఉప్పు - ఒకటిన్నర టీస్పూన్‌, బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు.

సాస్‌ కోసం : వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, లో సోడియం చికెన్‌ బ్రాత్‌(చికెన్‌ వేసి ఉడికించిన నీళ్లు) - మూడు కప్పులు, లైట్‌ బ్రౌన్‌ షుగర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, క్రీమ్‌ - ఒక కప్పు, సోయా సాస్‌ - ఒకటిన్నర స్పూన్‌, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర - గార్నిష్‌ కోసం కొద్దిగా.


తయారీ విధానం

  • ముందుగా ఓవెన్‌ను 325 డిగ్రీల ఫారన్‌హీట్‌కు  వేడి చేసుకోవాలి. 
  • ఒక బౌల్‌లో కోడిగుడ్లు కొట్టి వేయాలి. అందులో క్రీమ్‌, శాండ్‌విచ్‌ బ్రెడ్‌ ముక్కలు వేసి కలపాలి. 
  • మాంసం, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలను మిక్సీలో వేసి, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. మిశ్రమం మరీ పలుచగా కాకూడదు. గట్టిగానూ ఉండకూడదు.
  • ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బేకింగ్‌ షీట్‌లో వేసి 20 నిమిషాల పాటు ఓవెన్‌లో బేక్‌ చేయాలి.
  • మీట్‌ బాల్స్‌ ఉడుకుతున్న సమయంలో సాస్‌ తయారుచేసుకోవాలి. 
  • వెడల్పాటి పాన్‌ స్టవ్‌పై పెట్టి వెన్న వేసి వేడి చేయాలి. తరువాత అందులో చికెన్‌ బ్రాత్‌ పోయాలి. 
  • కాసేపయ్యాక బ్రౌన్‌ షుగర్‌ వేసి కలపాలి. పదినిమిషాల పాటు ఉడికించుకుంటే సాస్‌ చిక్కగా అవుతుంది. 
  • ఇప్పుడు క్రీమ్‌, సోయా సాస్‌, మిరియాల పొడి వేసి మరి కాసేపు ఉడికించాలి. 
  • తరువాత ఓవెన్‌లో ఉడికించి పెట్టుకున్న మీట్‌ బాల్స్‌ వేయాలి. 
  • కాసేపు ఉడికిన తరువాత నిమ్మరసం పిండుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని దింపాలి.
  • వేడివేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2021-01-02T05:50:41+05:30 IST